– పంచాయితీలో కత్తులతో ఇరు కుటుంబాల దాడి
– ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
– సుగ్లాంపల్లిలో రాజీ సమావేశంలో ఘటన
నవతెలంగాణ- సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్వహించిన పంచాయితీ రక్తపాతంగా మారింది. ఇరుగ్రూపుల మధ్య జరిగిన కత్తుల దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓదెల మండలానికి చెందిన మోటం మారయ్య, లక్ష్మీ దంపతులకు 15 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు సుగ్లాంపల్లిలో పంచాయితీ నిర్వహించారు. చర్చల సందర్భంగా మాటామాటా పెరిగి, ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో లక్ష్మీ తరపు బంధువులపై మారయ్య బంధువులు కత్తులతో దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా లక్ష్మీ బంధువులు కూడా దాడికి దిగారు. ఈ హింసాత్మక ఘర్షణలో మోటం మారయ్య సోదరుడు మోటం మల్లేష్ (40) అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మీ తరపున పంచాయితీకి వచ్చిన రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్ (35) తీవ్ర గాయాలతో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో మారయ్య బంధువులైన మధునయ్య, సారయ్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ, దాడికి ఉపయోగించిన ఆయుధాలు, ఇతర సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘర్షణకు కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఈ దారుణ సంఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది.
దంపతుల వివాదం రక్తసిక్తం
- Advertisement -
- Advertisement -