Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్‌ ఆధారాలు భద్రం

ఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్‌ ఆధారాలు భద్రం

- Advertisement -

ఇతర కేసుల సాక్ష్యాలూ సేఫ్‌
ప్రమాద కారణాలను పోలీసులు తేలుస్తారు
ఎఫ్‌ఎస్‌ఎల్‌ కార్యకలాపాలు యథాతథం
రాజకీయ ఆరోపణలపై స్పందించను
టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శిఖా గోయెల్‌ వెల్లడి

నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కలకలం రేపిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులకు సంబంధించిన ఆధారాలు భద్రంగా ఉన్నాయని ఆ విభాగం డైరెక్టర్‌ కూడా అయిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డీజీపీ శిఖా గోయెల్‌ స్పష్టం చేశారు. ఆదివారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నూతన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్ని ప్రమాద వివరాలను తెలిపారు. దేశంలోనే ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లలో ఒకటైన తమ ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో శనివారం ఉదయం 10.08 గంటలకు ప్రమాదం సంభవించిందని ఆమె చెప్పారు. ఆ సమయంలో అటెండర్‌ సాయిక్రిష్ణ మాత్రమే ఉన్నారనీ, మొదటి అంతస్తులోని కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ గదిలో పొగలు, మంటలు రావడాన్ని గమనించి వెంటనే తన పైఅధికారి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడనీ, వెంటనే ఆయన ఫైర్‌ సర్వీస్‌ విభాగానికి తెలపడం, కొద్ది నిమిషాల్లోనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను ఆర్పడం ప్రారంభించిందని ఆమె వివరించారు.

మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పారు. అయితే ఈ ప్రమాదం కేవలం మొదటి అంతస్తులోని కంప్యూటర్‌ సైన్స్‌ ల్యాబ్‌ వరకే పరిమితమైందనీ, పైన ఇతర విభాగాలకు ఎలాంటి నష్టమూ వాటిళ్లలేదని శిఖా గోయెల్‌ తెలిపారు. తగలబడ్డ గదిలో నుంచి చాలా వరకు వివిధ కేసులకు సంబంధించిన ఆధారాలను సురక్షితం చేయడం జరిగిందని ఆమె అన్నారు. ముఖ్యంగా 2015లో ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన 16 ఆధారాల విశ్లేషణ 2021లోనే జరిగిందని, దానికి సంబంధించిన నివేదిక, ఆధారాలను కోర్టుకు సమర్పించడం జరిగిందని తెలిపారు. 2024లో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన 136 ఆధారాల్లో ఏడు మినహా మిగతావాటిని విశ్లేషించి సంబంధిత కోర్టుకు సమర్పించడం జరిగిందనీ, మిగతా ఏడు ఆధారాలు భద్రంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

వీటితో పాటు ఇతర ఆధారాలపై కొన్ని మీడియా, సామాజిక మాధ్యమాలల్లో వస్తున్న వార్తలలో ఏ మాత్రమూ నిజం లేదని ఆమె ఖండించారు. దగ్ధమైన గదిలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన సాక్ష్యాలు దాదాపుగా సురక్షితంగా ఉన్నాయనీ, ఇంకా ఏదేని నష్టం జరిగిందా అనేది పరిశీలన జరుపుతున్నామని ఆమె తెలిపారు. కొన్ని ఆధారాలు దగ్ధమైనా వాటిలోని వివరాలను తాము సేకరించగలుగుతామని భరోసా ఇచ్చారు. ల్యాబ్‌లో మంటలు చెలరేగగానే లోపల ఉన్న అగ్నిమాపక పరికరాలతో వాటిని అదుపు చేసే ప్రయత్నం జరిగిందనీ, కానీ సఫలీకృతం కాలేకపోయారని ఆమె ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. మొత్తం ఎన్ని కేసులకు సంబంధించిన ఆధారాలు ఆ గదిలో ఉన్నాయన్న ప్రశ్నకు దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా విచారణ జరిపాక తెలియజేస్తామని శిఖా గోయెల్‌ అన్నారు. ఈ ఘటన వెనుక ఏదేనీ కుట్ర ఉందా అనే ప్రశ్నకు… ప్రాథమికంగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామనీ, అసలు కారణాలను పోలీసులు దర్యాప్తు జరిపి తేలుస్తారని ఆమె మరో ప్రశ్నకు జవాబిచ్చారు.

మొదటి అంతస్తులోని ప్రమాదం చోటు చేసుకున్న గది తప్ప ఆ భవనంలోని ఇతర విభాగాలు సురక్షితంగా ఉన్నాయనీ, తమ ఎఫ్‌ఎస్‌ఎల్‌ కార్యకలాపాలు యథాతథంగా సాగుతాయని ఆమె చెప్పారు. ల్యాబ్‌లో అనేక కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, సర్వర్లు, పెన్‌డ్రైవ్‌లతో పాటు ఇతర విలువైన సాంకేతిక పరికరాలకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందనే విషయాన్ని తమ ఆడిట్‌లో తేలుస్తామని శిఖా గోయెల్‌ అన్నారు. మొత్తమ్మీద ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్న ఊహాగానాలకు ఆస్కారమే లేదని ఆమె మరోసారి ఉద్ఘాటించారు. ఓటుకు నోటు కేసు మొదలైన కీలకమైన కేసుల ఆధారాలను ధ్వంసం చేయడానికి ఈ కుట్ర జరిగిందని రాజకీయంగా వస్తున్న ఆరోపణలపై తాను స్పందించనని శిఖా గోయెల్‌ మరో ప్రశ్నకు స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -