జ్యూరిచ్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రానికి తిరిగొచ్చిన మంత్రులు, అధికారుల బృందం
చివరిరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సు గురువారం ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు మూడు రోజుల ఈ సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఆవిష్కరించిన విజన్-2047 డాక్యుమెంట్ ను విస్తృత ప్రచారం కల్పించడంలో సీఎం నేతృత్వంలోని బృందం సక్సెస్ అయ్యింది. ఈ వేదికపై పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. దావోస్ పర్యటన ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి జ్యూరిచ్ వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు.
మంత్రుల బృందం దావోస్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. దావోస్ లో రాష్ట్ర బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), సుస్థిరాభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికారుల బృందం సందర్భాన్ని బట్టి వేర్వేరుగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
ఏఐ ఇన్నోవేషన్ హబ్
తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఇన్నోవేషన్ హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో పియర్సన్ సంస్థ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అలాగే జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (డీఎమ్‌సీసీ) ఒప్పందం చేసుకుంది. రెండు దేశాల మార్కెట్లు, ఎకోసిస్టమ్‌లపై అవగాహన కల్పించడంతోపాటు, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తారు.
స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
ఇప్పటికే రాష్ట్రంలో పనిచేస్తున్న స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్ ప్రాంతాల్లోని యూనిట్లను రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆ సంస్థ సీఈఓ దీపక్ శర్మ ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ చేశారు. వీరిద్దరూ రాష్ట్ర విద్యుత్‌రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండిస్టీయల్ పార్కులు , పట్టణ మౌలిక వసతులు, డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థకు రాష్ట్రంలో 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.
100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్
నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ వోల్ట్ సంస్థ రాష్ట్రంలో రూ.5వేల కోట్ల వ్యయంతో వంద మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 4వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆసంస్థ దావోస్‌లోని రాష్ట్ర బృందానికి ప్రణాళికలు వివరించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ హాన్ డీ గ్రూట్, రినవబుల్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకులు స్టీవెన్ జ్వాన్, ఇండియా సీఈఓ అలోక్ నిగమ్‌లు సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.
పునరుత్పాదక ఇంథనంలో ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి కనబర్చింది. ఆ సంస్థ డైరెక్టర్ దేవాంశ్ జైన్ రాష్ట్ర ప్రభుత్వ బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోలార్ మాడ్యూల్స్, ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్ కో ఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్ సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్-2024 లక్ష్యాలను ప్రసంశించారు. ఏటా జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలనే ప్రతిపాదనను స్వాగతించారు. దానికి తమ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో
భారత్ ఫ్యూచర్ సిటీలో హైసింగ్ ప్రాజెక్టుల కోసం గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మెన్ అండ్ ఎమ్‌డీ నాదిర్ గోద్రేజ్‌తో మంత్రుల బృందం భేటీ అయ్యింది. నివాస ప్రాంతాల్లో భారీ గృహ నిర్మాణాలు, స్కూళ్లు, ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లు ఇతర మౌలిక సౌకర్యాల గురించి చర్చించారు. అలాగే ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, రూ.150 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లోని గోద్రేజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్ విస్తరణ అంశాలపై చర్చించారు. నాదిర్ గోద్రేజ్‌ను హైదరాబాద్ రావాలని ఆహ్వానించారు.



