మమ్మల్ని మేం రక్షించుకోగలం : ఈయూ కౌన్సిల్
బ్రస్సెల్స్ : అమెరికా ప్రతిపాదించిన శాంతి మండలిపై యురోపియన్ యూనియన్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. ఏ రకంగా తమపై బలవంతపు చర్యలు చేపట్టినా తమని తాము రక్షించుకుంటామని తెలిపింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈయూ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. అనంతరం కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటానియో కోస్టా పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు సంబంధించిన పలు అంశాలపై ఈయూకు తీవ్ర సందేహాలు ఉన్నాయని కోస్టా తెలిపారు. అసలు ఈ మండలి పరిధి ఎంతవరకు వుంటుంది, దీనిపాలనా వ్యవహారాల పరిస్థితి ఏమిటి, యూఎన్ నిబంధనావళితో దీనికి గల సంబంధాలెలా వుంటాయనే అంశాలపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
ఒకవేళ యురోపియన్ యూనియన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినా వాటి నుంచి తమను తాము కాపాడుకోగలమని, సభ్య దేశాల ప్రజలు, వాణిజ్యంతో సహా మొత్తంగా ఈయూ ప్రయోజనాలు పరిరక్షించుకుంటామని చెప్పారు. అవసరమైనపుడు ఉపయోగించడానికి వీలుగా ఈయూ వద్ద కావాల్సిన సాధనాలు, సామర్ధ్యాలు ఉన్నాయన్నారు. అమెరికా తాజాగా చేస్తున్న బెదిరింపులు, గ్రీన్‌లాండ్‌పై తాజా వ్యాఖ్యలు, తరువాత ట్రంప్ తీసుకోబోయే చర్యలు వంటి అంశాలపై చర్చించేందుకు గురవారం పొద్దుపోయిన తర్వాత ఈయూ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు.
మేం బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరం : స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్
ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో మేం చేరబోమని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ పేర్కొన్నారు. గురువారం బ్రస్సెల్స్‌లో జరిగిన ఇయూ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ”మేము ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను నిరాకరిస్తున్నాం” అని అన్నారు. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి , బహుళ ధ్రువప్రపంచం పట్ల స్పెయిన్ నిబద్ధత కలిగి ఉందని, కానీ ఈ ఒప్పందంలో పాల్గొనడానికి నిరాకరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో పాలస్తీనియా కూడా చేరలేదని తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఇటీవల జరిగిన బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనడా, బ్రిటన్, హంగేరీ, బల్గేరియా మినహా అన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు గైర్హాజరైన సంగతి తెలిసిందే. అలాగే ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి మధ్యప్రాచ్య దేశాలతో పాటు ఇజ్రాయిల్ కూడా ఈ బోర్డులో చేరింది.
ఇది శాంతి మండలి కాదు.. పీస్ (ముక్క) ట్రంప్ తీరుపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
గాజా ‘శాంతి మండలి’పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇది శాంతి మండలి కాదు.. పీస్ (ముక్క) అంటూ విమర్శలు చేశారు. తొలిసారి ఈ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘శాంతి మండలి ఏర్పాటు గురించి నేను విన్నాను. అది పీస్(ముక్క) అని అనుకున్నా. గ్రీన్‌లాండ్, వెనిజులాలాగే అది ఒక చిన్న ముక్క’ అని వ్యాఖ్యానించారు. దీంతో వేదిక వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా తమకు ఎప్పటికీ కావాల్సింది శాంతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెనిజులాను తామే పరిపాలిస్తామని ట్రంప్ ప్రకటించడం, మరోవైపు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనానికి ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ట్రంప్ శాంతి మండలిపై ఈయూ సందేహాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



