మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు
నవతెలంగాణ-లండన్
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ఆధిపత్య సవాల్ లార్డ్స్‌కు చేరుకుంది. తొలి రెండు టెస్టుల్లో టీమ్ ఇండియా గొప్ప ప్రదర్శన చేసినా.. 1-1తో సిరీస్‌లో సమవుజ్జీగానే కొనసాగుతుంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు సిరీస్‌లో ఆధిక్యం కోసం ఎదురుచూస్తుంది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై స్టోక్స్‌సేనను వణికించిన గిల్ గ్యాంగ్‌కు నేడు లార్డ్స్‌లో పేస్ పిచ్ స్వాగతం పలుకుతోంది. పచ్చికతో నిండిన లార్డ్స్ టెస్టులో భారత్‌కు జశ్‌ప్రీత్ బుమ్రా, ఇంగ్లాండ్‌కు జోఫ్రా ఆర్చర్ కీలకం కానున్నారు. ఇరు జట్లు ఆధిక్యం కోసం ఎదురుచూస్తుండగా.. భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు నేటి నుంచి లార్డ్స్‌లో ఆరంభం కానుంది.
జోరు సాగేనా?
లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్ టెస్టుల్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. శతకాలతో రికార్డుల మోత మోగించారు. కానీ లార్డ్స్‌లో సంప్రదాయ ఇంగ్లీశ్ పిచ్ ఎదురుచూస్తోంది. ఈ పిచ్‌పై నాణ్యమైన్ పేస్‌ను ఎదుర్కొని పరుగులు రాబట్టడం అంత సులువు కాదు. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ భీకర ఫామ్‌లో ఉన్నారు. టాప్-5 బ్యాటర్లలో కరుణ్ నాయర్ ఒక్కడే ఫామ్‌లో లేడు. మిగతా నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించిన ఉత్సాహంలోనే ఉన్నారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు స్పిన్ ఆల్‌రౌండర్లుగా అంచనాలను అందుకున్నా.. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి జట్టు ప్రణాళికల్లో ఇమడలేదు!. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా విరామం తర్వాత లార్డ్స్‌లో ఆడుతున్నాడు. ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌తో కలిసి బుమ్రా కొత్త బంతి పంచుకోనున్నాడు. బర్మింగ్‌హామ్‌లో ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌లు 17 వికెట్లు పడగొట్టారు. బుమ్రా రాకతో టీమ్ ఇండియా పేస్ విభాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి రెండు టెస్టుల్లో ఆడిన ప్రసిద్ కృష్ణ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.
ఆర్చర్ వస్తున్నాడు
2021 తర్వాత జోఫ్రా ఆర్చర్ మళ్లీ టెస్టు క్రికెట్‌లో అడుగుపెడుతున్నాడు. గత నెలలో కౌంటీ క్రికెట్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న జోఫ్రా ఆర్చర్‌ను లార్డ్స్ టెస్టులో గిల్‌సేనపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆర్చర్ మ్యాచ్‌లో 30 ఓవర్ల కంటే ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం లేదు. కానీ ఆ స్పెల్స్‌లోనే భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసేందుకు ఇంగ్లాండ్ పక్కా వ్యూహం రచించినట్టు కనిపిస్తోంది. జోశ్ టంగ్ స్థానంలో ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్‌లు లార్డ్స్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌కు కీలకం కానున్నారు.