Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంఇథనాల్‌ ప్లాంటు రద్దు చేయాలి

ఇథనాల్‌ ప్లాంటు రద్దు చేయాలి

- Advertisement -

రాజస్థాన్‌లో ఎస్కేఎం భారీ మహాపంచాయత్‌
వెనక్కి తగ్గిన బీజేపీ సర్కార్‌

జైపూర్‌ : రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రతిపాదిత ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతుల ఆందోళన నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) హనుమాన్‌గఢ్‌లోని ధన్‌మండిలో భారీ మహాపంచాయత్‌ నిర్వహించింది. టిబ్బి పట్టణంలోని రతి ఖేరా ప్రాంతంలో ప్రతిపాదిత ఇథనాల్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసన జరిగింది. జిల్లా కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌తో జరిగిన చర్చలో ఎస్కేఎం నాయకులు ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల వ్యవసాయం, భూగర్భ జలవనరులు, పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపారు.

ఈ అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్‌, పోలీస్‌ సూపరింటెండెంట్‌ హామీ ఇచ్చారు. నిరసన తెలుపుతున్న రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని భరోసా ఇచ్చింది. ఈ మహా పంచాయతీని ఉద్దేశించి రైతు నాయకులు అఖిల భారత కిసాన్‌ సభ కోశాధికారి పి. కృష్ణ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్‌ సింగ్‌, పుష్పేంద్ర త్యాగి, జిల్లా కార్యదర్శి బల్వంత్‌ పూనియా, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాకేశ్‌ తికాయత్‌, జోగిందర్‌ ఉగ్రవాల్‌ సహా తదితరులు ప్రసంగించారు. వ్యవసాయం, ప్రజారోగ్యం, సహజవనరులను పణంగా పెట్టి అభివృద్ధి ప్రాజెక్టులను విధించలేమని వక్తలు నొక్కి చెప్పారు.

ఇథనాల్‌ ఫ్యాక్టరీతో కష్టాలు..
ఇథనాల్‌ ఫ్యాక్టరీ అధిక భూగర్భ జలాల వెలికితీత, వాయుకాలుష్యం, దీర్ఘకాలిక పర్యావరణ నష్టానికి దారితీస్తుందని ఆరోపిస్తూ రైతులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆందోళనలో విస్తృత భాగస్వామ్యం కనిపించింది. ఇందులో వేలాది మంది మహిళా రైతులు పాల్గొన్నారు. ఇది అట్టడుగు స్థాయిలో బలమైన ప్రతిఘటనను ప్రతిబింబిస్తుంది. అయితే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా నిరసన తీవ్రమవుతోంది. జులైలో, కంపెనీ ప్రతిపాదిత స్థలంలో సరిహద్దు గోడను నిర్మించడం ప్రారంభించిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. డిసెంబర్‌ 10న, టిబ్బి సబ్‌-డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టారు. ఆ సాయంత్రం తరువాత, వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఫ్యాక్టరీ స్థలానికి చేరుకుని, సరిహద్దు గోడలోని భాగాలను కూల్చివేసి, పోలీసులతో ఘర్షణకు దిగారు.

ఇదిలా ఉండగా, ప్రతిపాదిత ఇథనాల్‌ ప్లాంట్‌ వల్ల భూగర్భజలాలు, పర్యావరణంపై పడే సంభావ్య ప్రభావాన్ని పరిశీలించడానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బికనీర్‌ డివిజన్‌ కమిషనర్‌ అధ్యక్షత వహిస్తారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ ప్యానెల్‌లో హనుమాన్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన సీనియర్‌ పర్యావరణ ఇంజినీర్లు, భూగర్భ జలాల శాఖ ముఖ్య ఇంజనీర్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
మహా పంచాయత్‌కి ముందు, జిల్లా యంత్రాంగం కఠినమైన భద్రతా చర్యలను విధించింది. ధన్‌ మండి ప్రధాన ద్వారం తప్ప అన్ని ప్రవేశద్వారాలు మూసివేశారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. బహుళ పొరల బారికేడ్లను నిర్మించారు. నిరంతర గస్తీతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -