చైర్మెన్‌కు అవమానం జరిగిందని వైసీపీ నిరసన
పలుమార్లు సభ వాయిదా
అమరావతి : శాసనమండలి చైర్మెన్ మోషేన్ రాజును ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారంటూ శుక్రవారం మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం కొత్త భవనం ప్రారంభోత్సవానికి మండలి చైర్మెన్‌ను ఆహ్వానించలేదని, శిలాఫలకం, ఆహ్వానపత్రంలో మోషేన్ రాజు పేరు లేదని మండలిలో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంటరీ సదస్సుకు కూడా మండలి చైర్మెన్‌ను ఆహ్వానించలేదన్నారు. ఆహ్వానపత్రంలో ఆయన పేరు కూడా లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు శాసనమండలికి వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆహ్వాన పత్రికలో మోషేన్ రాజు పేరు లేకపోవడానికి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తాను శాసనసభ సెక్రెటరీ జనరల్‌ను సంప్రదించగా మిమ్మల్ని (చైర్మెన్) పిలిస్తే మీకు రావడం కుదరదని చెప్పినట్టు చెప్పారని మంత్రి…చైర్మెన్‌కు వివరించారు. అయితే ఇందుకు ఛైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా తప్పు.. నన్ను ఎవరూ పిలవలేదు’ అని చైర్మెన్ పేర్కొన్నారు. సీఎం వచ్చి సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
సీఎం క్షమాపణలు చెప్పాలని వారు నినాదాలు చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ అంశంపై సభ స్తంభించింది. శుక్రవారం టీ విరామం తరువాత సభ ప్రారంభం కాగానే ఈ అంశాన్ని వైసీపీ సభ్యులు ప్రస్తావించారు. వెంటనే సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.చైర్మెన్ తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. తరువాత టీడీపీ సభ్యులను మంత్రి నారా లోకేశ్ టీడీపీ శాసనపక్షం కార్యాలయంలోకి పిలిచి చర్చించారు. బొత్సతో సహా వైసీపీ సభ్యులు దాదాపు గంట సేపు సభలో ఉండిపోయారు. తిరిగి గంట తరువాత సభ ప్రారంభం కాగా, వైసీపీ సభ్యులు నేలపై బైటాయించి ఎంత రాత్రయినా ఇక్కడే ఉంటామని, సీఎం వచ్చి సమాధానం చెప్పాలని ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి వివరణ ఏమైనా ఉందా అని మంత్రి అచ్చెన్నాయుడును చైర్మెన్ ప్రశ్నించగా ఆయన ఏమీ మాట్లాడకుండా ఏమీ లేదని చేయి ఊపడం కన్పించింది. మంత్రుల నుంచి వివరణ ఏమీ రాకపోవడంతో వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయంపై లఘు చర్చను, సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ మోషేన్ రాజు ప్రకటించారు. దీంతో అక్కడ్నుంచి వైసీపీ సభ్యులు కూడా వెళ్లిపోయారు.