Saturday, December 13, 2025
E-PAPER

పంపకాలు షురూ

- Advertisement -

ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
డబ్బుల వేటలో అభ్యర్థులు, మద్దతుదారులు
ముఖం చాటేస్తున్న పైస్థాయి నాయకులు
ప్రతిష్ట కోసం సొంత పెట్టుబడులకు సమాయత్తం
గెలవకపోతే భారీగా నష్టపోనున్న రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 14వ తేదీ ఆదివారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో పంపకాలు జోరందుకున్నాయి. డబ్బుల కోసం అభ్యర్థులు, వారి మద్దతు దారులు శుక్రవారం నుంచే తీవ్ర వేట మొదలు పెట్టారు. గ్రామాల్లో ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలని ఎక్కడ వీలైతే అక్కడ డబ్బులు గుంజుకొ స్తున్నారు. ఆయా పార్టీల పైస్థాయి నాయకులు డబ్బుల విషయంలో చాలా వరకూ ముఖం చాటేస్తుండటంతో చేసేది లేక సొంతగానైనా ఖర్చు పెట్టి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

రిజర్వ్‌డ్‌ స్థానాల్లో తమ అనుచరులను పోటీకి నిలిపిన ఆయా గ్రామాల నాయకులు ప్రచారం మొదలు ఆర్థికఅంశాల వరకూ సర్వం మీదేసుకుంటున్నా.. అభ్యర్థి సైతం ఎంతో కొంత భరించక తప్పనిస్థితి. ఈ క్రమంలో రిజర్వ్‌డ్‌ స్థానాల నుంచి పోటీచేస్తున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ స్తోమతకు మించి డబ్బులు అప్పుగా తెస్తున్నారు. కొందరు ఆస్తులు, భూములను తనఖా పెడుతుండగా మరికొందరు భార్య, పిల్లల బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. మొదటి దఫా ఎన్నికల్లో ఇలా ఖర్చు పెట్టి ఓటమి పాలైన పలువురు అభ్యర్థులు తాము ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌ అన్న సైతం ఇలా డిమాండ్‌ చేసిన వారిలో ఉండటం గమనార్హం.

పోటాపోటీ పంపకాలు షురూ..
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 415 సర్పంచ్‌ స్థానాలు, 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఇవి మినహా 3,918 సర్పంచ్‌, 30,046 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పోటాపోటీ పంపకాలు శుక్రవారం రాత్రి నుంచే మొదలయ్యాయి. ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకూ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక అభ్యర్థి రూ.వెయ్యి పంచితే మరో అభ్యర్థి రూ.2వేలు పంపిణీ చేస్తున్నారు. వీటికి తోడు చీరెలు, కుక్కర్లు, చికెన్‌, మటన్‌, మద్యం సైతం పంపిణీ చేస్తున్నారు.

రవాణా ఖర్చులు సైతం..
వివిధ గ్రామ పంచాయతీల ఓటర్లు హైదరాబాద్‌, ఖమ్మం, ఇతర నగరాల్లో నివసిస్తున్నారు. వారిని రప్పించేందుకు అయ్యే రవాణా ఖర్చులు సైతం అభ్యర్థులు, మద్దతుదారులే భరిస్తున్నారు. ఒక్కొక్కరి రానుపోనూ రవాణా ఖర్చు హైదరాబాద్‌ నుంచి తక్కువలో తక్కువగా రూ.వెయ్యి వరకు అవుతున్నాయి. ఓటుకిచ్చే డబ్బులకు తోడు అదనంగా రవాణా ఖర్చులు సైతం ఇస్తామని ఫోన్లు చేసి చెబుతున్నారు. కొందరికి ఏకంగా ఫోన్‌ పే, గూగుల్‌ పే చేస్తున్నారు. నలుగురైదుగురు కలిసి ట్యాక్సీ మాట్లాడుకొని వస్తే అందుకయ్యే ఖర్చు కూడా తామే ఇస్తామని ఫోన్‌ చేసి చెబుతున్నారు. శనివారం రాత్రి వరకూ గ్రామానికి చేరుకోవాలని వేడుకుంటున్నారు.

డబ్బులు సమకూర్చేందుకు పడరాని పాట్లు
అధికార పార్టీ మినహా మిగిలిన పార్టీల పైస్థాయి నాయకులు పలువురు గ్రామీణనాయకులకు పూర్తిస్థాయిలో డబ్బులు సమకూర్చలేకపోతున్నారు. ఓటుకు రూ.2వేలు, 3వేలు ఇవ్వాల్సిన చోట రూ.10 లక్షలకు పైగా పంపిణీ చేయాల్సి వస్తుండగా రూ.2, 3 లక్షల వరకే పైస్థాయి నాయకులు సమకూర్చుతున్నారు. ఇవి సరిపోకపోవటంతో స్థానిక నాయకులు తలా కొంత జమచేసి తమ అభ్యర్థి గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. అభ్యర్థులు, మద్దతుదారులు అప్పులు చేసి డబ్బులు సమకూర్చుతున్నారు. ఈ పరిణామం గ్రామీణ నాయకుల కుటుంబాల్లో విభేదాలకు దారితీస్తోంది. నాయకులు అప్పుతెచ్చి సర్దుబాటు చేస్తుండటంతో కుటుంబంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక రెబల్‌ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల నాయకుల దగ్గరకు వెళ్లి డబ్బుల కోసం ప్రాధేయపడుతున్నారు. తమ అభ్యర్థి గెలిస్తే మీ పార్టీలో చేర్పిస్తామని హామీ ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. ఇలా పంపకాల కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోందని గ్రామ నాయకులు వాపోతున్నారు. శుక్రవారం రోజంతా వేచిచూస్తే తమ నాయకుడు రూ.2 లక్షలు చేతిలో పెట్టి ఇంతకు మించి తనతో కాదన్నాడని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండో దఫా ఖమ్మంలో 163.. భద్రాద్రిలో 140 పంచాయతీల్లో ఎన్నికలు
ఖమ్మం జిల్లాలోని ఆరు మండలాలు కామేపల్లి, ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండలో 23 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి మినహా 163 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. భద్రాద్రి జిల్లాలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 140 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంచుపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -