అనాది నుండి ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తూనే ఉంది. సాటి ప్రాణులతో నిరంతరం ఘర్షణ పడుతూ మెరుగైన జీవితం కోసం ఆరాటపడుతూనే ఉంది. ఆదిమానవుడు చెట్టు తొర్రలో, కొండ గుహలో జీవనాన్ని కొనసాగించేస్థితి నుండి నేటి వరకు కాలచక్రగమనంలో నిరంతరం అనేక పోరాటాలు చేస్తూ ఒక తెలివైన జీవిగా మిగతా జీవుల కన్నా భిన్నంగా జీవనాన్ని కొనసాగిస్తూ మొత్తం జగత్తునే తన గుప్పిట్లో ఉంచుకోవాలన్న తపనతో ముందుకు సాగుతున్నాడు. ఇదంతా మనిషి తన అస్తిత్వం చాటుకోవడం కోసంచేసిన ప్రయత్నమే. మానవులు అనేక వర్ణాలు, కులాలుగా విభజించబడిన సందర్భంలో బలవంతుడు బలహీనుని పీడించిఅతని ఉనికిని లేకుండా చేసి ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు అణగదొక్కబడినటువంటి కులాలవారు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. స్త్రీ వంటింటికి పరిమితం కావడం, దళితులు అంటరాని వారుగా వివక్షకు గురి కావడం, ఆధిపత్య వర్గాలు నిమ్న వర్గాల వారిని అణగదొక్కడం వంటి కారణాలవల్ల ప్రతి ఒక్కరు తమ అస్తిత్వం కోసం పోరాటం చేయడం ప్రారంభించారు.
1970 తర్వాత దళిత, స్త్రీ, బీసీ, ముస్లిం మైనార్టీ వాద ఉద్యమాలు రావడం వల్ల ప్రతిఒక్కరు తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో తమ ఉనికిని చాటుకోవడం కోసం తమతమ వత్తుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి కలాలను ఆయుధాలుగా మార్చి ఉద్యమిస్తున్నారు. వెనుకబడిన తరగతుల్లోని అన్ని కులాలవారు తమ అస్తిత్వం కోసం ఆయా కులాలకు చెందిన కవులే కాకుండా ఇతర కవులు కూడా ఆయా వత్తుల గొప్పతనాన్ని తెలియజేస్తూ సాహిత్య సజన గావిస్తున్నారు. గౌడుల ఆస్తిత్వాన్ని మామిండ్ల రామాగౌడ్, ఆచార్య ననుమాస స్వామి, నేరెళ్ల శ్రీనివాస్, కె.వి.ఎల్, కొంపెల్లి వెంకట్‌గౌడ్, డాక్టర్ తండు కష్ణ కౌండిన్య, మోత్కుల నారాయణ గౌడ్, డాక్టర్ పాండాల మహేశ్వర్, డాక్టర్ తండ హరీశ్‌గౌడ్, మెరుగు మల్లేశం, నకిరెకంటి శ్రీనయ్య, పల్లె దీక్షిత మొదలగువారు గౌడుల అస్తిత్వాన్ని తమ రచనల ద్వారా చాటి చెప్పారు. గౌడ కులస్తుడు కాకపోయినా ప్రముఖ కవి అంబటి వెంకన్న రాసిన ‘కల్లు పాట’ గేయం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఇదే స్పహతో కవిత్వం రాస్తూ గౌడ జాతి అభ్యున్నతి కోసం పాటుపడుతూ గౌడ జాతి ఆత్మాభిమానాన్ని, గౌడుల జీవన విధానాన్నిచాటి చెబుతూ శీలం భద్రయ్య రాసిన కవితా సంపుటే ఈ ‘ముస్తాదు’.
శీలం భద్రయ్య కథా రచయితగా, కవిగా సుప్రసిద్ధులు. ఈయన గౌడ కుల వృత్తి అస్తిత్వ స్పహతో రాసిన కవితా సంపుటి ముస్తాదు. ఇందులోని కవితలు గౌడుల జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయి. గౌడ జాతి జీవన విధానం సంస్కతి అంతా తన కవిత్వం ద్వారా ఏకరువు పెట్టారు. తాటి చెట్టుతో గౌడు నడుముకు ఉన్న మోకు బిడ్డ మెడలో బొడ్డుతాడుగా ఉంటుందని చెప్పడంలో తల్లికి బిడ్డకు ఉన్న పేగు బంధం గొప్పతనాన్ని తెలియజేశారు. ఆరుద్ర కార్తెలో ఆరుద్ర పురుగు ఏ విధంగా ఉంటుందో గౌడన్నల జీవితం కూడా ఉరుకులు పరుగుల జీవితమని చెప్పడం బాగుంది. ”శ్లోకం కంటే శోకాన్ని పాపే నా రేకపవిత్రం” అంటూ శ్లోకం వల్ల శోకం తొలగిపోతుందో లేదో తెలియదు కాని రేక వల్ల శోకం తొలగిపోతుంది అని చెప్పడం నిజమైన అస్తిత్వ వాదానికి నిదర్శనం. గుక్కపట్టి ఏడ్చే పాపకు తీయటి కల్లును తాగించినప్పుడు తప్పకుండా ఆ బిడ్డ దుఃఖాన్ని తీర్చి వేస్తోంది. ఎంత నిజాయితీగా కల్లు పోసినా తప్తి పడని వారికి దీటుగా సమాధానం ఇస్తూ ”యాదికుంచుకో మందు కల్లు కాదు మాది/ ఎతశితకు మందు కల్లు” అంటూ కల్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. మంగళ వాయిద్యాలతో కట్టిన మామిడాకు కన్నా తాటాకే గొప్పదంటారు.తాటి చెట్టు ఒక కల్పవక్షం లాంటిదని దానిలోని ప్రతి అణువు మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ”కర్ణుడిలా వనంలోని తాటి చెట్టు కల్పవక్షమే/ కోరిందల్లా లేదనకుండా ఇస్తుంది”అనితాటి చెట్టు గొప్పతనాన్ని కర్ణుడితో పోల్చడం సహజంగా ఉంది. గౌడు తాటి చెట్లు ఎక్కి వయసు మీద పడివెన్ను వంగిపోయినా అతడు తన వత్తిని కొనసాగిస్తూనే ఉంటాడు. అలాంటి స్థితిలో అతనికి తాటి చెట్టే భరోసా ఇస్తుందని కవిత్వీకరించి చెప్పిన విధానం బాగుంది. ”గౌడు ఎన్ను వంగిపోయినా/ అతని కోసం చెట్టు నిటారుగా నిలబడింది” అని చెప్పడంలో తాటిచెట్టు వద్ధాప్యంలో ఉండే గౌడన్నలకు ఆదరువు అన్న విషయాన్ని స్పష్టపరిచారు. గౌడులు కల్లు అమ్మే ప్రాంతాన్ని మండువా అంటారు. ఈ మండువా దగ్గరికి సమస్త కులాలవారు వచ్చి కల్లు తాగి తమ దాహాన్ని తీర్చుకుంటారు. అందుకే ఎన్ని బాధలతో వచ్చినా ఆ బాధలన్నింటిని మరిచిపోయి హాయిగా ఇంటికి మండువా నుండి పోతారంటే సమస్త కులాల వారి బాధను తొలగించే ఒక అద్భుతమైన శక్తి మండువాకు ఉంటుందని చెబుతూ ”జీవితంలో ఎన్ని పాట్లు పడ్డా/ మండువా దగ్గర ఒక పట్టుతో/ పాట్లు పాటగా మారుతాయి” అని చెప్పడమే ఇందుకు నిదర్శనం.
”ఎదిరించడం ఎగబాకడంతెలిసిన/ కత్తులు ధరించే సర్వాయి వారసులం” అంటూ గౌడులు తాటి చెట్టును ఎగబాకడమే కాదు రోషం ఉన్న వీరులని, బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోట సింహాసనాన్ని అధిష్ఠించిన సర్వాయి పాపన్న వారసులని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తాటి చెట్లను నరికి వేస్తూ గౌడవత్తిని విధ్వంసం చేస్తున్న విషయాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. ఎంత ఎత్తుకుతాటి చెట్టును ఎక్కినా గౌడుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తీకరించారు.
శీలం భద్రయ్య అద్భుతమైన కథనా నైపుణ్యంతో కథలను రాయడమే కాకుండా చక్కని భావనాశక్తితో శిల్ప సౌందర్యం కలిగిన కవితలు రాయడంలో కూడా దిట్ట. వీరికవితల్లో చక్కని భావచిత్రణతో పాటు శిల్పం కూడా ఉండి ఆ కవితలకు మరింత వన్నె తెచ్చాయి. తాటి చెట్లు జాగ్రత్తగా దాచుకున్న గుడ్లుగా తాటిముంజలను, నిత్యం మూడుసార్లు తాటి చెట్టును మొక్కే గౌడు అసలు సిసలైన ప్రకతి పూజారిగా అభివర్ణించిన విధానం బాగుంది. తాటి పండుమట్టి పొదల్లో దాక్కొని తోకతో తొంగి చూసింది, కల్లు తాగిన వెన్నెల నవ్వితే చీకటి కూడా చిన్న పోయింది, తాడు మీదున్న ఆశలకు ఈదరగాలి సమాధి కట్టింది,బుంగమూతి పెట్టకు బుంగలోని పొంగుతున్న కల్లుమనకోసమే నవ్వుతుంది, తాతలు నాటినుండి అనంత చీకటిని అక్షర జ్యోతిగా వెలిగించినది తాటాకుఅంటూ చెప్పిన కవితలు చక్కని భావచిత్రణకు నిదర్శనాలు.
వత్తిపట్ల ఉన్న గౌరవం, నిబద్ధత, అస్తిత్వస్పహ ఇవన్నీ శీలం భద్రయ్య కవిత్వంలో కనిపిస్తాయి. వస్తువుతోపాటు అద్భుతమైన భావచిత్రణ, శిల్ప సౌందర్యం కలిగి పాఠకుల మెదళ్లలోకి అతి సులభంగా ప్రవేశించే విధంగా ఇందులోని కవితలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో గౌడవత్తి సంబంధమైన రచనలు చాలా వచ్చినప్పటికీ ఒక వచన కవితాసంపుటిగా వెలువరించినవారు లేరని చెప్పవచ్చు. అందుకే ఈ ‘ముస్తాదు’ తొలి గౌడ ఆధునిక వచన కవితా సంపుటిగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోతుంది.
డా|| తండు కృష్ణ కౌండిన్య, 9704731346