Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంమోగిన ఉపరాష్ట్ర్రపతి ఎన్నిక నగారా

మోగిన ఉపరాష్ట్ర్రపతి ఎన్నిక నగారా

- Advertisement -

– ఆగస్టు 7న నోటిఫికేషన్‌ జారీ
– సెప్టెంబర్‌ 9న పోలింగ్‌, కౌంటింగ్‌
– ఈసీ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఉపరాష్ట్రపతి ఎన్నిక నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌, కౌంటింగ్‌ ఉండనున్నట్టు తెలిపింది. ఆగస్టు 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కానున్నట్టు స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21ని ఎన్నికల సంఘం ఖరారు చేసింది. స్వీకరించిన నామినేషన్ల పరిశీలన 22న జరగనుంది. ఆగస్టు 25లోపు నామినేషన్ల ను ఉపసంహరించుకో వచ్చని పేర్కొంది. సెప్టెంబర్‌ 9న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎన్నిక, ఆ తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. జులై 22న జగదీప్‌ ధన్కర్‌ అనూహ్యంగా ఉపరాష్ట్ర పతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఆరోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా అందజేశారు. ఇందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఉపరాష్ట్రపతి రేసులో ఎవరెవరు?
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేయడంతో దేశంలో రెండో అత్యున్నత స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు జేడీయూ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. అదే విధంగా ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరు కూడా రేసులోకి వచ్చింది. దీంతో ఈ పదవి చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

ఓటర్లు వీరే
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 66 ప్రకారం 233 మంది రాజ్యసభ సభ్యులు (ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), 12 మంది రాజ్య సభ నామినేటేడ్‌ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) మొత్తం 788 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. కానీ ఆరు ఖాళీలతో ప్రస్తుతం 782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -