హైదరాబాదు జంట నగరాలలోని సినిమా టాకీసులది చాలా ఆసక్తికరమైన చరిత్ర. ఇక్కడ 18వ శతాబ్ద ప్రారంభంలో గుల్జార్ హౌజ్, కష్ణా మైదానం, పుత్లీబౌలీ ప్రాంతాలలోని మైదానాలు నాటి రెసిడెన్సీ మార్కెట్‌కు చేరువలో ఉండేవి. ఈ మైదానాలలోనే మూన్ పారసీ థియేటర్స్, కిర్లోస్కర్ నాటక కంపెనీ, ఆల్ఫ్రెడ్ థియేటర్ కంపెనీలు తమ నాటకాలను ప్రదర్శించేవి. ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా ఈ నాటకాలు ఆడినా వాటికంత ప్రాముఖ్యత రాలేదు. కష్ణా మైదానంలోనే ఆ తర్వాత పాత నగరంలో కష్ణా టాకీస్ రూపుదిద్దుకుంది. 1920ల చివరికి వచ్చేసరికి హైదరాబాదులో నాలుగు సినిమా థియేటర్లు ఏర్పడినవి. అవి జమ్రుద్ మహల్, ది ఎక్స్రేషియర్, ది ప్రేమ్, వివేకవర్ధిని. వీటిల్లో మూకీల ప్రదర్శనలు జరిగినవి. అయితే సినిమాల ప్రదర్శనకు 1920ల్లో పుత్లీ బౌలిలో (నేటి వివేకవర్ధిని కాలేజీ ప్రాంతం) ‘నిషాత్’ అనే ‘డేరా హాల్’ ఉండేది. ఇదే హైదరాబాదీలకు తొలి సినిమా థియేటరు. దీన్ని ఆర్.ఎం.మోడీ సోదరులు నడిపేవారు. దీని తర్వాత దీవాన్, దోది, దక్కన్, రాయల్ పేరున టెంట్ హాల్స్ ఏర్పడినవి.
అయితే హైదరాబాదులో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మాణానికి పూనుకున్నవి సాక్షాత్తూ నిజాం నవాబే. నవాబ్ సాలార్ జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ దివాన్ దేవిడీ ప్యాలేస్ ప్రాంగణంలో 1920లో ”సెలెక్ట్ టాకీస్’ను ఏర్పాటు చేశారు. దీనినే ఆ తర్వాత ‘స్టేట్ టాకీస్’ అని, ఎస్టేట్ కూడా పిలిచేవారు. ఇది నిజాం కుటుంబ సభ్యుల కోసమే ఉద్దేశించబడిన థియేటర్, ఈ టాకీసులో లండన్ నుండి దిగుమతి చేసుకున్న 16 ఎం.ఎం. ప్రొజెక్టర్ ను అమర్చారు. ఇది ఆ తరువాత ఎస్టేట్ టాకీస్ పేరు మార్చుకున్నది. దాంతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పు జరిగింది 1939లో. 1920లోనే అలనాటి అవిభాజ్య హైదరాబాదు స్టేట్లోని బీడ్ జిల్లా కేంద్రంలో ఎం.డి. సర్దార్ ఖాన్ ”దక్కన్ టాకీస్” పేరుతో పర్మినెంట్ థియేటర్ను నిర్మించారు. (హైదరాబాదు స్టాటిస్టికల్ ఇయర్ బుక్-1940) పై రెండు చారిత్రక ఆధారాలు ఆంధ్ర ప్రాంతంలో తొలి టాకీస్ గా చెప్పుకునే విజయవాడ ”మారుతీ టాకీస్” (అక్టోబర్ 1921) కన్నా ముందుగానే హైదరాబాదు స్టేట్ లో థియేటర్లు ఉన్నట్లు రూఢ అవుతున్నది.
అయితే వీటితోబాటు మూకీల కాలంలో 1922 తరువాత లోటస్ థియేటర్ బాగా పాపులర్ అయింది. వీటి యజమాని ధీరేన్ గంగూలి అని చాలామంది రాస్తుండగా పసుపులేటి కమలాకర్ మాత్రం దాని యజమాని జె.ఎఫ్. మదన్, అని రాస్తున్నారు. అబిడ్స్ నుండి గన్ ఫౌండ్రీ వెళ్ళే దారిలో ఉన్న ఈ లోటస్ టాకీస్ మొదట 30మంది ప్రేక్షకులు
కూర్చునే ఏర్పాటుతో ఉండేది. 1924లో ధీరేన్ గంగూలీ ‘రజియా బేగం’ సైలెంట్ సినిమాని ప్రదర్శించి నిజాం ఆగ్రహానికి గురై హైదరాబాదు నగరాన్ని విడచి వెళ్ళవలసి రావడంతో ఈ థియేటర్ కొంతకాలం మూతపడింది. ఆ తరువాత 1930లో 50మంది సీటింగ్ కెపాసిటీతో ‘లైట్ హౌజ్’ పేరుతో మళ్ళీ ప్రారంభమైంది.1980 దశకాంతం వరకు నడచిన ఈ సినిమా టాకీస్ ఆనవాళ్లు నేటికీ మనకు కనిపిస్తాయి.
1931లో టాకీలు వచ్చే నాటికి హైదరాబాదులో నాలుగైదు థియేటర్లు మాత్రం ఉండేవని కొందరంటారు. కాని 1930 నాటికి హైదరాబాదులోని టాకీసుల సంఖ్య 17 అని మరొక సమాచారం. అయితే 1940 నాటి నిజాం స్టేట్ స్టాటిస్టికల్ రికార్డుల ప్రకారం మూకీల కాలంలో హైదరాబాదులో రాయల్ టాకీస్ (1927), దీనికి మునుపే అబిడ్స్ లో ప్రేమ్, సాగర్ టాకీసులు నిర్మాణమైనట్లుగా చెబుతారు. వీటిలో సాగర్ టాకీసును 1925 సెప్టెంబర్ లో రాజా బిర్బన్ గిర్జి దీనిని నిర్మించారు. (కాదు ”జమ్రూద్ మహల్ థియేటర్’ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు) ఇందులో దేశ విదేశాల మూకీలను ప్రదర్శించేవారు. నిషాత్ థియేటర్ లో మొదటి, రెండవ షోలు మాత్రమే వేసేవారు. ఇవేగాక తొలినాటి మూకీ సినీతారలు సితారాదేవి, లీలాదేశారు వంటి వారి నత్య ప్రదర్శనలు జరిగేవి. ఇంకా ఇందులో పథ్వీరాజ్ కపూర్ తన నాటక బందంతో వచ్చి పఠాన్, దీవార్ వంటి నాటకాలను ప్రదర్శించే వారు కూడా. 1926లో సికిందరాబాదులో రాజన్న గౌడ్ ‘రాజేశ్వర్’ టాకీస్ను నిర్మించగా 80 ఏళ్లకు పైగా నడిచి ఐదేళ్ళ క్రితం మూతపడింది.
హైదరాబాదులో 1930లో నిర్మించిన మరో థియేటర్ ‘యాకూత్ మహల్’. 95 యేండ్లుగా ఏనాడూ ఆగకుండా సినిమాలు ప్రదర్శిస్తున్న సినిమా టాకీస్ ఇది. దీనిలో 1927లో తయారై చికాగో నుండి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక ప్రొజెక్టర్లు అమర్చడం ఆరోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఇంకా ఈ థియేటర్లో మహిళా ప్రేక్షకులకు విడిగా సీట్లుండటమే గాక పురుష ప్రేక్షకులను విభజిస్తూ మధ్యలో పరదా కూడా ఉండేది. ప్రధానంగా నేటికీ ఈ టాకీస్ లో హిందీ సినిమాలు ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాదులో తొలినాళ్లలో టెంట్ హాల్స్ లో మ్యాట్నీ షోలకు అవకాశం ఉండేది కాదు. కనుక రాత్రిపూట మొదటి, రెండవ షోలు మాత్రం వేసేవారు. పర్మినెంట్ హాల్స్ వచ్చాక కూడా తొలత ఇదే పద్ధతి కొన్నాళ్లు సాగింది. టికెట్టు ధరలు రెండు, నాలుగు, ఆరు, పది అణాలుగా ఉండేది. అయితే కాస్త ఎక్కువ డబ్బు పెట్టగలిగే వారికి ప్రత్యేకంగా అమర్చిన విశాలమైన సోఫా టికెట్టు రెండు రూపాయలుండేది. ఇంకా అప్పట్లో థియేటర్స్ లో సినిమాలతో బాటు నాటకాలు కూడా ప్రదర్శించేవారు. సంగీత కచేరీలు నిర్వహించేవారు. ఈ ప్రదర్శనల్లో ముందు కూర్చునే వారికి ఎక్కువ ధర టికెట్లు, వెనుక వరుసలో కూర్చునే వారికి తక్కువ ధర టికెట్లు ఉండేవి. కాలక్రమంలో థియేటర్లలో నాటక ప్రదర్శనలు ఆగిపోయి రెండు, మూడు షోలు కూడా సినిమాలే వేయడం మొదలైంది. దీంతో ఎక్కువ ధర టిక్కెట్టు కొన్నవారు వెనక్కి వెళ్లగా, తక్కువ ధర టిక్కెట్టు కొన్నవారు ముందుకు వచ్చారు. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే హైదరాబాదులో టాకీలతో మొదలు 1948 వరకు నమాజు సమయానికి ఇంటర్వెల్ ఇచ్చి, నమాజు తరువాత మళ్లీ తరువాతి సినిమా మొదలు పెట్టేవారు.

తొలి డిస్ట్రిబ్యూటర్ అలీబకర్
మరోవైపు ”నగరంలోని గౌలిగూడ బస్ స్టేషన్ దగ్గరలోని పుత్లీబౌలి వద్ద ‘చిమల్గీ’ ఫోటో స్టూడియో ఒకటి ఉండేది. అంతకుముందు ఆ భవనంలో ‘ఆస్రానీ బయోస్కోప్’ అనే థియేటర్ ఒకటి ఉండేది. ఇదే పేరుతో ‘దివాన్ దేవిడీ’లో కూడా మరో థియేటర్ ఉండేది. ఇవేగాక అఫ్జల్ గంజ్ మార్వాడీ ప్రెస్ సమీపంలో ‘సిటీ టాకీస్’ పేరుతో మరొక థియేటర్ కూడా ఉండేది” అని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇవన్నీ ఇలా ఉండగా 1929లోనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి ‘అలీ బ్రదర్స్’ పేరిట నెలకొన్నది. 18 ఏండ్ల అలీ బకర్ దీన్ని స్థాపించడం ఆసక్తికరమైన విషయం.
ఈ మూకీల కాలంలో సికిందరాబాదు ప్రాంతం అంతా బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండేది. వాళ్లకు స్వంత పోలీసు వ్యవస్థ, మున్సిపాలిటీ ఉండేవి. బ్రిటిషర్ల ప్రభావం సికిందరాబాదులో ఎక్కువగా ఉండేది. చాలా వీధులకు కింగ్స్ వే, జేమ్స్ స్ట్రీట్, ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్, పార్క్ లేన్ వంటి బ్రిటిష్ పేర్లు పెట్టారు. జాన్ బర్టన్ అండ్ కో, క్లోతర్స్ అండ్ అవుట్ ఫిట్టర్స్, క్లిఫార్డ్ టైలర్స్, అలెగ్జాండర్ అండ్ కో వంటి పేర్లు ఎక్కువగా కనిపించేవి. ఈ దుకాణాల యజమానులు దాదాపుగా అంతా ఆధునిక వస్త్రధారణతో ఉండేవారు. ఎక్కువగా సూటు వేసుకుని బూట్లు ధరించి కనిపించేవారు. ఇక్కడ హెరీటళ్లు, రెస్టారెంట్లు కూడా బ్రిటీషర్ల చేతనే నడుపబడేవి. ‘ది మాంట్ గోమెరీ, ‘లిడో” వాటిలో కొన్ని. ఇక్కడ ఉండే థియేటర్లకు కూడా డ్రీమ్ లాండ్, టివోలి, మినర్వా వంటి యురోపియన్ పేర్లుండేవి. డ్రీమ్ ల్యాండ్ థియేటర్ ను ప్రఖ్యాత హిందీ చిత్రనిర్మాత, దాదాఫాల్కే అవార్డు గ్రహీత సోహ్రాబ్ మోడీ నిర్మించిన విషయం ఈ తరంలో చాలా మందికి తెలియదు.

జంట నగరాలలో తొలినాటి సినిమా టాకీసులు
అబిడ్స్‌లో ఎక్సెల్షియర్, ప్యాలెస్, జమ్రూదు మహల్, కాచిగూడ లో వెస్టెండ్, సుల్తాన్ బజార్‌లో రాయల్ టాకీస్, మోతీ మహల్, చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద మినార్వ, పుత్లిబౌలిలో కిస్మత్ టాకీస్, నయా పూల్ వద్ద కష్ణ టాకీస్ ఉండేది.
ఇక కంటోన్మెంట్ ఏరియా గా లేదా లష్కర్ ప్రాంతంగా చెప్పుకొనబడే సికింద్రాబాదులో రివోలి టాకీస్ (ఆక్స్ఫర్డ్ స్ట్రీట్), బ్రిటిష్ టాకీస్ (హెల్లో బోల్టన్ రోడ్), టివోలీ (బోల్టన్ రోడ్), రాజేశ్వరి (మార్కెట్ స్ట్రీట్), మనోహర్ టాకీస్( సెంట్ మేరీస్ రోడ్డు), ఇంపీరియల్ టాకీస్ (నాగన్న దేవిడి), ఎంపైర్ టాకీస్ (హిల్ స్ట్రీట్), గ్యారీసన్ టాకీస్ (తిరుమలగిరి ) టాకీసులు ఉండేవి.
- హెచ్ రమేష్ బాబు, 7780736386



