Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంలేహ్ ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి

లేహ్ ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి

- Advertisement -

పోలీసుల అణచివేత చర్యలను ఖండించిన సీపీఐ(ఎం)
తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : లడఖ్‌ ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో వున్న కేంద్ర పాలిత ప్రాంత పాలనా యంత్రాంగం చేపట్టిన దారుణమైన అణచివేత చర్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిం చింది. హింసాత్మకంగా సాగిన ఈ అణచివేత చర్యల ఫలితంగా నలుగురు మరణించారని, అనేకమంది గాయపడ్డారని పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి అధికారంతో కూడిన చట్టసభతో తమకు రాష్ట్ర హోదా కావాలని గత ఆరేండ్లుగా లడఖ్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తూనే వున్నారు. అలాగే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చాలని కోరుతున్నారు. దీనివల్ల పలు వాయవ్య రాష్ట్రాల్లోని ప్రజలు అనుభవించే ప్రయోజనాలతో పాటూ రాజ్యాంగ రక్షణలు కూడా వారికి లభిస్తాయి. కానీ ఈ హక్కుల కోసం వారు చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చట్టబద్ధమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా గత మూడేండ్లుగా అనేక దఫాలుగా చర్చలు జరిగినా తమ ఆందో ళనలేవీ పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తికి, అసహనానికి గురైన లేహ్ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ), ఇతర ప్రజా సంఘాలు గత 15 రోజులుగా శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు.

అటువంటి వారితో అర్ధవంతమైన చర్చలు జరపడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం నిరాహార దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఈ పరిస్థితి ఒక్కసారిగా విస్తృతంగా నిరసనలకు, ప్రజల్లో అశాంతికి దారి తీసింది. సాధారణంగా ప్రశాంతంగా వుండే లేహ్ ప్రాంతంలో ఈ హింస చెలరేగడానికి కారణమైన పరిస్థితులను సృష్టించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆందోళనకారులను నిందిస్తోంది. తక్షణమే అన్ని రకాల అణచివేత చర్యలను విరమించి, ఈ ఉద్యమ ప్రతినిధులతో అర్ధవంతమైన చర్చలను జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. పోలీసుల అణచివేత చర్యల్లో మరణించినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -