జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మహిళా భద్రతా విభాగంతో పాటు రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ కొనియాడారు. గురువారం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న నేరాలను అరికట్టడంలో పోలీసు వ్యవస్థలు మరింత బాధ్యతాయుతంగా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా పోలీసు భద్రతా విభాగం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని తెలిపారు.
దేశ జనాభాలో సగ భాగమైన మహిళల సాధికారత విషయంలో సమాజంలోని అన్ని వర్గాలూ తోడ్పాటునందించాలనీ, అదే దేశ అభ్యున్నతికి మరింతగా దోహదకారిగా కాగలదని విజయ రహత్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో 30 మంది మహిళలు అందించిన ఫిర్యాదులను చైర్‌పర్సన్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేకూర్చాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ చారు సిన్హా, మల్కాజ్‌గిరి కమిషనర్ అవినాశ్ మహంతి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.



