– రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
– వేల్పూర్ లో ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : హైదరాబాద్ లో ఉంటే కాదు… గ్రామాల్లోకొస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తుందని రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ గ్రామాలలో తిరగాలని, డ్రగ్స్ మత్తులో ముఖ్యమంత్రిపై అవక్కులు, చెవక్కులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సోమవారం వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా గోదావరి అనే లబ్ధిదారు ఇంటి పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే, ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవసరమే ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఇల్లు లేని పేదల బాధలు చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగానే మండలంలో 400 ఇండ్లు మంజూరైతే వేల్పూర్ లోనే 71 మంజూరు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లతో పేదలు తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలనే కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యే విధంగా అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ తమ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం అయ్యేవిధంగా వారికి సహాయం అందించాలని మోహన్ రెడ్డి సూచించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించే ప్రక్రియలో ఎక్కడ కూడా పార్టీ బేధాలు, తమ మన బేధాలు చూడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామని వారిని మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందన్నారు.
గత పది సంవత్సరాల కంటే ముందు ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీనే ప్రతి గ్రామంలో పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందన్నారు. 18నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ లో ప్లబ్బులు, క్లబ్బుల్లో డ్రగ్స్ తో మునిగి ఉంటే గ్రామాలలో జరిగే అభివృద్ధి ఎట్లా తెలుస్తుందని, గ్రామాల్లో కొచ్చి చూస్తే 18 నెలల్లో జరిగిన అభివృద్ధి కళ్ళ కనబడుతుందన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, జిల్లా జనరల్ సెక్రెటరీ దామోదర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమణ, రాజేందర్, రాజేశ్వర్, లావణ్య, లహరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరు పాల్గొన్నారు.