Sunday, March 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల 12 డిమాండ్లను వెంటనే పరిష్కారించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించేందుకు వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండనీయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ మెయిన్‌ గేట్‌ వద్ద విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంకేతమనీ, అలాంటి ఉద్యమాలను అణచివేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

అక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ, కనీస సదుపాయాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్‌ అకాడమిక్‌ ఇయర్‌ ముగియబోతున్నప్పటికీ విద్యార్థులకు ఇప్పటికీ ల్యాప్‌టాప్‌లు అందించకపోవడం ఘోర నిర్లక్ష్యమని దుయ్యబట్టారు. ల్యాప్‌టాప్‌లు లేకుండా సాంకేతిక విద్య ఎలా సాధ్యం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శివశక్తి మెస్‌ కాంట్రాక్ట్‌ కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ కాంట్రాక్ట్‌ రద్దు చేసి, పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వైద్యసిబ్బందిని నియమించాలి
వైద్య సదుపాయాల లోపం ప్రాణాలను బలి తీసుకుంటున్నదని తెలిపారు. యూనివర్సిటీలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే విద్యార్థిని తేజస్విని మరణించిందని ఆరోపించారు. 10 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్న క్యాంపస్‌లో కేవలం కొద్ది మంది వైద్య సిబ్బంది మాత్రమే ఉండటం అత్యంత దారుణమని పేర్కొన్నారు. వెంటనే పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించాలనీ, ఎంబీబీఎస్‌ డాక్టర్లను నియమించి 24 గంటలు వైద్య సేవలు అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాసర ట్రిపుల్‌ ఐటీ వైస్‌ ఛాన్సలర్‌ గోవర్ధన్‌ను వెంటనే తొలగించాలనీ, ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థినీ తేజస్విని మరణానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -