Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంపదికి పెరిగిన మృతుల సంఖ్య

పదికి పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -

వీరిలో ఆరునెలల చిన్నారి, ఆరుగురు మహిళలు
ఇండోర్‌ కలుషిత నీటి ఘటనలో ఒక అధికారి డిస్మిస్‌
మరో ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రజలకు కనీస ప్రాథమిక సౌకర్యాలను కూడా తీర్చలేకపోతున్నది. స్వచ్ఛమైన తాగునీటిని కూడా అందించలేకపోతున్నది. ‘స్వచ్ఛ భారత్‌’ అంటూ కేంద్రంలోని మోడీ ప్రకటనలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు.. స్వచ్ఛ నగరంగా గుర్తించబడిన ఇండోర్‌లో బురదనీరును పారిస్తున్నది. భగీరథపురాలో కలుషితమైన నీటిని తాగిన ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. వీరిలో ఆరు నెలల చిన్నారి, ఆరుగురు మహిళలు ఉన్నారు. జిల్లా యంత్రాంగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. ఇక మునిసిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసిన ఇదే నీటిని తాగి రెండు వేల మందికి పైగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కొందరు అధికారులపై వేటు పడింది. ఇండోర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఐఎంసీ) పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ (పీహెచ్‌ఈ) విభాగానికి చెందిన ఇంచార్జ్‌ సబ్‌-ఇంజినీర్‌ శుభం శ్రీవాస్తవను విధుల నుంచి తప్పించారు.

ఇక జోనల్‌ అధికారి శాలిగ్రామ్‌ సిటోలే, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ యోగేశ్‌ జోషిని సస్పెండ్‌ చేశారు. ”7,992 ఇండ్లలో సర్వే జరిగింది. 39,854 మంది పర్యవేక్షణలో ఉన్నారు. 2,456 మంది అనుమానిత రోగులకు ప్రథమ చికిత్స అందింది. ప్రస్తుతం 162 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఐసీయూలో 26 మంది చేరారు” అని చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారి ప్రకటన పేర్కొన్నది. కాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర అధికారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈనెల 2లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాల్సిందిగా ఆదేశించింది. బాధితులకు ఉచిత వైద్య సేవలు ఇవ్వాలని కూడా తెలిపింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ కూడా ఈ ఘటనపై తీవ్రంగానే స్పందించింది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఐదుగురితో నిజ-నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కమిటీ ఈనెల 5న నివేదికను సమర్పించనున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -