Sunday, October 19, 2025
E-PAPER
Homeహెల్త్పెద్దలమాట చద్దిమూట..!

పెద్దలమాట చద్దిమూట..!

- Advertisement -

“Education is the manifestation of perfection present already in man. Divinity is the manifestation of the religion already in man”

Swami Vivekananda

మనస్విని తన పిల్లల్ని ఇంటికి దగ్గర్లోని కాలేజీలో చేర్పించింది. అక్కడ స్టాఫ్‌ సరిగా లేరని, పాఠాలు సరిగా చెప్పరని చాలాసార్లు చెప్పినా వినలేదు. ఇంటికి దగ్గరగా ఉందని, ఇబ్బంది వుండదని భావించిందే తప్ప పిల్లల చదువు, భవిష్యత్తు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందన్నది ఆలోచించ లేకపోయింది. రెండేళ్ల క్రితం బావుండవచ్చు, కానీ ఇప్పుడా కాలేజీ చాలా దారుణంగా ఉందని మా పిల్లాడినే మార్పించి వేరే కాలేజీలో చేర్పించాను. అదీ చాలాదూరం. అయినా బాగా చెబుతున్నారని వాడే రెండు బస్సులు మారయినా సరే వెళ్లివస్తున్నాడు.
ఇంటర్లోనూ మంచి మార్కులతో పాస్‌ అయ్యాడు. అక్కడే డిగ్రీ చదువుతున్నాడు. ఇపుడు మనస్విని పరిస్థితికి నాకే దిగులు పట్టుకుంది. నేను అనుభవంతో చెప్పినా తాను వినలేదు. స్నేహం దెబ్బతింటుందని గట్టిగా చెప్పలేకపోయాను.
మనం పెద్దయ్యేకొద్దీ తాత్వికత, వ్యూహం, జీవితంలో బాధ్యతల సరిహద్దులతో కూడిన సమాజంలో ఎదగవలసి వస్తుంది. లక్ష్యాలు, కలలు సార్ధకం చేసుకోవాల్సి ఉంటుంది. మన దష్టికోణం అనేక అడ్డంకులకు గురవుతుంటుంది. అనేకానేక సమస్యలు, అవకాశాలు, లాభనష్టాలు, కష్టనష్టాలూ.. యావత్తూ చక్రవ్యూహంగా మారుతుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడేందుకు మానసిక పరివర్తన, నిర్ణయసామర్థ్యం, అనుభవాలసారమే నిచ్చెనగా తయారు చేసుకోవాలి. విజయం సాధించేందుకు ముందుతరాలు ఏర్పాటు చేసిన మార్గాలకు దూరంగా జరిగితే విఫలమైనట్టు సమాజం ముద్ర వేస్తుంది. అందుకే ఆచీతూచీ వ్యవహరించాలని అంటారు.
సహజంగా భౌతిక వాదం, జీవితంపట్ల అసంతప్తి మధ్య ఎంతో సంబంధం ఉందని మనస్తత్వవేత్తలు అంటుంటారు. ద్రవ్య వినియోగం, అవసరాలు, కొనుగోళ్లు, అనేక ఆకర్షణల మార్కెట్లు అన్నీ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. దీంతో ఆనందం, సంతోషాలు అనేవి వస్తూ పోతుంటాయి, పోతూ వస్తూవుంటాయి. మున్ముందు భౌతికాంశాలకంటే, అనుభవపాఠాలే జీవితసత్యాన్ని తెలిపి నిజమైన ఆనందానికి మార్గాలు వేస్తాయి. ఇది గ్రహించుకోవడం చాలా అవసరం అంటారు పెద్దలు.
ఒక వస్తువు కొన్నప్పుడు ఉండే ఆనందం కొన్ని రోజులు, కొన్నాళ్ల తర్వాత మరో మంచి వస్తువు మీద దష్టి పడడంతో పోతుంది. ఈ రకంగా అన్నింటా కొత్తదాని కోసం పాతది వదిలేసుకోవడం, కొత్త ఆనందాల కోసం పరుగులు తీయడం.. ఈ చక్రం నిజానికి ప్రమాదకరమే. అయినా తప్పడం లేదు. కొత్త పరిచయాలు, ప్రయాణాలు మంచి ఆలోచనలు ఎంతో మంచి జ్ఞాపకాలుగా ఎప్పటికీ ఆనందాన్నిస్తాయి.
వస్తువు తాత్కాలికం, అనుభవం, జ్ఞాపకాలు నిత్యనూతనం అంటారు. సైకిళ్ల మీద తిరిగేకాలం పోయి మోటార్‌ సైకిళ్లు, అనేక రకాల కార్లలో తిరిగే కాలంలో వున్నాం. కానీ ఆ కాలంలో ప్రశాంతత, వాతావరణం, స్నేహాలు ఇప్పటికీ తలుచుకుంటూ వుంటాం. ఆ మనుషులు, స్నేహాలు, అనుభవాలు ఇప్పటి ఏదో ఒక సందర్భంలో ఉపకరిస్తూనే వుండటం గమనించవచ్చు. వత్తి-వుద్యోగాలు, వ్యాపారాలు, లావాదేవీలు.. సమస్తం అంతే.
ఒక బ్యాగ్‌ కొన్నా, వాచ్‌ కొన్నా ఆలోచించి కొనాలి. చక్కగా రంగురంగులతో-కొత్త డిజైన్తో ఆకర్షణీయంగా ఉందని కొన్న వస్తువు చాలాకాలం మన్నుతుందన్న గ్యారంటీ ఇవ్వలేం. ఇది క్రమంగా ఆహార పదార్ధాలకీ వర్తిస్తుండటమే దురదష్టం. మనం బలమైన ఆహారం తింటున్నామన్నది ఒట్టి భ్రమే అవుతోంది. వ్యాపార ప్రకటనలు, ఎవరో చెప్పారనో ఆహారపు అలవాట్లు మార్చు కుంటున్నవారున్నారు. దీంతో పాటు కొత్త జీవన విధానానికి అలవాటుపడి అనేకానేక సందర్భాల్లో పొరపాటు చేస్తున్నామేమోనన్న ఆలోచనకు, ఆందోళనకు లోనవుతుంటాం.
బేరీజు వేసుకోవడానికి మనసు ఇష్టపడకపోయినా, చాలసందర్భాల్లో అనేక అంశాల్లో కొంత బేరీజు వేసుకోవడం మంచిదే. అక్కడే అనుభవ పాఠాలు వుపకరించేది. అనుభవం మేరకు చెప్పేవన్నీ వినక్కర్లేదనే సంస్కతిలో వుంటున్నాం. పెద్దవాళ్లు చెప్పినవన్నీ పాటించాల్సిన అవసరం లేదన్న ధోరణులు వచ్చాయి. అప్పటికాలం వేరు, ఇప్పటి పరిస్థితులు వేరంటూ సాధారణ విషయాల్లో కూడా అనుభవానికి తగిన ప్రాధాన్యతనీయక ఇబ్బందుల్లో పడటమో, కోరి కష్టాల్లో పడటమో జరుగుతోంది.
పిల్లల చదువు, వారి ఆశలు, ఆశయాల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు పెద్దలు, అనుభవజ్ఞుల మాట, సూచన, సలహాలు వినడం ఎంతో అవసరం. పరిస్థితులు మారుతున్నా, ఎదురయ్యే సమస్యల్ని అధిగమించి ఎంతో ప్రయోజకులుగా, మంచి విద్యార్ధిగా, మంచి ఉద్యోగిగా, పౌరునిగా అందరి మన్ననలూ అందుకోవాలంటే తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. పెద్దవారి మాట ఎంతో ఉపయోగపడుతుంది.
ఆలోచించి, నెమ్మదిగా వారు చెప్పినది అన్వయించుకుంటూ ఒక మంచి నిర్ణయానికి రావాలి. కాని పక్షంలో మరో ఆలోచన మరో మంచి ప్రత్యామ్నాయాన్ని అనుసరించడంలో తప్పులేదు. కానీ ముందే పెద్దవారిని తిరస్కరించడంలో అర్ధం లేదు. దురదష్టవశాత్తూ ఇప్పుడు అదే జరుగుతోంది. చదువు, సంస్కారం అడ్డువస్తోంది. చదువుతో వచ్చే జ్ఞానం మాట ఎలా వున్నా, నిర్లక్ష్యంతో కూడిన తెలివి ప్రదర్శిస్తున్నారు.
ఆనందం, సంతోషం కంటే క్రమంగా ఆందోళనకు గురవుతున్నవారు చాలా మందే ఉంటున్నారు. ఇందుకు కారణం కొన్ని కీలకాంశాల్లో, సందర్భాల్లో వెన్నుదన్నుగా నిలిచే, మాటసాయం చేయగల పెద్దలు దగ్గర లేక పోవడమేనని అనాలి. అనుభవసారంతో వారిచ్చే సూచనలు, సలహాలు చద్ది ముద్దల్లాంటివన్నది గ్రహిస్తే మంచిది. స్కూలు స్థాయిలో టీచర్లు, స్నేహితులు, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం, ఉన్నత ఆలోచనలతో మెలగడం అన్నీ మంచి వ్యక్తిగా రూపొందడానికి ఉపకరించాలి. బాల్యంలో విద్యను, యువతలో బాధ్యతాయుత ప్రవర్తను నిర్లక్ష్యం చేస్తున్న దాఖలాలు ఎన్నో. ఈ పరిస్థితులను రాబోయే తరం అధిగమించాలి. అందుకు పాఠశాల స్థాయిలోనే వారిని మంచి విద్యార్థులను చేయడానికి టీచర్లు, తల్లిదండ్రులు పూనుకోవడం ఎంతో అవసరం.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -