Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగు

స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగు

- Advertisement -

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

నవతెలంగాణ వనపర్తి

        ప్రతి ఇంటిలో స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన స్వాస్థ్‌ నారి’, ‘సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాస్థ్ నారి సశక్త్ పరివార్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ అభియాన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు అందించనున్న వైద్య సేవలను వార్డు వారిగా తిరిగి పరిశీలించారు. 

 ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో మహిళల ప్రాధాన్యత ఎంతో ఉంటుందనీ అంతటి ప్రాధాన్యత కలిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుపడుతుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్ నారి స్వశక్త్ పరివార్ కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు పుట్టిన బిడ్డ నుండి అన్ని వయసుల మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు(మెడికల్ టెస్ట్లు) జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నిర్వహించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు 11.40 గంటలకు దేశ ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కో రోజు ఒక్కో స్పెషలిస్ట్ వైద్యుడు వచ్చి మహిళలకు వైద్య పరీక్షలు చేసి చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు.  

      రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యా, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని వైద్య కేంద్రాలు, విద్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలో సైతం జిల్లా కలెక్టర్ , తనకు వచ్చే నిధులను విద్యా, వైద్య రంగాలకు వెచ్చించి అవసరమైన వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. 

    నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ప్రత్యేక శ్రద్ధ పెట్టీ యూనియన్ బ్యాంక్ సహకారంతో రూ. 2.5 కోట్ల వ్యయంతో ఒక సిటీ స్కాన్ సెంటర్ ను మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా మండలంలోని సోలీపూర్ గ్రామం అతి పెద్దదని, గ్రామానికి దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేనందున 6 పడకల వైద్య ఆసుపత్రిని సోలీపూర్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం అక్కడ శాశ్వత భవనం లేకపోవడంతో పాఠశాలకు చెందిన ఒక గదిలో వైద్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని త్వరలోనే వైద్య కేంద్రం ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. 

    జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులను గుర్తించి వైద్యం అందిస్తున్న స్వాస్థ్ నారి సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెగ్యులర్ గా అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరము జలుబు వంటి సాధారణ వైద్య చికిత్సలు జరుగుతుంటాయని కానీ ఈ 12 రోజులు మాత్రం మెడికల్ కళాశాల నుండి రోజుకో విభాగానికి సంబంధించిన ప్రొఫెసర్ వచ్చి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం చేస్తారని తెలిపారు. చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలతో పాటు అన్ని రకాల క్యాన్సర్, చెవి ముక్కు గొంతు, దంతాలు , టి.బి, మధుమేహం తదితర రకాల స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి చికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ వచ్చిన మహిళలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ ప్రొఫైల్ ఇస్తారని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 2 వరకు రోజువారీగా ఏ రోజున ఏ స్పెషలిస్ట్ వైద్యుడు రానున్నారో ముందుగానే ప్రజలకు తెలిసే విధంగా షెడ్యూల్ ను ప్రకటించి పత్రికల్లో సైతం వచ్చే విధంగా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు, డా. చైతన్య, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగా రావు, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్ రెడ్డి, ఇతర వైద్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -