నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికలకు ఈసీ షెడ్యుల్ విడుదల
పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలు
మిగిలిన రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్
ఆరు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఉప ఎన్నిక
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు, కేరళం పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందని సీఈసీ తెలిపింది.
అసోం, కేరళం, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక పశ్చిమబెంగాల్ లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 23న, రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనుంది. మే 4న నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. అలాగే అదే రోజు ఆరు రాష్ట్రాల్లో ఎనిమిది స్థానాలకు జరిగే ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెల్లడిస్తారు.
ముగియనున్న అసెంబ్లీల పదవీకాలం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం 2026 మే 7తో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం 2026 మే 10తో ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ పదివీకాలం 2026 మే 15తో ముగియనుంది. అసోం అసెంబ్లీ పదవీ కాలం 2026 మే 20తో ముగియనుంది. కేరళం అసెంబ్లీ పదవీకాలం 2026 మే 23తో ముగియనుంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను కూడా ఈసీ పూర్తి చేసింది. క్షేత్ర స్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం 2.19 కోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ విధుల్లో మొత్తం 25 లక్షల మంది అధికారులు పాల్గొననున్నారు.
ఆరు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. పోండా (గోవా), ఉమ్రేత్ (గుజరాత్), బాగల్ కోట్, దావణగెరె సౌత్ (కర్నాటక), రాహురి, బారామతి (మహారాష్ట్ర), కొరిడాంగ్ (నాగాలాండ్), ధర్మనగర్ (త్రిపుర) నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో కర్నాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు ఒక విడతలోనూ, గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు ఒక విడతలోనూ ఎన్నిక జరగనుంది.
కర్నాటక, నాగాలాండ్, త్రిపురలో నాలుగు స్థానాలకు షెడ్యూల్
గెజిట్ నోటిఫికేషన్ విడుదల: మార్చి 16 (సోమవారం)
నామినేషన్ల దాఖలు గడువు: మార్చి 23 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన: మార్చి 24 (మంగళవారం)
నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 26 (గురువారం)
పోలింగ్: ఏప్రిల్ 9 (గురువారం)
ఓట్ల లెక్కింపు: మే 4 (సోమవారం)
గుజరాత్, మహారాష్ట్ర, గోవాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్
గెజిట్ నోటిఫికేషన్ విడుదల : మార్చి 30 (సోమవారం)
నామినేషన్ల దాఖలు గడువు: ఏప్రిల్ 6 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7 (మంగళవారం)
నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 9 (గురువారం)
పోలింగ్: ఏప్రిల్ 23 (గురువారం)
ఓట్ల లెక్కింపు: మే 4 (సోమవారం)




