గుస్సాడి దండారీ ఉత్సవాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ-సిరికొండ
ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని, వాటిని కాపాడుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామంలో ఆదివాసుల పెద్ద పండుగైన గుస్సాడి దండారీ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్‌సింగ్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఆదివాసులది విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని అన్నారు. వాటిని కాపాడుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించి, భావితరాలకు తమ సంప్రదాయాలను తెలియపరుస్తూనే అభివృద్ధి సాధించాలని సూచించారు.
ముఖ్యంగా యువత విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పోరాడాలని చెప్పారు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలని, మంత్రతంత్రాలను నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ రాజు, ఎస్‌ఐ పూజ, గ్రామపటేల్ శంకర్, మాజీ సర్పంచ్ పెందూర్ అనిల్ కుమార్, ప్రహ్లాద్, అమృత్‌రావ్, భీంరావ్, సీతారాం పాల్గొన్నారు.