సత్యం, అహింసతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడిస్తాం
ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్రం, ఈసీ : ‘ఓటు చోర్ గద్ది ఛోడ్’ మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ
మోడీ సర్కార్‌ను అధికారం నుంచి తొలగించాలి : ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”మేం ‘సత్యం’తో నిలబడతాం. మోడీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తాం. అధికారం కోసం వారు ‘ఓటు చోరీ’లో మునిగిపోయారు.” అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తమకు ప్రజాస్వామిక సిద్ధాంతాలపై నమ్మకం ఉందని, సత్యం గెలవడానికి సమయం పట్టినా, అంతిమ విజయం మాత్రం సత్యానిదేనని అన్నారు. తాము సత్యాహింసలతో పనిచే స్తామని చెప్పారు. ఆదివారంనాడిక్కడ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఓటు చోర్ గద్ది ఛోడ్’ మెగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ కోసం పని చేస్తోందని విమర్శించారు.
మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సత్యం, అహింసతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావించి వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈసీ అనేది దేశం కోసమని, మోడీకి పరిమితం కాదని, ఈ విషయం గుర్తించాలని సూచించారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఓటర్లకు రూ.10,000 బదిలీ చేసినా, ఈసీ వారిపై ఎటువంటి చర్యా తీసుకోలేదన్నారు. ఎన్నికల సంఘానికి ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధాని మోడీ కొత్త చట్టాన్ని తెచ్చారని, భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి, అవసరమైతే ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ శాంతియుత, ప్రజాస్వామ పంథాలోనే పోరాటం సాగిస్తుందన్నారు. ప్రపంచం సత్యం వైపు చూడదని, అధికారం వైపు చూస్తుందని, అధికారం ఉన్నవాడినే గౌరవిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెబుతున్నారని రాహుల్ విమర్శించారు. ఇది మోహన్ భగవత్ ఆలోచన అని, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి మతం సత్యమే ప్రధానమని చెబుతుందన్నారు. సత్యానికి అర్థమే లేదని, అధికారమే కీలకమని మోహన్ భగవత్ అంటున్నారని విమర్శించారు. ‘సత్యాన్ని ఆచరిస్తూ, సత్యానికి అంటిపెట్టుకుని ఉంటే మోడీని, అమిత్ షాను, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇండియా నుంచి తొలగించవచ్చని ఈ సభా వేదిక నుంచి తెలియజేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
అధికారం నుంచి తొలగించాలి: ఖర్గే
‘ఓటు చోరీ’ చేసేవారు ‘ద్రోహులు’ అని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడటానికి వారిని అధికారం నుంచి తొలగించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ భావజాలాన్ని ఐక్యంగా బలోపేతం చేయడం భారతీయులందరి కర్తవ్యమని, పార్టీ మాత్రమే దేశాన్ని రక్షించగలదని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశాన్ని అంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. ”బీజేపీ వాళ్లు గద్దార్ (ద్రోహులు). ఆ పార్టీ నాయకులు నాటకాలాడుతున్నారు. ‘పార్లమెంటు సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నారా?’ అని కొంతమంది బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రధాని మోడీ ఎప్పుడూ సమావేశాలకు హాజరుకారు. విదేశాలకు వెళతారు. ఓటు చోరీ చేసిన తర్వాత వారందరూ అధికారంలో కూర్చున్నారు. ఈ ద్రోహులను అధికారం నుంచి తొలగించాల్సి ఉంది” అని ఆయన అన్నారు.
దేశంలో నిష్పాక్షిక ఎన్నికలు జరగడం లేదు : ప్రియాంక
దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం లేదని, ప్రక్రియ ప్రతి దశను ఇప్పుడు అనుమానం చుట్టుముట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల ఓటు హక్కును హరించడానికి వారు ఎలా ‘కుట్ర’ చేశారో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య నిబంధనలను క్రమబద్ధంగా క్షీణింపజేస్తున్నారని ఆరోపించారు. ”మన స్వరం ప్రధానమంత్రి నివాసానికి చేరుకోవాలి. మీ ఓటు సమాజ మార్పులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అర్థం చేసుకోవడం చాలా ఆవశ్యం. రాజ్యాంగం మీకు ఓటు హక్కును ఇచ్చింది” అని ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని రాజ్యాంగ సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో జరిగిన ఉల్లంఘనలను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో రూ. 10,000 చెల్లించడం ‘ఓటు చోరీ’ కాదా?’ అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా బీహార్‌లో ఎన్నికల పరాజయాలతో నిరాశ చెందవద్దని పార్టీ కార్యకర్తలను కోరారు. న్యాయమైన ఎన్నికల్లో పోరాడాలని నేను వారిని (బీజేపీ) సవాలు చేస్తున్నానన్నారు. ప్రధాని మోడీ ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోయారని, తప్పు చేశారు కాబట్టే పార్లమెంటులో తాము మాట్లాడుతుంటే చూడలేకపోతున్నారని విమర్శించారు. ఓట్ల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము పోరాడుతామని ఈ సందర్భంగా ప్రియాంక అన్నారు.
మోడీ, అమిత్ షాది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అందుకే సర్‌ను తెరపైకి తెచ్చారు ఇప్పుడు ఓటు, ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డు : సీఎం రేవంత్ రెడ్డి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో తొలుత ఓటు, ఆ తరువాత ఆధార్, రేషన్ కార్డు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తొలగిస్తుందని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ”రాజ్యాంగ రచన సమయంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలకు ఓటు హక్కు విషయమై చర్చిస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, గోల్వాల్కర్ ఈ వర్గాలకు ఓటు హక్కు ఇవ్వొద్దన్నారు. కానీ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు” అని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, తర్వాత సర్ పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారని విమర్శించారు. ఈ సమస్య ఎన్నికలదో.. కాంగ్రెస్ పార్టీదో కాదని, దేశానిదన్నారు. ఇందుకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ బీజేపీ ఓట్ల దొంగతనం చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓట్ల శక్తిని బలహీనపరుస్తోందని విమర్శించారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడి హక్కును కాపాడటానికి ”ఓటు చోరీ”కి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం సంస్థలను ఖాళీ చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా పనిచేసేలా, దేశ ప్రజాస్వామ్యం ఆదర్శప్రాయంగా ఉండేలా చూసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా, లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోరు, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



