– వీబీజీఆర్ఏఎం చట్టం ఉపసంహరించాలి
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులకు అమలు చేస్తున్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్) యాప్ ఆధారిత డిజిటల్ హాజరు విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ఎమ్ఎమ్ఎస్ విధానం వల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ గుర్తింపు ఆధారంగా రోజుకు రెండు సార్లు మొబైల్ యాప్లో ఫోటోలు తీసి హాజరు నమోదు చేయడం సాధ్యం కావడం లేదన్నారు.చాలా గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ లేకపోవడంతో పనికి వచ్చిన కార్మికులకు మస్టర్లు నమోదు కాకపోవడం జరుగుతోందని చెప్పారు.అందువల్ల ఈ డిజిటల్ హాజరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీజీఆర్ఏఎం) చట్టాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.కొత్త విధానాల వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులను సుమారు 30 శాతం తగ్గించిందని విమర్శించారు.నిధులు తగ్గించి పనిదినాలు పెంచామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.
ఉపాధి సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంపీడీవో సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ, మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు అందజేయాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య, తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి. చిరంజీవి,ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సోడెం ప్రసాద్, గంగరాజు,నందిపాడు ఉప సర్పంచ్ తుట్టి వీరభద్రం, మురళి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.



