Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్ల కోసమే విద్యుత్‌ సవరణ చట్టం

కార్పొరేట్ల కోసమే విద్యుత్‌ సవరణ చట్టం

- Advertisement -

స్మార్ట్‌మీటర్లతో రైతన్నలపై తీవ్ర భారం
కరెంటు బిల్లులు పెరిగే ప్రమాదం
కార్పొరేట్ల లాభాలు పెంచేందుకే విత్తన చట్టం
మోడీ ప్రభుత్వ విధానాలను పోరాటాలతోనే వెనక్కి కొట్టగలం
12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజ్జూ కృష్ణన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ను ప్రయివేటుపరం చేసి కార్పొరేట్లకు అప్పగించేందుకే మోడీ సర్కారు విద్యుత్‌ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజ్జూ కృష్ణన్‌ ఎత్తిచూపారు. స్మార్ట్‌మీటర్లతో రైతన్నలపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, వేలాది రూపాయల కరెంటు బిల్లులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. యూపీలో ఒక రైతుకు రూ.50 వేల బిల్లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కార్పొరేట్ల లాభాలు పెంచేందుకే విత్తన చట్టాన్ని తీసుకొస్తున్నదనీ, కార్మికుల హక్కులను కాలరాసేలా లేబర్‌కోడ్‌లు ఉన్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఇలాంటి విధానాలపై పోరాటాలే మార్గమని ప్రకటించారు.

రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్‌ శోభన్‌, లెల్లెల బాలకృష్ణ పాల్గొన్నారు. సమావేశంలో విజ్జూ కృష్ణన్‌ మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయనీ, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్రలోని పాల్‌ఘాట్‌ జిల్లాలో చెరోటి నుంచి ఆ జిల్లా కలెక్టరేట్‌ వరకు 55 కిలో మీటర్లు వేలాది మంది రైతులు, గిరిజనులు, మహిళలు ప్రదర్శనగా వెళ్లారనీ, నాసిక్‌ నుంచి ముంబై వరకు లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమైందని తెలిపారు.

పాల్‌ఘాట్‌ ప్రదర్శన ద్వారా కొన్ని హక్కులు సాధించుకోగలిగామన్నారు. 2014 నుంచి 2026 వరకు దాదాపు ఐదు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు మనదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే వీబీజీఆర్‌ఏఎమ్‌జీని కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు. ఇందులో 40 శాతం నిధులను ఖర్చుచేస్తే కేంద్రం మిగతా నిధులను విడుదల చేస్తుందని మెలికపెట్టి కూర్చోవడమంటే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందనీ, ఆ నిధులను ఎక్కడ నుంచి సమకూర్చుకుంటాయని ప్రశ్నించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారన్నారు. విత్తన చట్టాన్ని తీసుకొచ్చి కార్పొరేట్‌ కంపెనీలకు ఇంకా లాభాలను పెంచడానికి ఒక వ్యవస్థను సృష్టిస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలనీ, రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -