Sunday, May 18, 2025
Homeసోపతినిరాశపరిచిన ఉత్తమ చిత్రం 'అనోరా'

నిరాశపరిచిన ఉత్తమ చిత్రం ‘అనోరా’

- Advertisement -

సెక్స్‌ వర్కర్ల కథలకు సాహిత్యంలోనూ, సినిమా రంగంలోనూ మంచి ఆదరణ ఉంది. ఇది సమాజంలోని ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనిపిస్తూ ఉంటుంది. సమాజంలో ఏ మాత్రం గౌరవం, ఆదరణ లేని సమూహాలకు కళారంగంలో గొప్ప ప్రాముఖ్యతను, అతి గొప్ప సానుభూతిని అందిస్తుంది కళా ప్రపంచం. కాని వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ సానుభూతి ఏ మాత్రమూ పని చేయదు. అతి దారుణమైన దోపిడిని భరించవలసిన అగత్యం నుండి వారిని తప్పించగల ప్రయత్నాలు సమాజంలో జరగవు. కాని వీరి కథలకు ఈ రోజుకీ బోల్డంత మార్కెట్‌ ఉంది. ‘అనోరా’ సినిమా ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ గెలుచుకోవడం చాలా మందిని ఆలోచనలలో పడేసింది.
ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి విభాగాలతో సహా సెక్స్‌ వర్కర్‌ పాత్రలను పోషించినందుకు అకాడమీ అవార్డులను గెలుచుకున్న నటీమణులు అనోరా లో ప్రధాన పాత్ర పోషించిన మిక్కీ మాడిసన్‌ తో పాటు ఇప్పటికి పదహారు మంది అంటే సినిమా రంగంలో ఈ వేశ్య పాత్రకున్న ప్రాముఖ్యత అర్ధం చేసుకోవచ్చు. కాని అనోరా సినిమా ఈ సంవత్సరం సష్టించిన ప్రభంజనం చాలా మంది సినీ ప్రేమికులను ఇబ్బంది పెట్టింది కూడా.
సినిమాగా టెక్నికల్‌ విభాగాలలో కొన్ని మెచ్చుకోదగ్గ ప్రమాణాలు ఈ సినిమాలో ఉన్నా కథా పరంగా దీనిలో లోతు లేదు. కొంతమంది విమర్శకులు, ప్రేక్షకులు అణగారిన పాత్రలపై ఈ చిత్రం చూపించే సానుభూతిని దాని దిశగా సినిమా పలికించిన భావోద్వేగాలను, సామర్థ్యాన్ని అభినందిస్తూనే ఉత్తమ చిత్రంగా దీనికున్న అర్హత పట్ల అనుమానాలనే వ్యక్తం చేశారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్ర విజయం, నియాన్‌ మార్కెటింగ్‌ ప్రయత్నాలు దాని ఉత్తమ చిత్రం విజయంలో పాత్ర పోషించాయి అని ఒప్పుకుని తీరాలి.
ఈ మధ్య కాలంలో అన్ని రకాల సామాజిక కళాత్మిక హద్దులను దాటే బోల్డ్‌ చిత్రాలను తెరకెక్కించాలనే ఓ ఉద్యమం మొదలయింది. అలా హద్దులు చెరిపేసే చిత్రాలకు విశేషమైన ఆదరణ ఇచ్చే మార్కెటీకరణ సూత్రం ఆస్కార్‌ అవార్డుల దాకా పాకింది. దాని వల్ల సినిమాలలో కళాత్మకతను, కథను, పాత్రల విశ్లేషణాత్మక చిత్రీకరణను, పక్కకు నెట్టి కేవలం బోల్డ్నెస్‌ ప్రధానంగా అవార్డులకు చిత్రాలు ఎంపిక అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆస్కార్‌ ఉత్తమ చిత్రాలను ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటున్న తరుణంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తమ చిత్రం అంటే ఏంటి అనే డిబేట్‌ పక్కన పెట్టి సరిహద్దులను చెరిపివేసే బోల్డ్‌ చిత్రాలే ఉత్తమ చిత్రాలుగా ఎందుకు కొలవబడుతున్నాయనే డిబేట్‌ అవసరమయే అత్యవసర స్థితి వచ్చేసింది. ఈ బోల్డ్‌నెస్‌ కోసం జరిగే ప్రయోగాలు, అతిక్రమణలు, పూర్తి సమాజ పరిణామంలో పరిగణలోకి తీసుకుంటే, సినిమాలలో కళాత్మకతను చంపేసి చాలా అసహజాలకు, హానికరమైన ఆలోచనలకు, చేష్టలకు ప్రామాణికతను, సామాజిక ఒప్పుదలను తీసుకొచ్చే దిశగా పని చేస్తున్నాయి. ఇది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో కాని సమాజానికి ఎప్పుడూ హానికరమే.
సెక్స్‌ జీవితంలో ప్రధానమైన విషయమే. మానవ అవసరమే. దాన్ని తెరపై చూపే విధానంలో దాని ప్రాధాన్యత స్పష్టమవ్వాలి తప్ప అది వ్యసనరీతిలో ప్రదర్శింప బడకూడదు. సెక్స్‌ ఎంత పెద్ద అవసరమో అంతే వ్యక్తిగత విషయం కూడా. ఈ అవసరం స్థాయి, దాని లోతు ఒకొక్కరికి ఒకో విధంగా ఉంటుంది. కాని ఆ వ్యక్తిగత క్రియను జనరలైజ్‌ చేసి అవసరమనిపించే ఓ వ్యసన రీతిగా ప్రదర్శిస్తూ దాన్ని అలాగే అనుభూతించాలనే సందేశాన్ని ప్రజలలో పంపించడం వల్ల సెక్స్‌ వ్యక్తిగత కోరిక స్థాయి నుండి అనుకరణ స్థాయికి చేరిపోయింది. అందుకే తెరపై చూసే దాన్ని, చేసి చూడాలనే దిశగా ప్రయోగాలు మొదలయి సెక్స్‌క్రైంలోకి, అనారోగ్యకరమైన జీవిన శైలిలోకి, పర్వర్షన్‌లోకి దారి తీస్తుంది. పర్వర్షన్‌ లు సమాజంలో ఎప్పుడూ ఉంటాయి. వాటిని సాధారణీకరించే పరిస్థితిలో కళారంగం ఉండడం సమాజానికి మంచి చేయదు. ఇలాంటి ప్రయత్నాన్ని అకాడమీ అవార్డుతో సత్కరించే పరిస్థితి మార్కెట్‌ కళారంగాన్ని ఎంతగా శాసిస్తుందో నిరూపిస్తుంది. అకాడమీ మారుతున్న సమాజ ఆలోచనలకు దర్పణం మాత్రమే. ‘అనోరా’ చిత్రానికి లభించిన ఆస్కార్‌ అవార్డులు మనకు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. కళాకారులు, మేధావులు అసహజాలను సాధారణీకరించడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఎక్కువ విద్వంసానికి కారణం అవుతాయి. ఇది ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సంక్షోభం. దారి తప్పిన మేధావితనం, కళారంగం ప్రజలపై చూపే ప్రభావం గురించి చర్చించే అవసరం ఎంతో ఉంది. దీన్ని ఎవరూ హర్షించకపోయినా ఒప్పుకోకపోయినా ఛాంధసవాదం అనో, సాంప్రదాయవాదం అనో హేళన చేసినా ఎవరో కొందరు ఈ సంభాషణను ఎక్కడో ఓ చోట మొదలుపెట్టాలని నా వరకు ‘అనోరా’ చిత్ర ఆస్కార్‌ విజయం నిరూపిస్తుంది. ఇంత పెద్ద విజయాన్ని ఈ చిత్రం సాధించడం వెనుక దూకుడుగా జరిగిన ప్రచారం కారణం అన్నదే నా అభిప్రాయం.
అనోరా ఓ ఇరవై మూడు సంవత్సరాల యువతి. స్ట్రిపర్‌ గానూ, సెక్స్‌ వర్కర్‌ గానూ పని చేస్తూ ఉంటుంది. ఈమెకు రష్యన్‌ మూలాలు ఉన్నాయి. ఆ భాష మాట్లాడగలదు. ఒకసారి ఈమె బాస్‌ ఈమెను ఓ రష్యన్‌ యువకుడికి ఎస్కార్ట్‌గా పంపిస్తాడు. రష్యన్‌ వచ్చిన యువతి కావాలి అని అతను కోరడంతో ఆ భాష వచ్చిన అనోరాను ఈయన పంపిస్తాడు. ఆ యువకుడి పేరు ఇవాన్‌ వన్యా జాఖరోవ్‌. అతని తండ్రి ఓ పెద్ద వ్యాపారస్తుడు. అపర కుబేరుడు. డబ్బు మదంతో పెరిగిన అందరి పిల్లలలాగే వాన్యా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాడు. తండ్రి సంపాదనను కరిగిస్తూ ఆ తండ్రినే ద్వేషిస్తూ ఉంటాడు. తాగుడు, డ్రగ్స్‌, సెక్స్‌ అతని వ్యాపకాలు. అమెరికాలో చదువు కోసం ఉంటూ, అక్కడ విలాసాలకు అతను చేసే ఖర్చు ఎవరూ ఊహించేలేని స్థాయిలో ఉంటుంది. వీడియో గేమ్స్‌తో రోజంతా గడుపుతూ క్లబ్బులకూ పార్టీలకు విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటాడు వాన్యా. అతనిచ్చే పార్టీలు యువతకు పిచ్చెక్కించే స్థాయిలో ఉంటాయి. ఏ మాత్రం సొంత వ్యక్తిత్వం లేని వాన్యాను సాధారణంగా కాస్త వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడదీ భరించలేదు. అతనికి ఎస్కార్ట్‌గా వెళ్లిన ఆనోరా వాన్యాకు విపరీతంగా నచ్చుతుంది.
అనోరాను అందరూ ఆని అని పిలుస్తారు. ఆమె తనకన్నా రెండు సంవత్సరాలు చిన్నవాడైన వాన్యా జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వాన్యా ఆనీని కోరి కొన్నిసార్లు తన దగ్గరకు వరుసగా పిలిపించుకుంటాడు. సెక్స్‌లో అనుభవం ఉన్న ఆనీ అతనికి కొత్త రుచులను అందిస్తుంది. తనతో న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకోవడానికి వాన్యా ఆహ్వానిస్తాడు. దానికి పదిహేను వేల డాలర్లను ఆమెకు ఇస్తానంటాడు. అతని ఇంట్లో ఉంటూ ఆనీ అతని స్నేహితులలో పాటు విలాస జీవితం గడుపుతుంది. వాన్యాతో కలిసి అంతా లాస్‌ వేగాస్‌ వెళతారు.
తాను రష్యా వెళ్లవలసిన రోజు దగ్గర పడిందని, తండ్రి తనను బలవంతంగా వ్యాపారంలోకి నెడుతున్నాడని వాన్యా ఆనీతో చెప్పి వాపోతాడు. తాను అమెరికాలోనే ఉండాలంటే ఇక్కడి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని అప్పుడే తనకు స్వేచ్ఛాయుతమైన జీవితం దొరుకుతుందని చెబుతూ ఆనీని తనను పెళ్లి చేసుకొమ్మని అడుగుతాడు. అతనికి ఆ ఆలోచన ఆ నిముషంలోనే వస్తుంది. ముందు ఆనీ ఆ ప్రస్తావనను తిరస్కరిస్తుంది. కాని తాను ఆమెను ప్రేమిస్తున్నాను అని వాన్యా అనగానే ఆమె పెళ్ళికి ఒప్పుకుంటుంది. అప్పటికప్పుడు వేగాస్‌లో ఓ చిన్న చాపెల్‌లో ఆ ఇద్దరు పెళ్ళి చేసుకుంటారు. వాన్యా అక్కడే ఆనీకి ఓ అతి ఖరీదైన ఉంగరం, ఓ పెద్ద కోటు కొని బహుకరిస్తాడు. స్ట్రిప్పర్‌గా క్లబ్‌లో తన ఉద్యోగాన్ని వదిలి ఆనీ వాన్యా భవంతిలోకి మారుతుంది. వీళ్ల పెళ్లి సంగతి వాన్యా తల్లితండ్రులకు తెలుస్తుంది. సహజంగా వాళ్ళు కోపంతో రగిలిపోతారు. ఈ పుత్రరత్నం వ్యక్తిత్వం వారికి బాగా తెలుసు కాబట్టి ఈ పెళ్లి గురించి నిజానిజాలు కనుక్కొమ్మని అమెరికాలో వాన్యాని కనిపెట్టుకుని ఉన్నా తోరోస్‌ అనే వ్యక్తికి బాధ్యత అప్పగిస్తారు.
తోరోస్‌ తన మనుషులు గామిక్‌, ఇగోర్లను వాన్యా ఇంటికి పంపిస్తారు. అక్కడ అష్టకష్టాలు పడి వాళ్ళు ఆ పెళ్లి సర్టిఫికేట్‌ ఫొటో తీసి తోరొస్‌కి పంపిస్తారు. ఇక ఆ పెళ్ళికి చెల్లుచీటి ఇప్పించడానికి తోరోస్‌ రంగంలోకి దిగుతాడు. కాని అప్పటికే వాన్యా ఆనీని ఒంటరిగా వదిలేసి ఆ ఇంటి నుంచి పారిపోతాడు. ఇక్కడ వాన్యా ప్రవర్తన ఎంత చిల్లరగా ఉంటుందంటే అతని స్వభావం పూర్తిగా బైటపడిపోతుంది. కానీ ఆనీ అతన్ని అనుమానించదు. ఇగోర్‌, గామిక్‌లను ఎదిరించడానికి ఆనీ ఎంతో ప్రయత్నిస్తుంది. వాళ్లని కొరికి రక్కి అక్కడి నుండి బైటపడాలని చూస్తుంది కాని ఇగోర్‌ ఆమెను గట్టిగా పట్టుకుని చేతులు కట్టేస్తాడు. అక్కడకు వచ్చిన తోరొస్‌ ఆనిని శాంతింపజేసి, ఆమె వాన్యాను నమ్మడం తప్పని నచ్చచెప్పుతాడు. అందరూ వాన్యాని వెతకడానికి బైలుదేరతారు.
ఆ రాత్రి తనకు తెలిసిన క్లబ్బులన్నీ వెతుకుతుంది ఆనీ. ఆమెను వాన్యా కేవలం గ్రీన్‌కార్డ్‌ కోసం పెళ్ళి చేసుకున్నాడని, ఆ బంధం తెంచుకున్నట్లు ఓ కాగితంపై సంతకం పెడితే ఆనికి పదివేల డాలర్లు ఇప్పిస్తానని తోరోస్‌ చెబుతాడు. తాను వాన్యా భార్యనని చెప్పడానికి ఆనీ ఎంతో ప్రయత్నం చేస్తుంది. కాని తోరోస్‌ దాన్ని పట్టించుకోడు. మొత్తానికి కష్టపడి అంతా వాన్యా ఆ రాత్రి గడుపుతున్న క్లబ్‌కు వెళతారు. అది ఒకప్పుడు ఆనీ పని చేసిన క్లబ్‌. అందులో ఆమెను అసహ్యించుకునే డైమండ్‌ అనే మరో స్ట్రిపర్‌తో ఆ రాత్రి గడుపుతుంటాడు వాన్యా. ఇది ఆనీ భరించలేకపోతుంది. అతన్ని పట్టుకుని తనని ఎలా ఒంటరిగా వదిలేసి వచ్చావని ఆమె అడగాలని ప్రయత్నిస్తుంది. కాని డ్రగ్స్‌ మత్తులో ఉన్న వాన్యాకు ఏదీ అర్ధం కాదు. అతని మత్తు దిగే దాకా కోర్టు బైట కాపలా కాస్తుంటారు అంతా. ఆ నగరంలోని కోర్టు ఆ పెళ్ళికి చెల్లుచీటి వాళ్లు పెళ్ళి చేసుకున్న నగరంలోనే తీసుకోవాలని చెప్పడంతో వాన్యా, అప్పుడే అమెరికా చేరిన అతని తల్లి తండ్రులు, తోరోస్‌ అతని అనుచరులు అంతా కలిసి వేగాస్‌ బయలుదేరుతారు.
ప్రయాణంలో వాన్యా తల్లితండ్రుల పరపతి వారి అహంకారం, వాన్యా చేతకానితనం ఆనీ గమనిస్తుంది. తల్లితండ్రులను చూసాక వాన్యా పూర్తిగా వారి పక్షం అయిపోతాడు. నోరు తెరిచి ఆనీ పక్షాన ఒక్క మాట మాట్లాడడు. పైగా తాను తల్లితండ్రులతో వెళ్ళడం తప్పదని చాలా సులువుగా చెప్పేస్తాడు. అతనిలోని ఈ కోణాన్ని ఆనీ మొదటిసారి గమనిస్తుంది. వాన్యా తల్లితండ్రులు ఆమెను పురుగు కన్నా హీనంగా చూస్తారు. తాను డైవర్స్‌ కోసం కోర్టుకెళ్లి భరణం అడుగుతానని అనోరా అంటుంది. కాని అలా చేస్తే లాయర్‌ ఫీజులకు ఎంతో డబ్బు చెల్లించాల్సి వస్తుందని, వాన్యా కుటుంబం తెచ్చే ఒత్తిడిని తాను తట్టుకోలేనని ఆమెకు కొంత సేపట్లోనే అర్ధం అవుతుంది. వాన్యా తల్లి అహంకారాన్ని అసహ్యించుకుంటూ ఆమెకు బుద్ది చెప్పడానికే తనను ఆమె కొడుకు వివాహం చేసుకున్నాడని అంటూ ఆనీ విడాకుల పత్రంపై సంతకం పెడుతుంది.
తోరోస్‌, ఇగోర్‌కి ఆనీని అప్పగించి ఆమెను అమెరికా తీసుకెళ్ళి ఆమెకు ఇస్తానన్న డబ్బు ఇచ్చి పంపమని చెప్తాడు. మొదటి నుండి ఈగోర్‌ ఆనీని వాన్యాను గమనిస్తూ ఉంటాడు. నిజానికి ఈగోర్‌ పాత్ర వేసిన యూరా బోరీసోవ్‌ ఒక్కడే ఈ సినిమాలో నిజంగా గొప్పగా నటించాడనిపిస్తుంది. అతని కళ్ళతోనే సినిమా సగభాగం నడుస్తుంది. ఆనీకి జరుగుతున్న అన్యాయం వాన్యా చేతకానితనాన్ని గమనిస్తూ ఈగోర్‌ ప్రదర్శించే ముఖకవళికలే ప్రేక్షకులకు ఆనీ పట్ల సానుభూతి సంపాదించి పెడతాయి. ఆనీని దోపిడీ చేస్తున్న వ్యవస్థ క్రూరత్వాన్ని గమనిస్తూ ఈగోర్‌ ఆమెకు దగ్గరవుతాడు. అందుకే ఆనీ కోపాన్ని సహిస్తాడు. తాను కేవలం ఓ ఉద్యోగినని చేయవలసింది చేసానని ఆమెకు సంజాయిషీ ఇస్తాడు. విడాకులు మంజూరయిన తరువాత ఆనీకి క్షమాపణ చెప్పమని వాన్యాను అడుగుతాడు ఈగోర్‌. వాన్యా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు ఆమెను కారులో దింపుతూ తోరోస్‌ ఆమె చేతినుండి బలవంతంగా తీసేసుకున్న ఉంగరాన్ని ఆమెకు తిరిగి ఇస్తాడు ఈగోర్‌. దానితో కరిగిపోయి ఆనీ అతనికి సెక్స్‌ సుఖాన్ని అందించాలని అనుకుంటుంది. తనను ముద్దు పెట్టుకోబోతున్న ఈగోర్‌ను ఆపి చెంప చెళ్ళుమనిపిస్తుంది ఆనీ. తరువాత అతని చేతుల మధ్య మొదటి సారి ఏడుస్తుంది. ఆమెను ప్రేమగా దగ్గర తీసుకుని ఈగోర్‌ సాంత్వన తెలుపుతుంటే అతని చేతుల్లో రోదిస్తున్న ఆనీ నిస్సహాయత, ఆనీ లాంటి యువతులను ఆటవస్తువుగా చేసి ఆడించే వ్యవ్యస్థను గుర్తు చేస్తుండగా సినిమా ముగుస్తుంది.
స్ట్రిప్పర్‌ క్లబ్‌లో సన్నివేశాలను, సెక్స్‌ వర్కర్ల చర్యలను యధాతథంగా చిత్రీకరించాలనే కోరికతో దర్శకుడు సీన్‌ బేకర్‌ సెక్స్‌ సీన్ల చిత్రీకరణలో అన్ని సరిహద్దులను చెరిపేసారు. ఇదే కథను ఎన్నో రకాలుగా తెరకెక్కించవచ్చు. కాని దర్శకులు బోల్డ్‌నెస్‌కు పెద్ద పీట వేశారు. అదే మార్కెట్‌ను ఆకర్షించింది, అదే ఆస్కార్‌ కమిటీనీ ఆకర్షించిందని అర్ధం చేసుకోవచ్చు. ఆనీ పాత్ర పట్ల ప్రేక్షకులందరూ సానుభూతి చూపడం కష్టం. ఆనీ పాత్రలో లోతు లేదు. ఓ టీనేజర్‌గా తప్ప ఆమె మరోలా ఎక్కడా ప్రవర్తించదు. సాధారణంగా తాము చూసే క్రూర సమాజంలోని అనుభవాలతో సెక్స్‌ వర్కర్లలో ఓ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వాళ్ళు మనుషులను అంచనా కట్టగలరు. వాన్యా మొదటి నుండి ఓ తెలివి లేని, వ్యక్తిత్వం లేని, బుద్ది లేని, డబ్బు బలుపు మాత్రమే పుష్కలంగా ఉన్న యువకుడిగానే కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ వీడియో గేమ్‌లు ఆడుతూ తనలాంటి వెధవలతో కలిసి తిరుగుతూ మత్తులో పడి ఉంటూ దేని పట్ల ఆలోచనలేని వాన్యా పెళ్ళి చేసుకుందాం అనగానే ఆనీ అతన్ని వివాహం చేసుకోవడంలో ఆమె అభద్రత తప్ప మరేమీ కనిపించదు. అలాంటి యువకుడిని చేరే ముందు ఎంతో క్రూరమైన ప్రపంచాన్ని, ఎందరో మనుషుల్ని ఆమె చూసి ఉంటుంది. ఆ అనుభవాలు ఆమెను రాటుతేలుస్తాయి. ఆమెకు మనుషులను ఎంచడంలో అనుభవం సహజంగా వచ్చి ఉండాలి. కాని ఏ మాత్రం అనుభవం లేని ఓ టీనేజ్‌ అమ్మాయిగానే ఆమె సినిమా అంతా ప్రవర్తిస్తుంది.
ఇంతకు ముందు తెరపై కనిపించిన సెక్స్‌ వర్కర్ల అందరికన్నా ‘అనోరా’ అర్భకమైన పాత్ర. ఈ సినిమాకు ఉత్తమ చిత్రం ఆస్కార్‌ రావడం ఒకెత్తయితే, ఈ పాత్ర పోషించిన నటికి ఉత్తమ నటిగా ఆస్కార్‌ లభించడం కూడా ఆలోచనలలో పడేస్తుంది. ఆనీకి తనపై తనకు ఓ స్పష్టత ఉండదు, సమాజ వైఖరి పట్ల స్పష్టత ఉండదు. ఆమెలో ఓ స్కూల్‌ గర్ల్‌ స్థాయిలో తెలివితేటలుంటాయి. ఇది సహజంగా అనిపించదు. అందుకే అనీ పాత్రను ఉత్తమ నటిగా ఎన్నుకోవడం కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. మికీ మాడిసన్‌ ఈ పాత్రకు చాలా కష్టపడి ఉండవచ్చు. అందులో సందేహం లేదు. కాని ఉత్తమ నటులుగా ఈ విభాగంలో ఎంపికయిన ఇతర నటులను గమనిస్తే ఈ అవార్డు హాస్యాస్పదం అనిపిస్తుంది.
ఆస్కార్‌ అవార్డులలో దర్శకులు బేకర్‌ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగంలో తాను ఎరిగిన సెక్స్‌ వర్కర్లకు హదయపూర్వక కతజ్ఞత చెప్పుకోవడం బావుంది. ఈ సినిమా చాలా మంది సెక్స్‌వర్కర్లకు, వారి వత్తిని సహజంగా చిత్రీకరించినందుకు నచ్చిందని కొందరు ప్రస్తావించారు. కాని ఇంత బలహీనమైన పాత్రగా వేశ్యలను చూపించడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేకపోవడం కాస్త స్త్రీ పక్షాన ఆలోచించవలసిన విషయం. దోపిడీకి గురవుతున్న వారిలో కనిపించే ఆలోచన, సంఘర్షణ ఈ చిత్రంలో చూపకపోవడం కథలో ఆనీ వయసు, ఆమె అమాయకత్వాన్ని చూపడం కోసం అని సమర్ధించుకున్నా మరీ ఇంత బలహీనమైన పాత్రకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వడం వరుసగా ఆస్కార్‌ అవార్డులు పొందిన పాత్రలను స్టడీ చేసే వారికి కాస్త మింగుడు పడని విషయమే.
”గత, వర్తమాన, భవిష్యత్తు సెక్స్‌ వర్కర్లందరికీ” అనోరాను అంకితం చేయడాన్ని చాలా మంది కొనియాడుతున్నా, ఆనీ ఒక స్టీరియోటైప్‌ పాత్రగా మాత్రమే కనిపిస్తుంది. ఆస్కార్‌ ఉత్తమ చిత్రాలలో కొన్ని చిత్రాలు నిరాశపరిచినవి ఉన్నా వాటి వెనుక కొన్ని సామాజిక కారణాలు ఉండడం వల్ల అవి ఉత్తమ చిత్రాలుగా ఎన్నికవడంలో ఓ లాజిక్‌ కనిపిస్తుంది. కాని కేవలం మార్కెట్‌ ప్రభావంతో ఆస్కార్‌ కెక్కిన చిత్రంగానే నా దష్టిలో ‘అనోరా’ నిలుస్తుంది. ఈ చిత్రంలో ఒక్క ఈగోర్‌ తప్ప అన్ని పాత్రలలో అస్పష్టత మాత్రమే అధికంగా ఉంది. బేకర్‌ నిజంగా సెక్స్‌ వర్కర్లకు అనోరా విజయాన్ని నివాళి అర్పించాలనుకుంటే, వారిలోని మానవత్వాన్ని బైటపెట్టే చిత్రాన్ని రూపొందించి ఉంటే బావుండేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

  • పి.జ్యోతి,
    98853 84740
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -