సెర్ప్ కార్యాలయం ముందు ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో ధర్నా
వికలాంగుల పెన్షన్
రూ.6 వేలకు పెంచాలి
పెండింగ్ పెన్షన్ మంజూరు చేయాలి : ఎన్‌పీఆర్‌డీ
రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్, ఎం.అడివయ్య
సెర్ప్ సీఈఓతో చర్చలు.. హామీతో ధర్నా విరమణ
నవతెలంగాణ- బంజారాహిల్స్
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని, పెండింగ్ పెన్షన్‌లు మంజూరు చేయాలని కోరుతూ ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో బుధవారం సెర్ప్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా చేశారు. జోరు వాన కురుస్తున్నా లెక్కచేయకుండా.. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను వికలాంగులకు కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్ర వైకల్యం కలిగిన 15,000 మందికిపైగా వికలాంగులు ఉన్నారని, వారు మంచానికే పరిమితం కావడంతో తల్లిదండ్రులు 24 గంటలూ సేవలందిస్తున్నారని తెలిపారు. వారి కోసం ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయాలని, ఇప్పటికే జరిగిన వెరిఫికేషన్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నైబర్ హుడ్ కేంద్రాల్లో పని చేస్తున్న వికలాంగులకు ఇచ్చే వేతనం చాలా తక్కువగా ఉందని, వారి పెన్షన్‌ను రద్దు చేయడం అన్యాయమన్నారు. పెన్షన్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్‌లలో వికలాంగులనే సీసీలుగా నియమించాలన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలని, పెంచిన పెన్షన్ 2024 జనవరి నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వికలాంగుల పెన్షన్‌తోపాటు అన్ని రకాల చేయూత పెన్షన్‌లు మంజూరు చేయాలని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు రూ.20,000 ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. వికలాంగుల ధర్నాతో అధికారులు దిగొచ్చారు. నాయకులతో సెర్ప్ సీఈఓ దివ్య చర్చలు జరిపారు. పెన్షన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, రెండు నెలల్లో పెండింగ్ పెన్షన్‌లు మంజూరు చేస్తామని సీఈఓ హామీ ఇచ్చారు. తీవ్ర వైకల్యం కలిగిన వారికి ప్రత్యేక అలవెన్స్ మంజూరు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 40 నైబర్ హుడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచుతున్నామని హామీ ఇచ్చారు. దాంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, కాషాప్ప, స్వామి, ఉపేందర్, నాగలక్ష్మి, మధుబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమోహన్, ప్రకాష్, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, మల్లేష్, యం.నర్సిములు, పి.చందు, భుజంగారెడ్డి, షాహిన్ బేగం, శేఖర్‌గౌడ్, బాలయ్య, సుల్తాన్ రమేష్, లలిత, బాలకృష్ణ, మేరీ తదితరులు పాల్గొన్నారు.