Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవివాహితుడిని ప్రేమించిన కూతురు

వివాహితుడిని ప్రేమించిన కూతురు

- Advertisement -

పరువు పోతుందని హత్య చేసిన తల్లిదండ్రులు
ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
పోలీసుల విచారణతో వెలుగులోకి..
కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలో దారుణ ఘటన

నవతెలంగాణ – సైదాపూర్‌
కూతురు ఓ వివాహితుడిని ప్రేమిస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు.. పలుమార్లు మందలించినా మారకపోవడంతో.. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనుకుని కన్న కూతురిని కర్కషంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుజూసింది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని సర్వాయిపేట గ్రామ పరిధిలోని శివరాంపల్లిల్లో జరిగింది. సైదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో గురువారం హుజురాబాద్‌ ఏసీపీ మాధవి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శివరాంపల్లికి చెందిన రెడ్డి రాజు, రెడ్డి లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె(16) అదే గ్రామానికి చెందిన ఓ వివాహితుడిని ప్రేమిస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు.

అయినా తీరు మారకపోవడంతో నవంబర్‌ 14వ తేదీన బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. తరువాత తమ కూతురు కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి చనిపోయిందని తల్లిదండ్రులు సైదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వారు చెప్పిన విషయాలు పొంతన లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఫోరెన్సిక్‌ నివేదికతో హత్యగా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులను విచారించారు. ప్రేమ వ్యవహారం బయటికి వస్తే పరువుపోతుందని హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఏసీపీ మాధవి తెలిపారు. సమావేశంలో హుజురాబాద్‌ రూరల్‌ సీఐ పులి వెంకట్‌, సైదాపూర్‌ ఎస్‌ఐ తిరుపతి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -