Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంగురి తప్పిన ఆర్థిక సర్వే

గురి తప్పిన ఆర్థిక సర్వే

- Advertisement -

పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకున్న వైనం
ఉపాధిని సృష్టించలేని ఆర్థిక వృద్ధి
మోడీ సర్కారు వాదనలను తప్పుబడుతున్న మేధావులు, నిపుణులు

న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఆర్థిక అంచనాలు గురి తప్పాయి. ఆర్థిక సర్వే 2025-26లో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచీకరణ యుగం ముగిసిందనీ, ఇక దేశాలు స్వదేశీ సామర్థ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్థిక సర్వే 2025-26 వాదిస్తోంది. వాణిజ్యం రాజకీయ ఆయుధంగా మారిందనీ, మూలధన ప్రవాహాలు అస్థిరంగా ఉన్నాయని పేర్కొంటోంది. భారత్‌ ‘స్వదేశీకరణ’ వైపు మళ్లాల్సిందేనని ప్రభుత్వ వాదిస్తున్నది. అయితే ఈ ఆర్థిక సర్వే భారత వాస్తవ ఆర్థిక పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. సర్వే స్వయంగా ఇచ్చిన గణాంకాలే ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఆర్థిక సర్వే చేసిన పది ప్రధాన తప్పిదాలను వారు ఎత్తి చూపుతున్నారు.

  1. ప్రపంచీకరణ కూలిపోవడం లేదు.. పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోంది
    ప్రపంచ పెట్టుబడి వ్యవస్థ పూర్తిగా వెనక్కి వెళ్లిపోతున్నట్టు కాకుండా పునర్‌వ్యవస్థీకరణ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది. సరఫరా గొలుసులు విభిన్న మార్గాల్లో విస్తరిస్తున్నాయి. ఉత్పత్తి విభజన జరుగుతోంది. వాణిజ్యం కొత్త భౌగోళిక-రాజకీయ కూటముల ద్వారా మార్గం మళ్లుతోంది. ప్రస్తుతం కనిపిస్తున్న విభజన అనేది ముగింపు కాదు.. మరో దశలోకి మార్పు మాత్రమే అని విశ్లేషకులు చెప్తున్నారు.
  2. ప్రపంచంతో అనుసంధానంతోనే ఆర్థిక వృద్ధి
    భారత్‌.. ప్రపంచంతో ఎక్కువగా కలిసిపోకుండా ఉంటేనే బలంగా ఉంటుందని ఆర్థిక సర్వే వాదించింది. కానీ భారత్‌ వృద్ధి చరిత్ర దీనికి విరుద్ధంగా ఉన్నది. ఐటీ సేవలు, ఔషధ పరిశ్రమ, ఆటో కాంపోనెంట్స్‌ వంటి విజయవంతమైన రంగాలు ప్రపంచ ఆనుసంధానం ద్వారానే ఎదిగాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్థిరత్వం అనేది ప్రపంచంతో అనుసంధానాన్ని సమర్థంగా నిర్వహించడం వల్లే వచ్చిందనీ, దాని నుంచి వెనక్కి తగ్గడం వల్ల మాత్రం కాదని వివరిస్తున్నారు. అంతర్గత సామర్థ్య నిర్మాణం పైనే దృష్టి పెట్టడం ద్వారా.. ప్రపంచ అనుసంధానం ద్వారా భారత్‌ సాధించిన సంస్థాగత లాభాలను సర్వే తక్కువా అంచనా వేసిందని చెప్తున్నారు.
  3. ఉపాధిని సృష్టించని ఆర్థిక వృద్ధి
    భారత ఆర్థిక వృద్ధి ప్రపంచస్థాయిలో ఉన్నదని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే భారత్‌లో మాత్రం అదే స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం లేకపోవడం గమనార్హం. తయారీ రంగం మరింత మూలధనాధారితంగా మారింది. సేవల ఎగుమతులు కొద్ది మందికి మాత్రమే ఉన్నత ఉత్పాదకత కలిగిన ఉద్యోగాలను కల్పించాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
  4. ఉపాధి నిర్వచనంపై లేని స్పష్టత
    ఆర్థిక సర్వే దేశంలో పెరుగుతున్న ఉపాధి, తగ్గుతున్న నిరుద్యోగ రేట్లను ప్రస్తావిస్తోంది. కానీ ఇవి ఉపాధిని ఎలా నిర్వచిస్తున్నారన్నదానిపై ఆధారపడి ఉంటాయి. భారత కార్మిక సర్వేల్లో… ఒక వారం కాలంలో ఒక గంట పని చేసినా దానిని ఉపాధిగా పరిగణిస్తారు. జీతం లేని కుటుంబపని, అస్థిర తాత్కాలిక పనులన్నీ కూడా స్థిర ఉద్యోగాలుగానే లెక్కించబడుతున్నాయి. దీంతో దేశంలో వాస్తవ ఉపాధి గణాంకాలు ప్రతిబింబించటం లేవు. ఈ లెక్కల ప్రకారం దేశంలో ఎక్కువ మంది పని చేస్తున్నారు కానీ తక్కువ గంటలు, తక్కువ వేతనాలతో, అధిక అస్థిరతతో పని చేస్తున్నారు. పని గంటల కొరత, అస్థిర ఉపాధి, స్థిరమైన ఆదాయం లేకపోవడం వంటి అంశాలు సర్వేలో పెద్దగా కనిపించవు.
  5. ఫార్మలైజేషన్‌ను ఉద్యోగ సృష్టిగా భావించడం
    ఈపీఎఫ్‌ఓ నమోదు, జీఎస్టీ, ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్లను ఉద్యోగ సృష్టి సూచికలుగా సర్వే చూపిస్తోంది. కానీ ఇవి కేవలం ప్రభుత్వం తన పరిధిని విస్తరించుకున్నట్టు మాత్రమే చూపిస్తాయి తప్పితే ఉద్యోగ సృష్టి కావని విశ్లేషకులు చెప్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సృష్టి లేకుండా అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించదని అంటున్నారు.
  6. అధిక మహిళా కార్మిక భాగస్వామ్యం వెనుక ఆర్థిక ఒత్తిడి
    దేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు పెరిగిందని సర్వే చెప్తున్నది. కానీ ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం జీతం లేని కుటుంబ పని, ఇంటి ఆధారిత స్వయం ఉపాధి, వ్యవసాయ సహాయక పనుల ద్వారానే వచ్చింది. ఇవి మంచి వేతనాలు, భద్రత ఉన్న ఉద్యోగాలు కావు. బయట మెరుగైన అవకాశాలు లేకపోవడం కారణంగానే మహిళలు ఇలాంటి పనుల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి వంటి పరిస్థితులే ఇందుకు దారి తీస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
  7. కరెంట్‌ అకౌంట్‌ లోటును వృద్ధికి ప్రధాన అడ్డంకిగా చూపించడం
    ఆర్థిక సర్వే కరెంట్‌ అకౌంట్‌ లోటును అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా పేర్కొంటోంది. కానీ 2000లలో భారత్‌ అత్యధిక వృద్ధి సాధించిన సమయంలో ఇదే లోటు పెరిగింది. నేటి అధిక వడ్డీ రేట్లు విదేశీ లోటు వల్ల కాకుండా.. దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ బలహీనత, రిస్క్‌ భయం, రుణ మార్కెట్‌ లోపాల వల్ల ఎక్కువగా వస్తున్నాయి. కరెంట్‌ అకౌంట్‌ను ప్రధాన సమస్యగా చూపడం ద్వారా దేశీయ సంస్థాగత లోపాలపై దృష్టి మళ్లిపోతుంది.
  8. సంక్షేమ పథకాలను వృద్ధికి విఘాతంగా చూపటం
    షరతులు లేని ప్రత్యక్ష లబ్దిదారు నగదు బదిలీలు (డీబీటీలు) మూలధన వ్యయాన్ని తగ్గిస్తాయని సర్వే అభిప్రాయం. కానీ ఇది ఆదాయ సహాయం స్వరూపాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమేనని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలో స్థిర ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఈ బదిలీలు కార్మిక ఆదాయ లోటును భర్తీ చేస్తున్నాయని వారు అంటున్నారు. ఉద్యోగాలు లేకపోవడమే డీబీటీలు విస్తరించడానికి అసలు కారణమనీ, ఇది ఆర్థిక వైఫల్యానికి సంకేతమని చెప్తున్నారు.
  9. మౌలిక సదుపాయాల పెట్టుబడులతో ఉద్యోగాలు వస్తాయన్న భ్రమ
    మౌలిక సదుపాయాల పెట్టుబడులపై సర్వే అధిక నమ్మకం పెట్టుకున్నది. అయితే ఈ పనులు తాత్కాలిక ఉపాధినే ఇస్తాయనీ, దీర్ఘకాలిక జీవనాధారాలు సృష్టించలేవని విశ్లేషకులు చెప్తున్నారు. తయారీ రంగ ప్రోత్సాహకాలు ఉపాధిని కాకుండా ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటున్నాయని వారు అంటున్నారు.
  10. వ్యవసాయ వృద్ధిని రైతుల ఆదాయంతో సమానంగా చూడటం
    ఆర్థిక సర్వే వ్యవసాయ వృద్ధిని గ్రామీణ స్థిరత్వానికి సూచికగా చూపిస్తోంది. కానీ 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ వృద్ధి 3.5 శాతానికి పడిపోయింది. దశాబ్ద కాల వృద్ధి ప్రధానంగా పశుపోషణపై ఆధారపడింది. పంటలపై ఆధారపడే రైతులకు ఇది ఆదాయ వృద్ధిగా మారడం లేదు. ఉత్పత్తి వృద్ధిని ఆదాయ వృద్ధిగా భావించడం ఆర్థిక సర్వేలోని పెద్ద లోపంగా విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని అంగీకరించడంలో ఆర్థిక సర్వే సరైనదే కానీ.. భారత ఆర్థిక వాస్తవాన్ని తప్పుగా చదివి స్థిరత్వాన్ని నిర్మించలేమని మేధావులు అంటున్నారు. ఉపాధిని దాటవేసే వృద్ధి, ఉద్యోగాలు లేకుండా ఫార్మలైజేషన్‌, ఉపాధి సంస్కరణలు లేని సంక్షేమం దీర్ఘకాలిక స్థిరత్వానికి పునాది కావని వారు చెప్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -