తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం…ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
మద్దతు తెలిపిన సీపీఐ
బీజేపీ సైలెంట్
సభలో లేని బీఆర్‌ఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం 2006 నాటి ఉపాధి హామీ చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ చట్టం స్థానంలో కేంద్రం తెచ్చిన వీబీ జీ రామ్ జీని రద్దు చేయాలని కోరింది. అలాగే ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని శాసనసభ తప్పుపట్టింది. కేంద్రం తక్షణం ఇలాంటి ఏకపక్ష నిర్ణయా లను ఉపసంహరించుకోవాలని శాసనసభ హితవు పలికింది. అసెంబ్లీలో సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఉపాధి హామీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రాధాన్యతను సుదీర్ఘంగా వివరించారు. దీనికి సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మద్దతు తెలిపారు. తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, ఆమోదం పొందే సమయంలో బీజేపీ సభ్యులు శాసనసభలోనే మౌనంగా ఉన్నారు. ఆపార్టీకి చెందిన సభ్యులు ప్రధాని మోడీపై చేసిన విమర్శలు మాత్రమే ఖండించారు. బీఆర్‌ఎస్ సభ్యులు అంతకుముందే శాసనసభా సమావేశాల్ని బహిష్కరిం చిన విషయం తెలిసిందే.
ఉపాధి చట్టం తీర్మానానికి ఆమోదం కోసం స్పీకర్ ప్రకటన చేసే సమయంలో సభలోనే ఉన్న బీజేపీ సభ్యులు సైలెంట్‌గా ఉన్నారు. దీనితో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ తీర్మానాన్ని శనివారం శాసనమండలి లో మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2006 ఫిబ్రవరి 2న చట్టం అమల్లోకి వచ్చిందని, మొదట ఉమ్మడి ఏపీలోని అనంతపురం, మహబూబ్ నగర్‌లో దీన్ని అమలు చేశారని ఆయన తెలిపారు. ఈ చట్టం రావటానికి మెదక్ స్ఫూర్తి అని చెప్పారు.
పాలమూరు లాంటి జిల్లాల నుంచి వలసలను ఇది నివారించిందని, పేదలకు ఆర్థిక భరోసానిచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామికవర్గాల దోపిడీ, స్త్రీ, పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి, అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతీ గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనమందించే గ్యారెంటీ ఈ చట్టం ప్రధాన లక్ష్యం.
గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ది పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్దిపొందారు. దళితులు, గిరిజనులు, వికలాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువ ప్రయోజనం పొందారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం వీబీజీ రామ్‌జీ-2025 పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీనవర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి.” అని సీఎం తీర్మానంలో వివరించారు.
తీర్మానంలోని అంశాలివే
1) కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశాన్ని ఇది దెబ్బతీస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా పనుల ప్రణాళికలను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.
2) కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న నరేగాలో దాదాపు 62 శాతం మంది మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానాన్ని పునరుద్ధరించాలి.
3) ప్రస్తుత హామీ పథకంలో కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా 60 : 40గా మార్చటం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత నిధుల వాటా నమూనాను పునరుద్ధరించాలి.
4) మహాత్మాగాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో ఆయన స్ఫూర్తిని నీరుగార్చినట్టయింది.
5) వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించటంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడువునా కొనసాగించాలి.
6) ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులను చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించటంతో చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యధాతథంగా అనుమతించాలి.
7) ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నరేగా చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కూలి కుటుంబాల ఆకాంక్షను నెరవేర్చేందుకు మహాత్మా గాంధీ నరేగా చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలి.



