Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచిచ్చురేపిన ఓటమి

చిచ్చురేపిన ఓటమి

- Advertisement -

ఓడిన సర్పంచ్‌ అభ్యర్థి.. ‘చావుడప్పు’ కొట్టేందుకు దళితుల నిరాకరణ
ప్రతిగా వారిని సామాజిక బహిష్కరణ చేసిన గ్రామస్తులు
అధికారులకు ఫిర్యాదుతో గ్రామంలో విచారణ..రాజీ


నవతెలంగాణ-కామారెడ్డి/భిక్కనూర్‌
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి గ్రామంలో చిచ్చు రేపింది. తమ సర్పంచ్‌ అభ్యర్థిని గెలిపించలేదని దళితులు సహాయ నిరాకరణ చేశారు. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే డప్పు కొట్టేందుకు ముందుకు రాలేదు. పెద్దమనుషులు మాట్లాడి సముదాయించినా వినిపించుకోలేదు. దీంతో ప్రతిగా గ్రామస్తులు ఏకమై దళితులను సామాజిక బహిష్కరణ చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం ఈసన్నపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సర్పంచ్‌ ఎన్నికల్లో గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్‌ వచ్చింది. అయితే గ్రామంలో మాల సామాజిక తరగతి నుంచి ముగ్గురు, మాదిగ సామాజిక తరగతి నుంచి ఇద్దరు సర్పంచ్‌ పదవికి పోటీ చేశారు. మాల సామాజిక తరగతికి చెందిన వ్యక్తి సర్పంచ్‌ ఎన్నికల్లో గెలుపొందాడు. తమ అభ్యర్థిని గెలిపించలేదని దీంతో గ్రామంలో ఉత్సవాలకు, వివాహాలకు, ఎవరైనా చనిపోతే డప్పు కొట్టొద్దని మాదిగ సామాజిక తరగతి వారు నిశ్చయించుకున్నారు.

ఈ క్రమంలో గ్రామంలో రెండ్రోజుల కిందట ఓ వ్యక్తి చనిపోతే డప్పు కొట్టేందుకు పిలవగా మాదిగ సామాజిక తరగతి వారు వెళ్లలేదు. పెద్దమనుషులు, ఇతరులు వచ్చి అడిగినా నిరాకరించారు. తమకు సహాయ నిరాకరణ చేస్తున్న మాదిగ సామాజిక తరగతిని సామాజిక బహిష్కరణ విధిస్తూ గ్రామస్తులు తీర్మానించుకున్నారు. వారితో ఎవరూ మాట్లాడొద్దని, కిరాణ దుకాణాల్లో వస్తువులు విక్రయించొద్దని, సహాయం చేసిన వారికి రూ.50 వేలు జరిమానా విధిస్తాం’ అని తీర్మానించారు. తీర్మానాలను పేపర్‌పై రాసి గ్రామ వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశారు. దీంతో దళితులు ఎమ్మార్పీఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర, కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌కు ఫిర్యాదు చేశారు. తమ కాలనీకి వచ్చే నీటి మోటర్లను తీసుకెళ్లారని, పిల్లలను స్కూలుకు రానివ్వడం లేదని, బీడీలు కూడా తీసుకోవద్దని మునీమ్‌కు చెప్పారని, మహిళా సంఘాల డబ్బులు తీసుకోవద్దని గ్రామ సీఏలకు చెప్పారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆందోళన చేయడం లేదని చెప్పారు. దీంతో కలెక్టర్‌ సూచనతో ఆర్‌డీవో, భిక్కనూర్‌ సీఐ, ఎస్‌ఐ, ఎంపీడీవో, తహసీల్దార్‌, ఆర్‌ఐ ఆధ్వర్యంలో ఇరు గ్రూపులను పిలిచి నచ్చజెప్పి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇరు గ్రూపులను కాంప్రమైజ్‌ చేసినట్టు ఎస్‌ఐ డి.ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -