ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ – పరకాల : ఇటీవల గురుకుల పాఠశాల (మల్లక్కపేట) పదవ తరగతి విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీవాణి జ్ఞాపకార్థం సోమవారం స్వేరో ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్లో సంతాప సభ నిర్వహించారు. స్వేరో నాయకులు సుభద్ర శ్యామల, చక్రి అద్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలో కలిసి ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంతో ఉన్నతికి ఎదగాల్సిన శ్రీవాణికి సన్మానం జరగాల్సిన చోట సంతాప సభ నిర్వహించాల్సిన రావడం బాధాకరమన్నారు. శ్రీ వాణి మరణానికి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వారం రోజుల్లోనే ముగ్గురు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరిగిందన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థిని స్వప్న మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు ఏదైనా వైద్యపరమైన ఆపద వస్తే ప్రభుత్వ హాస్పటల్లోనే చికిత్స చేయించాలనే నిబంధనలను ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. కనీస వసతులు, సరైన ఎక్విప్మెంట్స్ లేకుండా నేడు ప్రభుత్వ వైద్యశాలలు ఎలాంటి వైద్యాన్ని అందిస్తాయో అందరికీ తెలిసిన విషయమేమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 90 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగిందని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి ఉందన్నారు.
విద్యార్థులకు ఆ పనులను కేటాయించడం పట్ల గురుకుల సెక్రటరీ ధోరణి విద్యార్థులపై వివక్షపూరితంగా ఉంటుందని ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కలెక్టర్గా పనికిరాని అలుగు వర్షిని గురుకుల సెక్రటరీగా ఎలా పని చేస్తుందంటూ ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గురుకుల పాఠశాలలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దితే, ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు.
స్వేరో ఆశయం గొప్పది: మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి
పేదలంతా నా కుటుంబమే అని భావించి, వారి ఉన్నతికి ప్రధాన వనరు విద్యా అవకాశాలను అందించడమేనని భావించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషి ఎనలేనిది మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. అలాంటి ఆయన భావాలను కొనసాగించడం కోసం స్వేరో ఆశయం గొప్పదన్నారు. ఈరోజు స్వేరో ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యలు తరుచుగా జరుగుతుండడం పట్ల ధర్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో బిఆర్ఎస్, స్వేరో,తదితర ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.