భారతదేశమనే భావన సావర్కర్ అల్లిన హిందూత్వ భావజాలంలోంచి రూపొందలేదు. బ్రిటిష్ వలస పాలనను తరిమికొట్టేందుకు సాగిన జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో చిందిన నెత్తురు, చెమట నుంచి అది రూపుదిద్దుకుంది.1950 జనవరి 26న స్వీకరించబడిన రాజ్యాంగం పునాది స్తంభాలకు దోహదం చేసిన ఒక కొత్త తరహా సిద్ధాంత పత్రాన్ని ఆ భావన తీసుకొచ్చింది. ఆ ప్రాథమిక సూత్రాలేమిటి? ఆర్థిక, రాజకీయ, సార్వభౌమత్వం అన్నవి వలస పాలన తొలగింపు దిశగా ప్రయాణం, స్వాతంత్య్రపోరాట కొనసాగింపులే కావడం తర్కబద్ధమైన విషయం. భారతీయ భావన లౌకికమార్గం చేపట్టవలసి వచ్చింది.
ప్రజల స్వేచ్ఛను గుర్తించడం, తమ విశ్వాసాలను అనుసరించేందుకు వారికిగల సమాన హక్కును గౌరవించడం, ఎలాంటి బుజ్జగింపులకూ లేక ప్రలోభాలకు లోబడకపోవడం సహజంగానే అవసరమైంది. అది తప్పక ప్రజాస్వామికంగా వుండవలసిందే. ఎందుకంటే బలహీనులకూ అధికారం గల వారికి మధ్య గొప్ప వ్యత్యాసాన్ని, అవకాశాలు సంపదలలో వున్న అగాధాన్ని భర్తీ చేయడం సాధ్యపడదు. అనేక జాతుల, సంస్కృతుల, భాషల, ఆహార, వేషధారణల వైవిధ్యభరితమైన బహుళత్వాన్ని కాపాడేందుకు అది సమాఖ్యతత్వం తీసుకోవలసి వచ్చింది. లేకపోతే హిందూత్వ అనుయాయులు చెబతున్నట్టు ఏకధృవ ఏకపక్ష మూస పద్ధతిలో ఒకే వరలో ఇమడ్చడం సాధ్యపడేది కాదు.
ప్రాణాధార సూత్రం
భారతదేశమనే ఏ భావననైతే రాజ్యాంగం స్థాపించిందో అది నయా ఫాసిస్టు నమూనా పుస్తకంగా వుండజాలదన్నది స్పష్టమే. భారతదేశమనే భావన భిన్నత్వంతో కూడిన ప్రజలకు ఒకే ఉమ్మడి సమాన పౌరసత్వం వర్తింపచేసింది.అలాంటి భావన సార్వత్రిక వయోజన ఓటింగు అనే సూత్రం ప్రాతిపదికగా వుండాల్సిందే. అందరికీ ఒకే విధమైన భాగస్వామ్యమన్న సూత్రం అప్పుడే అమలవుతుంది. జాతీయ భాష, జాతీయ మతం అన్నది రాజ్యాంగం ఉద్దేశించిన వాటిలో లేదు. పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యంలోని దృక్పథం వలెగాక ఈ దేశంలో సార్వత్రిక ఓటుహక్కును ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవలసి వచ్చింది. అలాంటి విధానం లేకపోయినట్టయితే ఒక సమిష్టి ఉమ్మడి మనుగడతో భారత దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లేది.
ఈ ఆలోచన అమలుకు కేంద్రకం బలమైన రాజ్యాంగ సాధికారత కలిగిన భారత ఎన్నికల సంఘం (ఈసిఐ). ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలును అది పర్యవేక్షించాలి. అంతేగాక ఎన్నికల సంఘం చట్టబద్ధంగా భారత పౌరులైన ప్రతివారినీ ఓటర్ల జాబితాలో చేర్చడం ఈసిఐ పని అన్నది సుస్పష్టం. అది బాధ్యతే తప్ప ఎంతమాత్రం ఔదార్యం కానే కాదు. అందువల్లనే ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల సంఘం పని తప్ప వ్యక్తిగతంగా పౌరుల పని కానే కాదు. భారత దేశమనే భావనను అమలు చేయడం కోసం రాజ్యాంగం ఈసిఐకి అప్పగించిన బాధ్యత అది. ఈ సూత్రం ప్రాతిపదికగా పనిచేయడం వల్లనే ఇసిఐ దేశంలోనేగాక ప్రపంచమంతటా గుర్తింపు పొందింది.
ట్రంప్ ఈసిఇ-మన ఈసిఐ
దురదృష్టవశాత్తూ సరిగ్గా ఇక్కడే భారతదేశమనే భావనకు ప్రస్తుతం ముప్పు ఎదురవుతున్నది. ఈ ప్రమాదానికి మూలం ఏమిటనే చర్చ పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా పచ్చి మితవాద భావజాలం ప్రబలిన నేపథ్యంలో పౌరుల మత గుర్తింపులను బట్టి తేడాలు చూపించే హిందూత్వ సిద్ధాంతమే ఇందుకు కారణమవుతున్నది. ప్రపంచీకరణ, ఆయా దేశాల నిర్దిష్టమైన నయా ఉదారవాద నమూనాలు దీన్ని ఇంకా పెంచుతున్నాయి. ఈ కొత్త విధాన పత్రంలో పరాయివారిని చేయడం ఒక ప్రధాన భాగం.డోనాల్డ్ ట్రంప్ ఐసిఇ (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ఏజెంట్ల లాగే ఇండియా వరకూ చూస్తే ఆరెస్సెస్ భయం, అభద్రత జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నది.
వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ సంక్షేమానికి స్వయం ప్రకటిత పరిరక్షకుడుగా అమిత్ షా దేశ అంతర్గత భద్రతకు బాధ్యత చేపట్టారు. కానీ జాతి మూలాలను తినేస్తున్న ”చెద పురుగుల” లాంటి ఆ చొరబాటుదార్లను గుర్తించేందుకు ఆయన చిటికెన వేలైనా కదల్చలేదు.కనుక కనీస సాక్ష్యాధారాల వంటివేమీ కూడా లేకుండానే చొరబాటుదారులు అన్న మాటను ఆయుధంగా చేయడం ఈసిఐ నమూనా పుస్తకంలోకి ప్రవేశించింది. గాలించు, తొలగించు, తరలించు అనే పొలికేక ఇసిఐ ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్.ఐ.ఆర్-సర్)కు అలిఖిత రాగంగా తయారైంది. చెద పురుగులుగా చిత్రించబడిన పౌరుల ఓటు హక్కు తొలగించడమే దాని లక్ష్యంగా మారింది.
బీహార్ టు బెంగాల్
ఏమైనా బీహార్‌లో మొదలై పన్నెండు రాష్ట్రాలలో కొనసాగుతున్న అలాంటి కసరత్తు తుది ఫలితాలు చూస్తే మాత్రం అలాంటి చొరబాటుదారుల ఆచూకీ చూపించే బలమైన సాక్ష్యాలు లేశమెత్తు కూడా బయట పెట్టింది లేదు. ఇలాంటి తప్పుడు వైఖరి వల్ల నిజంగా జరిగిందేమంటే పేదలు, బలహీనులను దెబ్బ తీయడమే. అందువల్ల ఇప్పుడు ‘సర్’ నిర్వహణ కోసం కాల వ్యవధిని కుదించడం పూర్తిగా పొరబాటని సుస్పష్టమవుతుంది. ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్‌లో దీనివల్ల కలిగిన నష్టమేమిటో అందరికీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్‌లో చెప్పుకోదగినంత ముస్లిం జనాభా వుంటుంది. కొన్ని తరాలుగా వారు అక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు వారి ఓట్లనే రద్దు చేయడం జరుగుతున్నది. ‘సర్’ ప్రక్రియ ప్రారంభించక ముందు అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా వుండేది. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాక ఈ సంఖ్య 7.08కి పడిపోయింది.
2002-03 జాబితాలలో మిగిలిన వారు తమను తాము అనుసంధానించుకోలేక పోయారనే అంచనా దీనికి కారణమైంది. అనుసంధానం లేనివారంతా ఆధార పత్రాలు లేనివారో పౌరసత్వం లేనివారో అయితీరాలని లేదు. ఏమైనా ‘సర్’ కసరత్తు ఖచ్చితంగా భావించింది అదే. దాంతో వారి ఓటు హక్కు రద్దయిపోయింది. అయితే ఇది కూడా సరిపోలేదు. గత రెండు దశాబ్దాలుగా హిందూత్వ శిబిరం చెబుతూ వస్తున్నదానికి ఇది భిన్నంగా తయారైంది, తమ కథనాలను ఆ శిబిరం నిరూపించలేకపోయింది. ఏ తరగతుల వారినైతే ఇంత కాలం భూతాలుగా చిత్రిస్తూ వచ్చారో వారి దగ్గర తగు ఆధార పత్రాలున్నాయని తేలింది. అందువల్ల ఓటర్ జాబితా ముసాయిదా పెద్ద అడ్డంకిగా మారింది.
తీవ్రమైన ఒత్తిడి మధ్య ఈసిఐ అమిత్‌షాకు సహాయక సాధనంగా మారింది. ఆయన చెప్పేది ఎన్నికల చట్టాలలో గానీ, నిబంధనల్లో గానీ లేనిది. ”తర్కబద్ధమైన తేడాలు” అనే కొత్త దృక్పథం సృష్టించింది. పేర్లు పలకడంలో తేడాలు, తల్లిదండ్రులకూ సంతానానికి మధ్య వయసులో తేడాలు వగైరా వగైరా తప్ప ఇందులో మరేమీ లేదు. పౌరసత్వం అనే భావనను వక్ర మార్గంలో జొప్పించడానికి స్పష్టమైన సాక్ష్యం ఇది. దీని ఫలితంగా ఇంకా నిర్ణయం తీసుకోవాలనే పేరిట అరవై లక్షల పేర్లు నిలిపివేయబడ్డాయి. వాటిలో అత్యధిక భాగం కింది వర్గాల వారు, మైనార్టీలు, దళితులు, గిరిజనులు మహిళలకు సంబంధించినవే. మొట్టమొదట చెప్పినట్టు భౌతికంగా ప్రత్యక్ష పరిశీలన చేస్తామని మాటిచ్చిన ఈసిఐ అలాంటి తేడాలు తేల్చడానికి డిజిటల్ పద్ధతులు చేపట్టవలసి వచ్చింది.
రాజ్యాంగ సంక్షోభం?
ఓటర్ల తుది జాబితా ప్రకటన ఇప్పటికి వాయిదాలోనే వుంది. ఈ తేడాలనబడే వాటిని తేల్చడం కోసం అదనపు అధికారులను నియమించాల్సి వస్తే న్యాయాధికారులను తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయ పడాల్సి వచ్చింది. అలాంటి చర్య రాజ్యాంగపరంగా చర్చనీయం అవుతుంది. అయినా కూడా ఇసిఐ ఈ తతంగం పూర్తి చేయడానికి మరో నెల అవసరమని ఒక అఫిడవిట్ సమర్పించాల్సి వచ్చింది. ఇది ఒక రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నది. ఓటర్ల తుది జాబితా ప్రచురించబడకపోతే మే6 లోగా ఎన్నికల నోటిఫికేసన్ విడుదల చేసే అవకాశం వుండదు. ఎందుకంటే కొత్త శాసనసభ మే7లోగా ఏర్పడవలసి వుంది.
అరవై లక్షల ఓటర్లపై నిర్ణయం పూర్తికాకుండా తుది జాబితా ఖరారు కాజాలదని సిపిఐ(ఎం) గట్టిగా చెబుతున్న మాట సమర్థనీయమైంది. ఇక ఇసిఐ ఒక భావజాలంతో తెచ్చి రుద్దిన ఈ ప్రయత్నంలో సామూహిక వేధింపులు సరేసరి. అందువల్ల భారత రాజ్యాంగం చెప్పిన భారతదేశమనే భావనలో అత్యవసర అంశమైన ఎన్నికల ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. అమిత్ షా ఉద్దేశాన్ని అమలు చేసేందుకు తాను చేస్తున్న తప్పుడు ప్రయత్నంలో ఇసిఐ రాజ్యాంగ అమరికనే ప్రమాదంలో నెట్టింది. ప్రజాస్వామ్య ప్రేమికులందరూ, ప్రత్యేకించి దేశంలోని వామపక్షాలు సార్వత్రిక ఓటు హక్కు, ఎన్నికల ప్రజాస్వామ్యం అనే ఈ ప్రాథమిక భావనకు గట్టిగా కట్టుబడి వుండాలి. న్యాయమైన ఒక్క ఓటరుకు కూడా తొలగించబడకుండా హామీ సాధించాలి.
(మార్చి11 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
భారత భావనకే ఈ.సి ఎసరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



