Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅధికార లాంఛనాలతో దొర అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో దొర అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ హెచ్‌జె దొర అంత్యక్రియలు శనివారం అధికార లాంఛనాలతో జరిగాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకముందు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దొర భౌతిక కాయాన్ని ఉంచి ఊరేగింపుగా మహాప్రస్థానానికి తరలించారు. ఈ ఊరేగింపులో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌తో పాటు పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, మాజీ డీజీపీలు, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాప్రస్థానం సమీపంలో దొర పాడెను డీజీపీ శివధర్‌రెడ్డి, కమిషనర్‌ సజ్జనార్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ రమేశ్‌, తదితర అధికారులు కొద్ది దూరం వరకు మోశారు.

అనంతరం శ్మశానవాటికలో సాయుధ పోలీసులు నిబంధనల ప్రకారం తుపాకులను గాలిలో పేల్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. దొర కుమారుడు సత్యనారాయణ సంప్రదాయం ప్రకారం ఆయన చితికి నిప్పంటించారు. కాగా ఆయన అంత్యక్రియలు సాగుతున్నంత సేపు ‘దొర అమర్‌ రహే’ అనే నినాదాలు మార్మోగాయి. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు కంటనీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ… తనతో పాటు అనేక మంది ఐపీఎస్‌ అధికారులకు దొర మార్గదర్శకుడనీ, ఆయన నాయకత్వ ప్రతిభతో పోలీసు శాఖకు దేశంలోనే గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ అంత్యక్రియలలో మాజీ డీజీపీలు జితేందర్‌, అరవింద్‌రావు, రాజీవ్‌ త్రివేదీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -