అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలతో మరోసారి చైనాపై విరుచుకుపడ్డాడు. అంటే అంతకు ముందున్న ముప్పయి శాతంతో కలిపి ఇపుడు చైనా సరుకులపైన 130 శాతం సుంకం అమలవుతుందన్నమాట. ఇటీవల భారత్‌పైన యాభై శాతం సుంకాలు విధించిన విషయం మనకు తెలుసు. దీనిలో రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీగా ఇరవై ఐదు శాతం సుంకం విధించారు. అపుడు రష్యానుండి చైనా కూడా ఆయిల్ కొంటోందిగదా? మరి దానిపైన ఎందుకు సుంకం వేయట్లేదు అనే వాదనలు ముందుకొచ్చాయి. అయితే ఇపుడు చైనాపైన వంద శాతం సుంకాలు వేయటం రష్యానుండి ఆయిల్ కొంటున్నందుకు కాదు. చైనా తన రేర్‌ఎర్త్ ఖనిజాల ఎగుమతులపైన ఆంక్షలు విధించినందుకు ఈ సుంకాలు వేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపైన సుంకాల దాడి సాగిస్తున్న విషయం మనకు తెలుసు.
మిగతా దేశాలలాగా కాకుండా ఈ దాడిని చైనా మొదటి నుండీ ప్రతిఘటిస్తూ వస్తున్నది. ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా తానూ అమెరికాపై సుంకాలు విధించింది. ఒకదశలో 145శాతం దాకా చైనాపై సుంకాలు విధించిన ట్రంప్ చివరకు తాను విధించిన సుంకాలన్నింటినీ వెనక్కు తీసుకోక తప్పలేదు. చైనా ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా మార్కెట్ ఎంత అవసరమో, అమెరికా ప్రజలకు చైనా ఉత్పత్తులు అంతకంటే ఎక్కువ అవసరం. అందువల్లే మొదట బింకం ప్రదర్శించినా ట్రంప్ చివరకు చైనాతో రాజీకి దిగిరాక తప్పలేదు. అయితే అమెరికా చైనాల మధ్య ఇంకా పూర్తి వాణిజ్య ఒప్పందం కుదరలేదు. నవంబర్ వరకూ సుంకాల అమలును వాయిదా వేశారు. సుంకాల సంగతి అలా ఉంచితే చైనా అభివృద్ది తనను మించిపోతోందని దాన్ని నెంబర్‌వన్ ఆర్ధిక వ్యవస్థగా ఎదగకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికా గత పదేండ్లుగా పడరాని పాట్లు పడుతోంది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2016 నుండే చైనాపై సుంకాల దాడి ప్రారంభించాడు. అలాగే టెక్నాలజీ అభివృద్ధికి కీలకమైన ఆధునిక సెమీకండక్టర్లను చైనాకు ఎగుమతి కాకుండా అడ్డుకున్నారు.
2022లో డచ్‌కంపెనీ ఎస్‌ఎమ్‌ఎల్, అమెరికాకు చెందిన ఎన్‌విడియా, తైవాన్ టిఎస్‌ఎమ్‌సి కంపెనీలు చైనాకు అడ్వాన్స్‌డ్ చిప్స్‌ను ఎగుమతి చేయరాదంటూ అమెరికా అంక్షలు విధించింది. అపుడు అమెరికా అధికారులు తమ దేశ భద్రత కోసమే ఇదంతా అని వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది కాదు. చైనా సాంకేతికంగా అభివృద్ధి కావడాన్ని అడ్డుకునేందుకే ఆ చర్యలు తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. చైనా అప్పటి నుండే పాఠం నేర్చుకున్నది. తన అభివృద్ధిని అపలేదు. భారీ పెట్టుబడులతో తాను స్వంతంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని దీటుగా పెంచుకోగలిగింది. ఒకపుడు గూగుల్ సిఇఏ ‘చైనా మాకంటే చాలా వెనకబడి ఉంది. అది మమ్మల్ని దాటడం అసాధ్యం’ అన్నాడు. కానీ చైనా దాన్ని అధిగమించగలిగింది. ప్రపంచంలోనే ప్రతి ఏటా అత్యధిక స్టెమ్ (సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్,మాథ్స్) గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తున్న చైనాకు వ్యతిరేకంగా అలాంటి కామెంట్లు చేయటం, నిలబడటం అసాధ్యమని ఇప్పుడు అందరికీ అర్థమౌతోంది. అందుకే ప్రపంచ దిగ్గజ సెమీకండక్టర్ తయారీ సంస్థ ఎన్‌విడియా సిఐఓ జన్‌సేన్ ”ఇదివరకు చైనా మనకంటే చాలా వెనకబడి ఉందనుకునేవాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. అది ముందుకు దూసుకపోతోంది, వెనకబడి లేదు.” అన్నాడు.
చైనా ఈ అభివృద్ధి సాధించిన తర్వాత ఇప్పుడు అమెరికా సుంకాలకు తగు సమాధానాలిస్తోంది. ఇప్పటివరకూ చైనా ఓడలపైన అమెరికా పోర్టులలో ఫీజులు పెంచి, చైనా కంపెనీలపైన ఆంక్షలు విదించి రకరకాలుగా చైనా అభివృద్ధిని అడ్డుకోవాలని అమెరికా ప్రయ త్నించింది. ఇపుడు చైనా అమెరికా ఓడలపైన చైనా పోర్టులలో ఫీజులు పెంచుతోంది. తాజాగా చైనా తన రేర్ ఎర్త్ ఎగుమతులపైన ఆంక్షలు విధిస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మిలటరీ ఉత్పత్తులకు ఉపయోగించటంపై పూర్తి నియంత్రణ విధించింది. ప్రతి ఎగుమతికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని ఆంక్షలు విధించింది. అమెరికా ఆంక్షల్లాగా కాకుండా చైనా చర్యలు పూర్తిగా చట్టపరమైనవి. అంతర్జాతీయ నియమాలు, డబ్ల్యూటిఓ నిబంధనలకనుగుణంగానే ఈ చర్యలు తీసుకోబడ్డాయని కూడా చైనా తేల్చిచెప్పింది. రేర్‌ఎర్త్ ఖనిజాలనేవి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు తప్పనిసరి అవసరం. సెల్‌ఫోన్, ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్, జెట్ విమానాలు, రాకెట్లు వగైరా యుద్ధసామాగ్రి అన్ని ఉత్పత్తులు రేర్‌ఎర్త్ ఖనిజాలు లేకుండా జరగవు.
అంటే ఇప్పటివరకూ చైనాకు సెమీకండక్టర్ల ఎగుమతులు ఆపివేసిన డచ్ కంపెనీ ఎఎస్‌ఎమ్‌ఎల్ ఇపుడు తన సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన రేర్‌ఎర్త్ ఖనిజాలకు చైనా అనుమతి తీసుకోవాలి. అలాగేటి ఎస్‌ఎమ్‌సి (తైవాన్), ఇన్‌టెల్, ఎన్‌విడియా వగైరా ఏ ప్రఖ్యాత సెమికండక్టర్ తయారీ సంస్థలైనా తమ ఉత్పత్తులకు ఇపుడు చైనా అనుమతి తీసుకోవాల్సిందే. ఈ చర్యలను అమెరికాపైనా, మిగతా ప్రపంచంపైనా చైనా వాణిజ్యయుద్ధం ప్రకటించినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాఖ్యానించారు. కానీ జరిగింది అదికాదు. ఇప్పటివరకూ అమెరికా అనుసరించిన విధానాన్నే చైనా తన శైలిలో తిప్పికొడుతున్న చర్య తప్ప మరోటి కాదు. రేర్‌ఎర్త్ ఖనిజాలు మొత్తం ప్రపంచంలో 70 శాతం చైనాలోనే ఉన్నాయి. అంతేగాక వాటి ప్రాసెసింగ్ 95శాతం చైనాలోనే జరుగుతుంది. సుంకాల యుద్ధంలో చైనా వాడుతున్న ఈ ఆయుధాన్ని బలహీనం చేయటానికి ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల పాకిస్తాన్‌కు దగ్గరవుతున్న కారణాల్లో ఇదొకటి. పాకిస్తాన్‌లో రేర్‌ఎర్త్ ఖనిజాలు ఉన్నాయి. వాటి తవ్వకానికి, ప్రాసెసింగ్‌కు పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చు కున్నారు.
అయితే పాకిస్తాన్ వాడే ప్రాసెసింగ్ టెక్నాలజీ చైనాది. దానిపైన చైనా తాజాగా ఆంక్షలు విధించింది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయటం అంత సులభం కాదు. కనీసం పదేండ్ల సమయం అవసరమౌతుంది. అందువల్ల అమెరికా ఆగడాలను కట్టడి చేయటానికి ఈ ఖనిజాలు చైనాకే కాక ప్రపంచ శాంతికాముకులందరికీ ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. అందుకే 1992లోనే చైనా నాయకుడు డెంగ్‌పియావో పింగ్ ఏమన్నాడంటే ”మధ్య ఆసియా దేశాలకు ఆయిల్ ఒక ఆయుధం అయినట్లుగానే, భవిష్యత్తులో రేర్‌ఎర్త్ ఖనిజాలు మాకు ఆయుధాలు అవుతాయి.” అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. రేర్‌ఎర్త్ ఖనిజాల కొరత ఇండియాకు కూడా ఉంది. ప్రంపంచంలోని అన్ని దేశాలకు ఆ ఖనిజాల అవసరం ఉంటుంది. చైనా విధించిన షరతుల్లో మిలటరీ ఉత్పత్తులకు వినియోగించటంపైన షరతులు కీలకమైనవి. ఇండియా లాంటి దేశాలకు ఈ ఖనిజాలు ఇవ్వటానికి చైనా పెడుతున్న షరతు ఏమిటంటే వాటిని తమ అవసరాలకు ఉపయోగించుకోవాలి తప్ప అమెరికాకు తిరిగి ఎగుమతి చేయరాదు. అలాగే తమ రేర్‌ఎర్త్ ఖనిజాలతో తయారైన వస్తువులను కూడా అమెరికాకు ఎగుమతులు చేయరాదు. ఈ షరతులకు అంగీకరించి రేర్‌ఎర్త్ ఖనిజాలు పొందే అవకాశం ఇండియాకు ఉంది.
రేర్‌ఎర్త్ ఖనిజాలపై చైనా విధించిన ఆంక్షలకు ప్రతిగా చైనాపై వందశాతం సుంకాలు విధిస్తున్నామని, అవి నవంబర్ ఒకటి నుండి అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించాడు. ఆ వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్కరోజులోనే రెండు లక్షల కోట్ల డాలర్ల సొమ్ము ఆవిరైపోయింది. ఈ సుంకాలు, రేర్‌ఎర్త్ ఖనిజాలపై ఆంక్షలు కొనసాగుతాయా? లేక ట్రంప్ ఎప్పటిలాగే దిగివచ్చి చైనాపైన విధించిన టెక్నాలజీ ఆంక్షలన్నింటినీ ఎత్తివేసి ఒప్పందానికి వస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఒకవైపు ట్రంప్ సుంకాల ప్రకటన చేస్తూ బీరాలు పలుకుతున్నా అమెరికా ఆర్థికమంత్రి బిసెంట్ మాత్రం ‘చైనాతో చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా ఒప్పందం కుదురుతుందనే ఆశాభావంతో ఉన్నాం’ అంటూ ప్రకటనలు చేస్తున్నాడు. అమెరికా అక్రమ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి జరుగుతున్న ఈ ధర్మయుద్ధంలో భారత ప్రభుత్వం కూడా చురుకైన పాత్ర నిర్వహించటం అవసరం. మన వ్యవసాయ రంగాన్ని కబళించే ఉద్దేశంతో ట్రంప్ విధించిన యాభైశాతం సుంకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి చైనాతో, బ్రిక్స్ దేశాలతో కలిసి నడవడమే మన ముందున్న సరైన మార్గం.
తమ్మినేని వీరభద్రం