Saturday, July 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకరువు రక్కసి కాటేస్తోంది

కరువు రక్కసి కాటేస్తోంది

- Advertisement -

– గాజాలో అన్నార్తుల ఆర్తనాదాలు
– అస్థిపంజరాలుగా మారుతున్న చిన్నారులు
– ఆహార కొరతతో అల్లాడుతున్న లక్షాలాది పాలస్తీనియన్లు
గాజా :
ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణ హోమంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటు తున్నాయి. అన్నార్తుల ఆర్తనాదాలతో నగరం ప్రతిధ్వనిస్తోంది. ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తోంది. రెండు లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ఆహార అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో యునిసెఫ్‌ ఇటీవల విడుదల చేసిన పోస్ట్‌ తెలిపింది. వారంతా తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో పెద్ద ఎత్తున ఆకలి మరణాలు సంభవిస్తాయని వందకు పైగా ఎన్జీఓలు హెచ్చరించాయి.

డొక్కలు ఎండిపోయి…
గాజాలో తొమ్మిది లక్షల మంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీరిలో 70,000 మంది ఇప్పటికే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గాజాలోని పేషెంట్స్‌ ఫ్రండ్స్‌ బెనెవొలెంట్‌ సొసైటీ ఆస్పత్రి వార్డులోకి వెళితే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కన్పిస్తున్నాయి. డొక్కలు ఎండిపోయి, అస్థిపంజరాలుగా కన్పిస్తున్న పిల్లలతో ఆ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పడకలు చాలకపోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరేసి పిల్లలను ఉంచుతున్నారు. ప్రస్తుతం గాజా నగరంలో చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించే బృందాలు రెండు మాత్రమే ఉన్నాయి. ప్రతి రోజూ 200 మందికి పైగా పిల్లలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నారు.

దిగ్బంధమే కారణం
గాజాకు అత్యవసర సహాయ సామగ్రి చేరకుండా ఇజ్రాయిల్‌ దళాలు అష్టదిగ్బంధం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి తెలిపారు. సహాయాన్ని అడ్డుకోవడం, ఆంక్షలు విధించడం వంటి చర్యల కారణంగా గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రతరమవుతోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అడ్హనమ్‌ గేబ్రియేసస్‌ హెచ్చరించారు. ఆహార సరఫరాలను మార్చి నుంచే ఇజ్రాయిల్‌ అడ్డుకోవడంతో ప్రస్తుతం గాజాలో ఆహార నిల్వలు అడుగంటుతున్నాయి. మేలో ఆంక్షలను పాక్షికంగా తొలగించినప్పటికీ సరఫరాలూ అరకొరగానే ఉన్నాయి. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలపై ఇజ్రాయిల్‌ సైనికులు జరుపుతున్న కాల్పుల్లో మే నుంచి ఇప్పటి వరకూ వెయ్యి మందికిపైగా మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఆకలికి తట్టుకోలేక తమ పిల్లలు గగ్గోలు పెడుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని పలువురు తల్లిదండ్రులు వాపోయారు. ఆహార పంపిణీ కేంద్రాలు హింసకు మారుపేరుగా మారుతున్నాయి. మరోవైపు గాజాలో పిండి ధరలు పెరిగిపోతున్నాయి. వ్యాపారులు మార్కెట్‌ ధర కంటే 30 రెట్లు అదనంగా తీసుకుంటున్నారు.

దాడులే కాదు… ఆకలి కూడా చంపేస్తోంది
ఇటీవలి కాలంలో ఆహారం కోసం పంపిణీ కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించిన 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల సమీపంలో పొంచి ఉన్న ఇజ్రాయిల్‌ సైనికులు కాల్పులకు తెగబడడంతో వీరంతా మృత్యువాత పడ్డారు. ఇక వైమానిక దాడులతో ఇజ్రాయిల్‌ దళాలు ఇప్పటికే అరవై వేల మంది పాలస్తీనియన్లను పొట్టన బెట్టుకున్నాయి. 2023 అక్టోబర్‌ నుంచి ఇజ్రాయిల్‌ దళాలు అమానుషంగా ప్రవరిస్తూ పాలస్తీనియన్ల ప్రాణాలను హరిస్తున్నాయి. వీరిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు అధిక సంఖ్యలో ఉండడం విచారకరం. యుద్ధం ప్రారంభమైన తర్వాత పాలస్తీనా అధికారులు తొలిసారిగా ఓ చేదు నిజాన్ని బయట పెట్టారు. ఇజ్రాయిల్‌ దాడులే కాదు…ఆకలి కూడా పాలస్తీనా వాసులను చంపేస్తోందని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -