Thursday, July 3, 2025
E-PAPER
Homeజాతీయంఇఎల్‌ఐ పథకాన్ని రద్దు చేయాలి

ఇఎల్‌ఐ పథకాన్ని రద్దు చేయాలి

- Advertisement -

సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ :
ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల (ఇఎల్‌ఐ) పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. బడా కార్పొరేట్‌ సంస్థలకు డబ్బును బదిలీ చేసేందుకే ఈ పథకం ఉద్దేశించబడిందని విమర్శించింది. కార్మికులను పణంగా పెట్టి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన మరో ప్రయత్నమే ఇదని పేర్కొంది, ప్రభుత్వ ఆశ్రిత పక్షపాతానికి ఇది మరో ఉదాహరణ అని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. యువతను మోసం చేసేందుకు ఉద్యోగ అవకాశాల కల్పన, ఉపాధి పొందే సామర్ధ్యాలను పెంపొందించడం, సామాజిక భద్రత కల్పించడం వంటి హామీల ముసుగులో కార్పొరేట్లకు ప్రభుత్వ నిధులను బదిలీ చేసేందుకు ఉద్దేశించిన మరో మోసపూరిత పథకమే ఇఎల్‌ఐ పథకం. ఈ పథకం అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ఉపాధులను ప్రోత్సహిస్తోంది. పైగా పెట్టుబడుల వ్యయానికి, ఉత్పత్తి వ్యయాలకు, కార్మిక ఖర్చులకు దేశీయ, విదేశీ యజమానుల చట్టబద్ధమైన రుణాలకు ప్రభుత్వ కోశాగారం నుంచి సబ్సిడీ మొత్తాలను పొందడమే ఈ పథకం లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు లబ్ది చేకూర్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కు కేటాయింపులను బీజేపీ ప్రభుత్వం తగ్గిస్తోంది. పట్టణ ప్రాంతాలకు కూడా ఇటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.

అదే సమయంలో, కార్పొరేట్లకు మాత్రం ప్రోత్సాహకాల పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు అందచేస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. పెద్ద సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయడం ద్వారా కనీస వేతనాలు, ఉపాధి భద్రత, సామాజిక భద్రతలతో మంచి ఉపాధికి హామీ కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అలాగే కార్పొరేట్‌ వర్గానికి సబ్సిడీలు ఇవ్వడానికి బదులుగా తగిన మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా ఆరోగ్యం, విద్య, ప్రజా రవాణా, తదితర ప్రజా సేవలను విస్తరించాలని కోరింది. తక్షణమే ఇఎల్‌ఐ పథకాన్ని రద్దుచేయాలని, కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.


సీఐటీయూ ఖండన
ఇఎల్‌ఐని ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. గతంలో ఉపాధి కల్పన పేరుతో తీసుకువచ్చిన రూ.1.97లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ), రూ.76వేల కోట్ల మూల ధన వ్యయ ప్రోత్సాహక పథకం (కేపెక్స్‌ ఇన్సెంటివ్‌)ల బాటలోనే తాజా పథకాన్ని కూడా తీసుకువచ్చారని విమర్శించింది. తయారీ రంగంలో 14 పరిశ్రమలకు ఉద్దేశించి 2020లో పీఎల్‌ఐ పథకాన్ని తీసుకువచ్చారని, కానీ తర్వాత దాన్ని 17పరిశ్రమలకు విస్తరించారని, 60లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్నది లక్ష్యమని చెప్పారని, కానీ వాస్తవానికి కనీసం 7లక్షల ఉద్యోగాలు కూడా కొత్తగా రాలేదని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇలాంటి మోసపూరిత పథకాలను తిరస్కరిస్తూ యావత్‌ కార్మిక వర్గం జులై 9నాటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -