అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులపై ప్రజాగ్రహం
వాషింగ్టన్ : మిన్నెసోటాలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఐదేండ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్రీ-స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న బాలుడిని అతని తండ్రితో పాటు ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించినట్టు పాఠశాల యాజమాన్యం, న్యాయవాది తెలిపారు. ఈ బాలుడు ఇటీవల మిన్నియాపాలిస్ శివారు ప్రాంతం నుంచి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న నాలుగవ చిన్నారి కావడం గమనార్హం. బాలుడి పేరు లియామ్ కొనేజో రామోస్ అని, మంగళవారం మధ్యాహ్నం కారు నుంచి ఫెడరల్ ఏజెంట్లు చిన్నారిని తీసుకువెళ్లారని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ మీడియాకి తెలిపారు. వలసదారులపై చర్యల కోసం చిన్నారులను ఎరగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో బాలుని కుటుంబం అమెరికాకు వలస వచ్చిందని, బహిష్కరణకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు.
ఐదేండ్ల పిల్లాడిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. బాలుడిని హింసాత్మకంగా నేరస్థుడిగా చేర్చనున్నారా ?అని అధికారులను నిలదీశారు. చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. పిల్లవాడి తండ్రి ఆడ్రియన్ అలెగ్జాండర్ కోనెజో అరియాస్‌ను అరెస్ట్ చేసినట్టు ఆమె తెలిపారు. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ గురువారం మిన్నియాపాలిస్ నేతలతో మాట్లాడినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. భయంకరమైన కథ విన్నానని, ఆ బాలుడిని అరెస్ట్ చేయకుండా నిర్బంధించారని తరువాత తెలుసుకున్నానని పేర్కొన్నట్టు చెప్పారు. మిన్నెసోటా సమాఖ్య వలసదాడులకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. గత ఆరువారాల్లోఈ ప్రాంతం నుంచి సుసమారు 3,000మందిని యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.



