నవతెలంగాణ – హైదరాబాద్ : మోడీ పాలనలో దేశం తిరోగమనంలో ఉందని, ప్రసంగాలు, మాటలు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర నూతన కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. దేశ ఐక్యతకు భిన్నంగా పరిపాలన చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలే ప్రత్నామ్నాయమని, ప్రజల గుండెల్లో ఎర్రజెండాకు చెరగని ఆదరణ ఉందని ఆయన తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఎపియుడబ్ల్యుజె, ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మీట్‌ది ప్రెస్ కార్యక్రమం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మతపరమైన దాడులు జరుగుతున్నాయని, మణిపూర్‌లో జరిగిన దాడులు, మహిళలను నగంగా రోడ్లపై ఊరేగించిన సంఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు.
మణిపూర్ ఘటనపై ప్రధాని స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఒక వైపు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ మరొక వైపు కార్పొరేట్ సంస్ధలు, వ్యక్తులకు లక్షల కోట్ల రుణాలు రద్దు చేయడాన్ని ఈశ్వరయ్య తప్పుబట్టారు. దేశ వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూత పడే పరిస్థితి ఉందని వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోగా కార్పొరేట్లకు రాయితీలు, వడ్డీల మాఫీ, రుణాల రద్దు పేరుతో సంపదను మోడీ ప్రభుత్వం దోచిపెడుతోందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బుందేల్‌ఖండ్ తరహా ఫ్యాకేజీ తీసుకువస్తామని చప్పి నేడు ఆ దిశగా ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన విమర్శించారు. మోడీ ప్రకటించిన జిఎస్‌టి సంస్కరణల వల్ల రాష్ట్రానికి వరిగిందేమీ లేదన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యాసంస్ధలకు కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారన్నారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి పేదలకు చదువును దూరం చేస్తున్నారన్నారు. మరో పక్క 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను పిపిపి మోడ్‌లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారన్నారు. రాబోయో రోజుల్లో పేదవాడికి వైద్యం అందని పరిస్థితికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు , పవన్‌కల్యాణ్‌లు నేడు మౌనం దాల్చారని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, అమాయకులపై జరుగుతున్న మారణహోమాన్ని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో ఐజెయు సభ్యులు షేక్ బాబు, ఎపియుడబ్ల్యుజె విజయవాడ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఆర్ రఘు పాల్గన్నారు.

