2025లో మైనార్టీలపై దాడులు తీవ్రం
2024తో పోలిస్తే 13 శాతం అధికం
పెరిగిన విద్వేష ప్రసంగాలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు
సీఎస్‌ఓహెచ్ నివేదిక
న్యూఢిల్లీ : భారతదేశంలోని లౌకిక స్వరూపం ప్రమాదంలో పడింది. గతేడాది 2025లో మతపరంగా మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రసంగాలు, దాడులు మరింత తీవ్రమయ్యాయి. దేశవ్యాప్తంగా ముస్లిములు, క్రైస్తవులు బెదిరింపులు, విధ్వంసం, హత్యలు వంటి దారుణాలకు గురయ్యారు. ఈ ఘటనలు దేశంలో పెరుగుతున్న మత విద్వేషం, మతతత్వ శక్తుల విధ్వంసక సమీకరణను వెల్లడిస్తున్నాయని పౌర హక్కుల సంఘాలు, పరిశోధనా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ (సీఎస్‌ఓహెచ్) ప్రాజెక్టు అయిన ఇండియా హేట్ ల్యాబ్ (ఐహెచ్‌ఎల్) తాజా నివేదిక ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా మతపరమైన మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరిగిన విద్వేష ప్రసంగాలు, దాడులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ముస్లిములు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని 1,318 విద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయి. 2024తో పోలిస్తే గతేడాదిలో 13 శాతం పెరుగుదల కనిపించింది.
2023తో పోలిస్తే ఈ పెరుగుదల ఏకంగా 97 శాతం ఉంది. ఈ సంఘటనలు 21 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, దేశరాజధాని న్యూఢిల్లీలో నమోదయ్యాయి. ఈ అన్ని కేసులను ఐక్యరాజ్యసమితి విద్వేషపూరిత ప్రసంగం నిర్వచనం ప్రకారం వర్గీకరించారు. వీటిల్లో మైనార్టీలపై కుట్రలు, హింసకు పిలుపులు, సామాజిక, ఆర్థిక బహ్కిషరణలకు విజ్ఞప్తులు, ప్రార్థనా స్థలాలను స్వాధీనం చేసుకోవడం లేదా వాటిని ధ్వంసం చేయాలనే డిమాండ్లు, అమానవీయ భాష, రోహింగ్యా శరణార్థులపై దాడులు ఉన్నాయి. ఈ సంఘటనల్లో 98 శాతం (1,289) సంఘటనలు ముస్లిములను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఇందులో 1,156 ఘటనలు నేరుగా, 133 సంఘటనలు క్రైస్తవులతోపాటు జరిగాయి. ఇవి గతేడాది కంటే 12 శాతం పెరిగాయి. క్రైస్తవులకు వ్యతిరేకంగా 162 విద్వేష పూరిత ప్రసంగ సంఘటనలు జరిగాయి. ఇవి అంతకుముందు ఏడాది 2024తో పోలిస్తే 41 శాతం పెరిగాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెచ్చుమీరిన విద్వేషం
బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనార్టీలపై దాడులు, విద్వేష పూరిత ప్రసంగాల ఘటనలు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 88 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే జరిగాయి. 2024తో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు 25 శాతం పెరిగాయి. 2025లో ఉత్తరప్రదేశ్‌లో 266, మహారాష్ట్రలో 193, మధ్యప్రదేశ్‌లో 172, ఉత్తరాఖండ్‌లో 155, ఢిల్లీలో 76 జరిగాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు 2024తో పోలిస్తే 34 శాతం తగ్గడం గమనార్హం. 2025లో ఈ రాష్ట్రాల్లో 154 ఘటనలు మాత్రమే జరిగాయి.
మైనారిటీ వ్యతిరేక ఘటనల్లో హిందూత్వ సంస్థలు
మైనారిటీ వ్యతిరేక సంఘటనల్లో ఎక్కువ వాటి వెనుక విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్‌దళ్ వంటి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ అతివాద హిందూ సంస్థలు ఉన్నట్టు నివేదిక తెలిపింది. సంఘ్ పరివార్ అంతర్జాతీయ విభాగమైన అంతర్జాతీయ హిందూ పరిషత్ (ఏహెచ్‌పీ) కూడా సంఘటనల వెనుక ఉన్నట్టు నివేదిక తెలిపింది.
బీజేపీ, హిందూత్వ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు
విద్వేష ప్రసంగాలు చేసిన వారిలో బీజేపీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (71 విద్వేష పూరిత ప్రసంగాలు) ముందు వరుసలో ఉన్నారు. ఈ తరువాత ఏహెచ్‌పీ అధిపతి ప్రవీణ్ తొగాడియా (46 ప్రసంగాలు), బీజేపీ సీనియర్ నాయకులు అశ్విని ఉపాధ్యారు (35) ఉన్నారు. హిందూ సన్యాసులు, మత నాయకులు 145 ప్రసంగాలు చేశారు. ఇది 2024 కంటే 27 శాతం ఎక్కువ. ఈ ప్రసంగాల్లో 308 ప్రసంగాలు హింసకు పిలుపునిచ్చాయి. 136 ప్రసంగాలు ప్రజలను ఆయుధాలు ఉపయోగించాలని పిలుపునిచ్చాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 78 ప్రమాదకర ప్రసంగాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 78 ప్రమాదకరమైన ప్రసంగాలు జరిగాయి. వీటిలో 40 శాతం హింసకు పిలుపునిచ్చేవే ఉన్నాయి. ఆందోళన కలిగించే ప్రసంగాల్లో మసీదులు, చర్చిలను తొలగించాలనే పిలుపు ఇచ్చినవి ఉన్నాయి. ‘చెదపురుగులు’, ‘పరాన్న జీవులు’, ‘రక్తపిసాసి జాంబీలు’ వంటి పదాలను ఉపయోగిస్తూ మానవత్వాన్ని కించపరిచే భాషను ఉపయోగించిన చేసిన ప్రసంగాలు 141 ఉన్నాయి. ఇలాంటి ప్రసంగాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా భారీ ఎత్తున దోహదపడింది. 1,278 విద్వేష ప్రసంగాలను సోషల్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. అత్యధికంగా ఫేస్‌బుక్‌లో 942, యూట్యూబ్‌లో 246, ఇన్‌స్టాగ్రామ్ 67, ఎక్స్ (గతంలో ట్విటర్)లో 23 ఉన్నాయి.
క్రిస్మస్ సమయంలో క్రైస్తవులపై దాడులు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో క్రిస్మస్ సమయంలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందూత్వ శక్తులు ఈ దాడులను చేశాయి. అయినప్పటికీ అక్కడి అధికార యంత్రాంగాలు నిందితులపై ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకపోవడం గమనార్హం. ఛత్తీస్‌గడ్‌లోని రారుపూర్, ఉత్తరప్రదేశ్‌లోని బరేలి, అసోంలోని నల్బరిలో, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఇవి తీవ్రస్థాయిలో జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల సమక్షంలోనే ఒక చర్చి ముందు హనుమాన్ చాలీసా, జై శ్రీరామ్ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒక చర్చిలో దృష్టిలోపంతో ఉన్న యువతిపై దాడి చేసినా పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు.
దాడుల్లో 50 మంది ముస్లింలు మృతి
గతేడాది ముస్లింలపై హింస పెరిగిందని హక్కుల సంఘాలు తెలిపాయి. 2025లో జరిగిన మత ఘర్షణలు, మూక దాడులు, ఇతర చట్ట విరుద్ధ సంఘటనల్లో కనీసం 50 మంది ముస్లింలు మరణించారని గణాంకాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, ఒడిశాలోని కటక్ వంటి ప్రాంతాల్లో ఈ మరణాలు ఎక్కువగా జరిగాయి. పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు మత విద్వేషాలను పెంచడానికి ఒక కారణంగా ఉన్నా బీజేపీ ఎన్నికల వ్యూహం ఈ పరిస్థితి ఏర్పడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముస్లింలతో శత్రుత్వం పెంచేందుకే విద్వేష ప్రసంగాలు, దాడులు : సీఎస్‌ఓహెచ్
సీఎస్‌ఓహెచ్ రీసెర్చ్ డైరెక్టర్ ఎవైన్ లీడిగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రకీబ్ హమీద్ మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక భయాన్ని, శత్రుత్వాన్ని సజీవంగా ఉంచడానికి హిందూత్వ సమూహాలు ఈ విద్వేష ప్రసంగాలు, దాడులను నిరంతరం కొనసాగిస్తున్నాయని తెలిపారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇవి జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీ ప్రోత్సాహంతో సంఘ్ పరివార్ సాగిస్తున్న కార్యకలాపాలతో దేశ లౌకిక స్వరూపం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే దేశ ప్రజాస్వామ్య, లౌకిక పునాదులు తీవ్రమైన ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.



