Wednesday, July 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువీఆర్‌ఏ వారసుల అరణ్యరోదన

వీఆర్‌ఏ వారసుల అరణ్యరోదన

- Advertisement -

– నాలుగేండ్లలో 500 మంది మరణం
– నిరాశతో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు
– కాంగ్రెస్‌ సర్కారుదీ నాన్చివేత ధోరణే
– ఎన్నికల హామీ బుట్టదాఖలు

పూర్వ వీఆర్‌ఏ వారసుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉద్యోగ భద్రత కరువై, చేసిన అప్పులు తీర్చలేక నాలుగేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 340 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాము అధికారంలోకి వస్తే జీవో 81,85 ప్రకారం వీఆర్‌ఏలను ఉద్యోగాల్లో తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. రెండేండ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. తమ ఉద్యోగాలు తమకు ఇప్పించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కొలువుల హామీపై గంపెడాశలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా వీరికి మాయమాటలు చెబుతూ సాగదీస్తూనే ఉంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రెవెన్యూ విభాగంలో వీఆర్‌వో వ్యవస్థను గత ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో రద్దు చేసింది. అప్పుడున్న ఆరు వేల మంది వీఆర్‌వోలను వివిధ శాఖల్లో సర్దు బాటు చేసింది. రెవెన్యూ వ్యవస్థలో జరిగిన కొన్ని సంఘటనలను బూచిగా చూపిం చిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను కూడా రద్దు చేసి వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. డిగ్రీ చదివిన వారిని జూనియర్‌ అసిస్టెంట్‌గా, ఇంటర్‌ చదివిన వారిని రికార్డ్‌ అసిస్టెంట్‌గా, పదవతరగతి చదివిన వారిని ఆఫీస్‌ సబార్డినెట్‌గా నియమిస్తామని ప్రకటించింది.

ఏడాది గడిచినా పట్టించుకోక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టారు. ఏకంగా 81 రోజుల పాటు విధులు బహిష్కరించి రోడ్డెక్కారు, దాంతో దిగొచ్చిన సర్కార్‌ వీఆర్‌ఏలను ఉద్యోగాల్లో తీసుకుంటామని హామీ ఇస్తూ జీవో 81,85 తెచ్చింది. వారి విద్యార్హతల ఆధారంగా మూడు కేటగిరీల్లో 2023 చివరి వరకు 16,758 మంది వీఆర్‌ఏలను వివిధ విభాగాల్లో సర్దు బాటు చేసింది. మిగిలిన 3,797 మంది 61 ఏండ్లకు పైబడిన వారసత్వ వీఆర్‌ఏలను పట్టించుకోలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం… కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది. తాము అధికారంలోకివ వస్తే మిగిలిన వీఆర్‌ఏ వారసులకు గత సర్కార్‌ ఇచ్చిన జీవోల ప్రకారం ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి వీరి నియామకం పట్ల ఎలాంటి హామీ రాలేదు. రెండేండ్లుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వీఆర్‌ఏల రోదన అరణ్యరోదనగానే మిగిలింది.


చేసిన అప్పులు తీర్చలేక…
వారసత్వ వీఆర్‌ఏలంటే తాతల, తండ్రుల కాలంనుంచి గ్రామాల్లో కాపాలా కాసే ఉద్యోగం. రెవెన్యూ వ్యవస్థలో వచ్చిన మార్పుల క్రమంలో అప్పటి సర్కార్‌ వీఆర్‌ఏలను ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటు చేస్తామని జీవో 81.85 తెచ్చింది. దీంతో తరతరాలుగా ఈ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు సంతోషపడ్డాయి. దాంతో పాటే వీఆర్‌ఏ ఉద్యోగాల కోసం పోటీ కూడా పెరిగింది. జీఓలు ఇచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోతుందా? అని కొందరు, తండ్రి ఉద్యోగం కోసం అన్నదమ్ములకు ఉన్న అరెకరం, ఎకరం భూమిని రాసి ఇచ్చారు. అప్పులు చేసి తమ సోదరులకు లక్షల రూపాయలు వాటా కింద ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగం రాక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆర్ధికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడున్నారు.


ఉద్యోగం ఇప్పించండి : కె.పెంటయ్య, తాళ్లపెల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లా
మూడు తరాలుగా గ్రామంలో ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నాం. నాకు 61 ఏండ్లు పైబడటంతో మా కొడుక్కు ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. గ్రామంలో ఏ ఆఫీసరచ్చినా, ఏ కార్యక్రమం జరిగినా అన్నింటికి మేమే ముందుండి పనులు చేస్తుంటాం. దయ చేసి మాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి.


ఆర్థికంగా చితికి పోయాం : నేరెళ్ల శ్రీనివాస్‌, ముట్రాజ్‌పల్లి, సిద్దిపేట జిల్లా
మా తండ్రి నేరెళ్ల ఎల్లయ్యతో పాటు ఆయన తండ్రి, తాత నుంచి నాలుగు తరాలుగా ఇదే నౌకరి చేస్తున్నాం. దీని కోసం ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొన్నాం. ఉద్యోగం రాక, అప్పులు పెరిగి అర్థికంగా చితికి పోయాం. ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే మాకు ఉద్యోగాలివ్వాలి


ముఖ్యమంత్రి ఆదుకోవాలి : బి.రాములు, జోగిపేట, సంగారెడ్డి జిల్లా
మా కొడుక్కు ఉద్యోగం వస్తుందనే ఆశతో నాలుగేండ్లుగా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నాం. నాకు వయసు మీద పడటంతో ఐదేండ్లుగా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మమ్ముల్ని ఆదుకుని ఉద్యోగాలివ్వ్లాని వేడుకుంటున్నాం.


జీవో 81, 85 వెంటనే అమలు చేయాలి : వంగూరి రాములు, వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్‌
జీవో 81, 85ను వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం ప్రకటించిన విధంగా కేటగిరీల వారీగా వారిని వివిధ విభాగాల్లో సర్దుబాటు చేయాలి. పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, రెవెన్యూ అధికారులను కలిసి దండం పెట్టి మా సమస్యలు విన్నవించినా ఫలితం లేక పోయింది. జిల్లా కలెక్టర్‌ ఆఫీసుల వద్ద, ప్రజా భవన్‌, గాంధీ భవన్‌ వద్ద నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సర్కార్‌ స్పందించాలి. లేకుంటే ఆంధోళన ఉధృతం చేస్తాం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -