సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
బొల్లారంలో అరుణ సంస్మరణ సభ
నవతెలంగాణ- వీపనగండ్ల
ప్రభుత్వాలు మారుతున్నా పేదల ఆర్థిక స్థితిగతులు, మహిళల స్థితిగతులు మారడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని బొల్లారం గ్రామంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఎం కృష్ణయ్య సతీమణి అరుణ సంస్మరణ సభ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి డి బాల్‌రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ముందుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, ఆర్ రాంరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బర్, నాయకులు భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, తదితరులు అరుణ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ అరుణమ్మ మృతి పార్టీకి, ఈ ప్రాంతానికి తీరనిలోటన్నారు. అరుణ చిరునవ్వుతో, మంచితనంతో ఆప్యాయతతో పలకరిస్తూ ఇంటికి వచ్చిన కార్యకర్తలకు భోజనం పెట్టి ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ ప్రాంతంలో కరువు సంభవించిన కాలంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఆమె పాత్ర కీలకమన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. గ్రామంలో దళితులకు ఇండ్లు నిర్మించడంలోనూ, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం, గ్రామ అభివృద్ధి కోసం పార్టీ కృషి చేసిందని అన్నారు ఉన్నత పాఠశాలకు స్థలం కోసం పార్టీ నాయకులు రెండు ఎకరాలు విరాళంగా ఇచ్చి విద్య కోసం కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ కుట్ర చేస్తుందని దీనికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాలన్నారు.
ప్రజల కోసం పోరాటమే ప్రతీ కార్యకర్త బాధ్యత : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ప్రజల కోసం పోరాడడమే ప్రతీ కార్యకర్త బాధ్యత అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. అరుణ సంస్మరణ సభకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోవడంతో ఆదివారం రాత్రి జాన్‌వెస్లీ కుటుంబాన్ని పరామర్శించారు. అరుణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనో ధైర్యం అందించారు. ఈ సందర్భంగా వెస్లీ మాట్లాడుతూ అరుణ నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల మహిళల హక్కుల కోసం గ్రామ పార్టీ అభివద్ధి కోసం కృషి చేశారన్నారు.
భర్త కృష్ణయ్యకు అండగా ఉంటూ ఉద్యమానికి ఊతం ఇచ్చిన మహిళ నాయకురాలని కొనియాడారు. దేశంలో సంపద కొంతమంది చేతుల్లోనే ఉందని భూములు భూస్వాముల చేతిలో ఉన్నాయని అన్నారు. దోపిడీ లేని సమాజం కోసం, అసమానతలు లేని సమాజం కోసం వర్గ పోరాటాలు నిర్వహిస్తేనే అరుణకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాయకులు రాజు, నరసింహ, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు



