– ఇంజినీరింగ్ టాప్ టెన్‌లోనూ వారే
– ఏపీకి చెందిన పల్లా భరత్ చంద్ర టాపర్
– అగ్రికల్చర్, ఫార్మసీ టాప్‌టెన్‌లో ఒక్కరే అమ్మాయి
– మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డి ప్రథమం
– ఇంజినీరింగ్‌లో 73.26 శాతం, అగ్రికల్చర్‌లో 87.82 శాతం అర్హత
– ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎప్‌సెట్ (ఎంసెట్) రాతపరీక్షల ఫలితాలను ఆదివారం ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అబ్బాయిలే టాప్ ర్యాంకులను సాధించారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఇంజినీరింగ్ విభాగంలో పది మంది అబ్బాయిలే ఉండడం గమనార్హం. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో తొమ్మిది మంది అబ్బాయిలుంటే, ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగం టాప్ టెన్ ర్యాంకర్లలో ముగ్గురు ఏపీ విద్యార్థులున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్ పది ర్యాంకుల్లో అందరూ తెలంగాణ విద్యార్థులే ఉండడం గమనార్హం. ఇంజినీరింగ్ విభాగంలో 150.058429 మార్కులతో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన పల్లా భరత్ చంద్ర మొదటి ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 141.688297 మార్కులతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన సాకేత్‌రెడ్డి పెద్దక్కగారి ప్రథమ ర్యాంకును పొందారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,20,326 మంది దరఖాస్తు చేస్తే, 2,07,190 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వారిలో 1,51,779 (73.26 శాతం) మంది అర్హత సాధించారు. ఇందులో 94,109 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 88,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 65,120 (73.88 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 1,26,217 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 1,19,051 మంది పరీక్ష రాశారు. వారిలో 86,659 (72.79 శాతం) మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు 1.09 శాతం మంది అధికంగా ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 86,762 మంది దరఖాస్తు చేయగా, 81,198 మంది పరీక్ష రాశారు. వారిలో 71,309 (87.82 శాతం) మంది అర్హత పొందారు. ఇందులో 65,469 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 61,331 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 54,166 (88.32 శాతం) మంది అర్హత సాధించారు. 21,293 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 19,867 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 17,143 (86.29 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.03 శాతం మంది అధికంగా అర్హత పొందారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మెన్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ టి కిషన్ కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు, ఎప్‌సెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, కోకన్వీనర్ విజరుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు కాదు : బాలకిష్టారెడ్డి
ఏపీ విద్యార్థులు తెలంగాణలో ప్రవేశాలకు అర్హులు కాదని ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలో ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించిన ఇక్కడ సీట్లు పొందలేరని వివరించారు. ఏపీ విద్యార్థులకు ర్యాంకు వచ్చినంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పదేండ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నందున గత విద్యాసంవత్సరం వరకు ఏపీ విద్యార్థులకు కూడా సీట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా లేదనీ, దీంతో ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిం చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నేడే ఈసెట్ : నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు నో ఎంట్రీ
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ రాతపరీక్ష సోమవారం ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ పరిధిలో 46, ఇతర జిల్లాల్లో 40 కలిపి మొత్తం 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్‌కు 19,672 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం 7.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉదయం తొమ్మిది గంటల వరకే అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోరు. బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. క్యాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్/లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచ్‌లు, పెద్ద కళ్లద్దాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఇతర పేపర్లకు అనుమతి ఉండదు.
రేపు పాలిసెట్
– 1,06,716 మంది దరఖాస్తు
– 276 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2025 రాతపరీక్ష మంగళవారం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్షను రాష్ట్రంలోని 276 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎంపీసీ నుంచి 64,295 మంది, బైపీసీ నుంచి 42,421 మంది కలిపి 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. విద్యార్థులను గంట ముందునుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తప్పకుండా తీసుకుని రావాలని సూచించారు. హాల్‌టికెట్ మీద ఫొటో ముద్రించని వారు పాస్‌పోర్టు సైజ్ ఫొటోతోపాటు ఆధార్ కార్డు (గుర్తింపు కార్డు) వెంట తెచ్చుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని పేర్కొన్నారు.


