కమ్యూనిస్టు సర్పంచులు పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జెండాలే వేరు- ఎజెండా ఒక్కటే
వ్యక్తిగత దూషణలతో ప్రజాసమస్యలు పక్కదోవ : సిరిసిల్ల అభినందనసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఈ నెల 29 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల కేటాయింపుపై ప్రధాన చర్చ జరగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు వ్యక్తిగత దూషణల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన సీపీఐ(ఎం) సర్పంచు లు గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గెలిచిన సీపీఐ(ఎం) సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ శుక్రవారం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లా డారు. పల్లెసీమలు పచ్చగా ఉండాలంటే పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం) అధికారంలో ఉన్నప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నేరుగా 50 శాతం నిధులు కేటాయించి పల్లెల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. కేరళలో సీపీఐ(ఎం) ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా పంచాయతీ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం సర్పంచ్‌లకు నిధులు సకాలంలో ఇవ్వకుండా పంచాయతీల అభివృద్ధిని బలహీన పరిచిందని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం సరైన సమయంలో గ్రామా లకు సరిపడా నిధులు కేటాయించాలని అన్నారు.. ముఖ్యమంత్రి పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు ఇస్తామని చెప్పిన వాగ్దానం నీటి మూటలు కావొద్దన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వ్యక్తి గత దూషణలకు పోటీ పడటం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోటీ పడాలని కోరారు.
బీజేపీ ఎంపీ బండి సంజరు వ్యక్తిగత దూషణలు, విద్వేషాలే తమ రాజకీయ విధానంగా మాట్లాడుతున్నారని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటారని చెప్పారు. బీజేపీకి బలహీన వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశద్ధి ఉన్నా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బలహీన వర్గాల రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేందుకు పాటుప డాలని చెప్పారు. గతంలో 5 ఆదర్శ పంచాయతీలను నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేస్తే ఆ 5 గ్రామాలకు సీపీఐ(ఎం) సర్పంచులు ఉన్నారని చెప్పారు. రాబోయే స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో సీపీఐ(ఎం) కార్మిక వర్గ సమస్యల పైనే కాదు పల్లె ప్రాంత ప్రజల హృదయాల్లో ఎర్రజెండా ఎగిరిందన్నారు.
వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత, గర్జనపల్లి ఉపసర్పంచ్ న్యాత మోహన్, వార్డు సభ్యులు గుండెల్లి కళ్యాణ్ , లింగంపల్లి అనిల్, రజనీకాంత్, హారిక తదితరులను శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కేవీఎస్‌ఎన్ రాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు అరుణ్ కుమార్, కోడం రమణ జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, గురజాల శ్రీధర్, మల్లారపు ప్రశాంత్, అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, శ్రీరాముల రమేష్ చంద్ర వివిధ ప్రజా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



