నేడు ఐపీఎల్ సీజన్-2026 మినీ వేలం
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్-2026కు సంబంధించి మినీ వేలం మంగళవారం జరగనుంది. అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా జరిగే ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిసి గరిష్టంగా 77మంది ఆటగాళ్లను భర్తీ చేసుకోనున్నాయి. మధ్యాహ్నం 2.00గం||ల నుంచి జరిగే ఈ వేలంలో 77స్థానాలకు 359మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో 114మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా.. వారిలో 31 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది.
రిటెన్షన్ ప్రక్రియ తర్వాత కోల్‌కతా నైట్‌నైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు ఉండగా.. ముంబయి ఇండియన్స్ వద్ద అత్యల్పంగా రూ.2.75 కోట్లు ఉన్నాయి. 10 ఫ్రాంచైజీలు రూ. 237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. గత వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27కోట్లకు రిషబ్ పంత్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్ రూ.23.75కోట్లకు వెంకటేశ్ అయ్యర్‌ను కోనుగోలు చేసాయి. ఆ ఫ్రాంచైజీలు ఈసారి వారిద్దరినీ విడుదల చేయడం గమనార్హం. ఈసారి జరిగే మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కేమరూన్ గ్రీన్ అత్యధిక బేస్ ప్రైజ్ దక్కే ఛాన్స్ ఉంది.
రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఆటగాళ్లు…
రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో మొత్తం 45మంది ఆటగాళ్లు రిజిస్టర్ అయ్యారు. వీరిలో వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోరు, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జెమీ స్మిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డానియల్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్ వెల్, గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పతిరణ, తీక్షణ, హసరంగ, షారు హోప్, అల్జరీ జోసఫ్ ఉన్నారు.




