నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ కవి సిద్ధాంతాపు ప్రభాకరాచార్యులు వ్రాసిన ప్రభాత కెరటాలు కవితా సంపుటి ని ఆవిష్కరించారు. ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ జానపద అకాడమి తొలి అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో ఆదివారం రాత్రి జరిగిన ఆవిష్కరణ సభలో తెలంగాణా సాహిత్య అకాడమి ప్రధమ అధ్యక్షులు నందిని సిద్ధా రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం తెచ్చిన కవి కలకాలం గుర్తుండి పోతాడని ప్రభాకరాచార్యులు రచనలు సమాజహితం కోరేవిగానూ ఆలోచింప చేసేవి గాను ఉంటాయని అన్నారు.ప్రముఖ సాహితీవేత్త కర్నూల్ పూర్వ డి.ఐ.జి ఇక్బాల్, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత బాల సాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ధర్మ కేతనం అధ్యక్షులు రఘు వీర ప్రతాప్, నేటి నిజం సంపాదకులు బైస దేవదాస్,కన్నడ కవులు జోషి,రమేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.