Sunday, May 4, 2025
Homeజాతీయంఉద్యోగికి పదోన్నతి పొందే హక్కు లేదు

ఉద్యోగికి పదోన్నతి పొందే హక్కు లేదు

- Advertisement -

– కానీ పరిశీలన జరపాల్సిందే
– స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : పదోన్నతి పొందే హక్కు ఉద్యోగికి ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అనర్హత వేటు పడకుంటే ఆ ఉద్యోగికి పదోన్నతి కల్పించే విషయాన్ని పరిశీలించాల్సిందేనని తెలిపింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా తనకు పదోన్నతి కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు అధికారులు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ తమిళనాడుకు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సుధాన్షు ధూలియా, కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ విచారిస్తోంది.
‘ఉద్యోగికి పదోన్నతి పొందే హక్కు లేదు. అయితే అనర్హుడిగా ప్రకటిస్తే తప్ప పదోన్నతుల కోసం ఎంపికలు జరిపేటప్పుడు అతని పేరును పరిగణనలోకి తీసుకోవాల్సిందే. కానీ ఈ కేసులో ఆ హక్కుకు భంగం వాటిల్లింది’ అని సుప్రీంకోర్టు బెంచ్‌ తెలిపింది. చెక్‌పోస్టు వద్ద విధినిర్వహణలో ఉన్నప్పుడు ఆ కానిస్టేబుల్‌ సహోద్యోగిని కొట్టాడు. దీంతో అతను శాఖాపరమైన, క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రిమినల్‌ కేసులో అతను అరెస్టయ్యాడు. కానీ ఆ తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. శాఖాపరమైన చర్యల కారణంగా పడిన శిక్ష అమలును ప్రభుత్వం 2009లో నిలిపివేసింది. కాగా శిక్ష (ఇంక్రిమెంట్‌ నిలిపివేత) అమలును ఓ సంవత్సరం పాటు వాయిదా వేసిన కారణంగానే కానిస్టేబుల్‌ పదోన్నతిని పరిగణనలోకి తీసుకోలేదని పోలీస్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.
అయితే 2009 నవంబరులో శిక్షను ప్రభుత్వం రద్దు చేసిందని, అలాంటప్పుడు 2019లో జరిగిన పదోన్నతుల ఎంపికల నుంచి కానిస్టేబుల్‌ను మినహాయించడం సబబు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అర్హత ఉంటే కానిస్టేబుల్‌ పదోన్నతిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పదోన్నతికి అర్హత ఉన్నట్లయితే అతను 2019 నుండే దానిని పొందినట్లుగా భావించాలని, ఫలితంగా అతనికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కూడా అందించాల్సి ఉంటుందని తెలిపింది. రద్దు చేసిన శిక్ష ఆధారంగా పదోన్నతి కోల్పోవడం కానిస్టేబుల్‌ తప్పు కాదని చెప్పింది. అయితే తనను ఇన్‌ సర్వీస్‌ అభ్యర్థిగా పరిగణించి పదోన్నతిని పరిశీలించాలన్న అతని అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -