సీఎస్ కు టీజీజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని టీజీజేఏసీ కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ నాగులవంచ చంద్రశేఖర్, సెక్రెటరీ జనరల్ శానమోని నర్సిములు, జేఏసీ కోశాధికారి మురళీధర్ గౌడ్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కలిసి వినతి పత్రం సమర్పించారు. రెండున్నర ఏండ్లలో భాషా పండితులను పీఈటీలుగా అప్ గ్రెడేషన్, పదోన్నతులు, బదిలీలు, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీల భర్తీ తదితర సమస్యలను పరిష్కరించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పలు కీలక సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. సీపీఎస్ ను రద్దు చేయాలనీ, 2003 డీయస్సీ ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయాలనీ, హెల్త్ కార్డులను మంజూరు చేయాలనీ, ఉపాధ్యాయుల బోధనానుభవాన్ని పరిగణనలోకి తీసుకుని టెట్ అర్హత మార్కులు తగ్గించడం లేదా 10 మార్కులు అదనంగా కలిపి న్యాయం చేయాలని కోరారు. 1/2005 చట్టం రద్దు చేసి భాషాపండితులకు నోషనల్ సర్వీస్ మంజూరు చేయాలనీ, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలనీ, ఉపాధ్యాయులకు ప్రతి నెలా పదోన్నతులు కల్పించాలనీ, ప్రాన్‌లో వంద శాతం నిధులు జమ అయ్యేలా చూడాలనీ, పీఆర్సీ ఆలస్యంతో నష్టపోయిన 2017 టీఆర్టీ ఉపాధ్యాయులకు ఆ నష్టాన్ని భర్తీ చేయాలనీ, ఎస్జీటీ ఉపాధ్యాయులకు వేతన వ్యత్యాసం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, మోడల్ స్కూల్స్, ఐటీడీఏ పాఠశాలల సమస్యలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్ల డిమాండ్లను సీఎస్ దృష్టికి వారు తీసుకెళ్లారు. సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారితో పాటు జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీజేఏసీ నాయకులు కోరారు. వీటిపై సీఎస్ రామకృష్ణారావు సానుకూలంగా స్పందించారనీ, బడ్జెట్ సమావేశాల అనంతరం మరోసారి సమావేశమై పూర్తి స్థాయిలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



