జాతీయ విద్యావిధానంతో అసమానతలు
ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉద్యమం
జనవరిలో హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా కన్వెన్షన్ : ఆలిండియా ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య
ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా జూలకంటి, అధ్యక్షులుగా విద్యావేత్త వేదకుమార్
నవతెలంగాణ – ముషీరాబాద్
దేశంలో మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తోందని, అందుకోసం జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా అధ్యక్షతన సోమవారం జాతీయ కన్వెన్షన్ ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీజన్ మాట్లాడుతూ.. దేశంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మార్పుల పేరుతో అమెరికన్ విద్యావిధానం అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. 5 ఏండ్లవుతున్నా జాతీయ విద్యావిధానం నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్నారు.
జాతీయ విద్యావిధానం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను విద్యారంగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే అంబానీ, ఆదానీలకు విద్యారంగాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ విద్యవిధానం వల్ల దేశంలో అసమానతలు పెరిగి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతారని చెప్పారు. వీదేశీ యూనివర్సిటీలు, ప్రయివేటు యూనివర్సిటీలు విచ్చలవిడిగా పెరుగుతాయని, విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. దానికోసం జనవరిలో హైదరాబాద్‌లో నేషనల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నామని, ఈ కన్వెన్షన్‌ను జయప్రదం చేయాలని కోరారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్వహించనున్న కన్వెన్షన్‌కు దేశ వ్యాప్తంగా సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పీఎంశ్రీ పేరుతో జాతీయ విద్యావిధానం అమలు చేయాలని చూస్తోందన్నారు. ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ఐసీడీఎస్‌ను రద్దు చేసే కుట్రలు మానుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో జనవరిలో 3 రోజులపాటు నిర్వహించనున్న కన్వెన్షన్‌కు సహకరించాలని కోరారు. అనంతరం ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త వేదకుమార్ వ్యవహరించనున్నారు.



