మరో రూ.13వేలు తగ్గుదల
కిలో వెండిపై రూ.20వేల క్షీణత
ఈక్విటీ మార్కెట్‌లోనూ ప్రభావం
హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా ఆల్‌టైం రికార్డ్‌లను సృష్టించిన బంగారం, వెండి ధరలు క్రాష్ అవుతున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల కొనుగోలుదారులకు ఊరటనిస్తూ దిగివస్తోన్నాయి. సోమవారం కూడా బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.13,410, వెండిపై రూ.20,000 తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. మూడు సెషన్లలో కిలో వెండిపై రూ.2 లక్షలు క్షీణించింది. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.13,410 పతనమై రూ.1,47,170కి పరిమితమయ్యింది.
22 క్యారెట్ల ధర రూ.12,300 తగ్గి రూ.1,34,900గా నమోదయ్యింది. మూడు సెషన్లలో బంగారం రూ.30,000 పైగా దిగివచ్చింది. సోమవారం కిలో వెండిపై రూ.20,000 కోల్పోయి రూ.3 లక్షలుగా పలికింది.ఈ లోహం మూడు సెషన్లలో రూ.1.25 లక్షలు తగ్గింది. వెండి ధరలలో వచ్చిన ఈ సునామీ ప్రభావం సిల్వర్ ఈటీఎఫ్‌ల మీద తీవ్రంగా పడింది. ఒక్కరోజే వివిధ సంస్థల ఇటిఎఫ్‌లు 14 నుంచి 19 శాతం వరకు పతనమయ్యాయి. ప్యూచర్ మార్కెట్లలో మూడు సెషన్లలో రూ.4.20 లక్షల నుంచి రూ.2.27 లక్షలకు పతనం కావడం విశేషం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాటా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ సంస్థల సిల్వర్ ఫండ్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అయితే మార్కెట్‌లో అస్థిరత ఇంకా కొనసాగుతున్నందున, కొనుగోలుదారులు. మదుపర్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకు తగ్గుతున్నాయంటే..!
అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్‌గా కెవిన్ వార్ష్ పేరును డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడంతో డాలర్ ఒక్కసారిగా బలోపేతం కావడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణమైంది. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో మదుపర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మరోవైపు ఇరాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకునే అవకాశం ఉందంటూ ట్రంప్ ఇచ్చిన సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలను తగ్గించాయి. యుద్ధ భయం తొలగడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు.



