Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమానత్వ నిబంధనలు తక్షణమే అమలు చేయాలి

సమానత్వ నిబంధనలు తక్షణమే అమలు చేయాలి

- Advertisement -

విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలతో క్యాంపస్‌లలో పెరుగుతున్న దాడులు : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య

నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో యూజీసీ సమానత్వ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో పెరుగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజినీకాంత్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష తీవ్రరూపం దాల్చిందన్నారు. దీనివల్ల విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతూ చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజికంగా అణగారిన వర్గాలు ఎన్నో ఏండ్లుగా చేసిన పోరాట ఫలితంగా వచ్చిన ‘యూజీసీ సమానత్వ ప్రోత్సాహక నిబంధనల’ను కేంద్రం అమలు చేయడం లేదని, కుల వివక్షను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యూజీసీ నివేదిక ప్రకారం క్యాంపస్‌లలో కుల వివక్ష ఫిర్యాదులు 118 శాతం పెరిగాయని, ఈ వివక్ష భయంతో దాదాపు ఆరు శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల మరణం కుల వివక్షకు నిదర్శనమని, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ‘రోహిత్‌ వేముల చట్టాన్ని’ పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నూతన విద్యా విధానంపై విమర్శలు..
కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ-2020) అమలులోకి వచ్చి అయిదేండ్లు అయిందని, దానివల్ల సంఫ్‌ు పరివార్‌ అరాచకాలు పెరిగాయన్నారు. టీస్‌లో దళిత పరిశోధకుడిపై దాడి జరగడం, విద్యా సంస్థల్లో దాడులు పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో ‘హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ (హెచ్‌ఈసీఐ) బిల్లు అమలైతే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మరింత వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రం మనువాద సిద్ధాంతాలను రుద్దుతూ, వీబీసీఏ వంటి బిల్లుల ద్వారా సమాజాన్ని కులాల వారీగా విడదీస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉపాధ్యక్షులు ఎండీ.అతీక్‌, మమత, డి.కిరణ్‌, బి.శంకర్‌, అశోక్‌ రెడ్డి, సహాయ కార్యదర్శులు జి.శ్రీకాంత్‌, ఆర్‌.ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -