Saturday, February 28, 2026
E-PAPER
Homeబీజినెస్ఆర్థిక వ్యవస్థ డీలా..!

ఆర్థిక వ్యవస్థ డీలా..!

- Advertisement -

– క్యూ3లో జీడీపీ 7.8 శాతం
– నూతన సిరీస్‌ 2022-23 ప్రారంభం
న్యూఢిల్లీ :
భారత జీడీపీలో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీి 7.8 శాతానికి మందగించింది. ఇంతక్రితం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి చోటు చేసుకుంది. దీంతో పోల్చితే భారీ తగ్గుదల నమోదయ్యింది. శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. నూతన సిరీస్‌ 2022-23 స్థిర ధరల వద్ద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జిడిపి 7.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. దీన్ని ఇంతక్రితం జనవరిలో ప్రకటించిన పాత సిరీస్‌లో 7.4 శాతంగా అంచనా వేసింది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీడీపీ గణాంకాల్లో వృద్ధి రేటు పెరిగిందని సంబరపడుతున్నప్పటికీ.. లోతుగా పరిశీలిస్తే 2025-26లో ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.345.47 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది పాత సిరీస్‌ అంచనాల కంటే 3.3 శాతం తక్కువ కావడం గమనార్హం.కేంద్ర గణాంక శాఖ కార్యదర్శి సౌరభ్‌ గార్గ్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ విడుదల చేసిన ఈ కొత్త సిరీస్‌ వివరాలు.. పాత ఆధారిత సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు మార్చారు. ఈ కొత్త సిరీస్‌ ప్రకారం.. 2023-24 వృద్ధి రేటును పాత సిరీస్‌లోని 9.2 శాతం నుండి 7.2 శాతానికి తగ్గించగా, 2024-25లోని జీడీపీిని 6.5 శాతం నుంచి 7.1 శాతానికి పెంచారు. ప్రస్తుత 2025-26లో తయారీ రంగం గత ఏడాదిలోని 8.3 శాతం నుంచి 12.5 శాతానికి చేరొచ్చు. నిర్మాణ రంగం 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గొచ్చని అంచనా. వ్యవసాయ రంగం వృద్ధి 4.3 శాతం నుంచి 2.5 శాతానికిి, మైనింగ్‌ రంగం 11.2 శాతం నుంచి 5 శాతానికి పరిమితం కావొచ్చు. మరోవైపు సేవా రంగం 8.3 శాతం నుంచి 8.9 శాతానికి చేరొచ్చు. నూతన సిరీస్‌ ప్రకారం.. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్పు-జీడీపీ నిష్పత్తి బడ్జెట్‌ లక్ష్యం 55.6 శాతం కంటే ఎక్కువగా 57.5 శాతంగా ఉండనుందని ఆర్థిక నిపుణులు ఆదితి నాయర్‌ పేర్కొన్నారు. దీనివల్ల 2031 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పును జీడీపీలో 50 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదన్నారు. వచ్చే 2026-27లో జీడీపీ 7-7.4 శాతంగా ఉండొచ్చని నాగేశ్వరన్‌ అంచనా వేశారు. అదే సమయంలో సునాయాసంగా 4 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తుందన్నారు. జీడీపీ కొత్త సిరీస్‌ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -